ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:18 AM
అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని, ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఎల్లారెడ్డిపేట, అక్టోబరు7(ఆంధ్రజ్యోతి): అధికారంలోకి వస్తే ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి విస్మరించిందని, ఇప్పటికైనా ఆటో డ్రైవర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో నడవక.. ఉపాధి లేక ఈ నెల 5న ఆత్మహత్యకు యత్నించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ నాంపల్లి సతీష్‌ను మంగళవారం రాత్రి ఆయన పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రూ.25 వేలఆర్థిక సాయం అందించడంతో పాటు అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ తీరు వల్ల రాష్ట్రంలో 93 మంది ఆటో డ్రైవర్లు మృతి చెందారని, ఆ కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో అసంఘిటిత కార్మికుల పక్షాన తమ పార్టీ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్లకు బీమా సౌకర్యంతో పాటు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందిస్తామని మోసగించిందని అన్నారు. కుటుంబ పోషణ, అప్పులు, ఆటో కిస్తీలు కట్టలేక 93 మంది ఆత్మహత్య చేసుకున్నారని బాధితుల వివరాలను శాసనసభలో వెల్లడించినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. 23 నెలల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రూ.2 లక్షల 30 వేల కోట్ల అప్పులు చేసిందన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.24 వేల బాకీ డబ్బులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చే వరకు అన్ని కార్మిక సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసుకుని మెడలు వంచి హక్కులను సాధించుకుందామని కేటీఆర్ అన్నారు. అంతకు ముందుకు ఆటో డ్రైవర్లు తమ సమస్యలను పరిష్కరించేందుకు పాటు పడాలని కోరుతూ వినతిపత్రం అందించారు. నాప్స్‌కాబ్ చైర్మన్ రవీందర్‌రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, ప్యాక్స్ చైర్మన్ కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు కృష్ణహరి, మల్లేశం, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.