యాసంగి పంటలకు భరోసా..
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:06 AM
జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుండడంతో జలకళను సంతరించుకున్నాయి.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
జిల్లాకు వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుండడంతో జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటికే వేసిన వానాకాలం పంటలతో పాటు యాసం గి సీజన్‌లో పంటలు వేసేందుకు సాగు నీటికి ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌లో ఎస్సారెస్పీ ఎగువ ప్రాంతంలో వర్షాలు కురియడం ఆలస్యం కావడంతో ప్రాజెక్టు నిండుతుందా లేదా అని రైతులు ఆందోళనకు గురయ్యారు. ఒక్కో బొట్టు, ఒక్కో బొట్టు చేరుతుండడంతో ఒకింత రైతుల్లో ఆశలు చిగు రించాయి. ప్రాజెక్టు 45 టీఎంసీలకు చేరుకోవడంతోనే ప్రభుత్వం ముందుచూపుతో ఆగస్టు 7వ తేదీ నుంచి ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేసింది. గత వారం రోజుల నుంచి ప్రాజెక్టు క్యాచ్‌మెంట్ ఏరి యాలో భారీ వర్షాలు కురవడంతో పాటు మహా రాష్ట్రలోని బాలెగావ్, విష్ణుపురి ప్రాజెక్టులు నిండడంతో అదనంగా వచ్చే నీటిని గేట్ల ద్వారా వదిలి పెట్టడంతో భారీగా ప్రవాహం పెరిగింది. వారం రోజుల నుంచి ఎస్సారెస్పీ నుంచి ఆయకట్టు భూములకు సాగు నీటిని విడుదల చేస్తుండడంతోపాటు వరద కాలువ ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నది. అదనపు నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నది. శనివారం సాయం త్రం వరకు ఎస్సారెస్పీకి 4,50,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా 39 గేట్ల ద్వారా 5 లక్షల క్యూసెక్కుల నీటిని వదిలి పెడుతున్నారు. 80.5 టీఎంసీలకుగాను ప్రస్తుతం 58.357 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో నీటి పారుదల శాఖాధి కారులు ముందు జాగ్రత్తగా, బ్యారేజీకి 22 టీఎంసీల కుషన్‌తో దిగువకు నీటిని వదిలిపెడతున్నారు. వరద తగ్గుముఖం పట్టిన తర్వాత నీటిని నిల్వ చేయను న్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 7,60,652 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 37 గేట్ల ద్వారా 7,35,538 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదిలి పెడుతున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు నిండడంతో జిల్లాలో రైతులకు సాగు నీటికి ఢోకా లేకుండా పోయింది. జిల్లాలో ఈ సీజన్‌లో 2 లక్షల 70 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అవుతున్నాయి. ఇందులో ఎస్సారెస్పీ కింద లక్షా 70 వేల ఎకరాల భూములు సాగవుతున్నాయి. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో సాగు నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురు స్తుండడంతో కాలువల ద్వారా నీటి సరఫరాను నిలిపి వేశారు. వానాకాలం పంటతోపాటు యాసంగిలో కూడా ఎస్సారెస్పీ ఆయకట్టు భూములు పూర్తి స్థాయిలో సాగు కానున్నాయి. వరి పంట పెద్ద ఎత్తున రైతులు సాగు చేయనున్నారు. అలాగే శ్రీపాద ఎల్లం పల్లి ప్రాజెక్టు నుంచి మంథని నియోజకవర్గ పరిధిలోని సుమారు 15 వేల ఎకరాల భూములకు సాగు నీరం దుతున్నది. నంది రిజర్వాయర్ కింద కూడా 5 వేల ఎకరాలకు పైగా సాగు నీటిని అందించనున్నారు. యాసంగి సీజన్‌లో శ్రీపాద ఎల్లంపల్లి నుంచి రామ గుండం ఎత్తిపోతల పథకం ద్వారా రామగుండం నియోజకవర్గంలోని సుమారు 15 వేల ఎకరాల భూములకు సాగునీటిని అందించనున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది ఆలస్యంగా భారీ వర్షాలు కురిసినా ప్రాజెక్టులు త్వరగా నిండాయి. 246 టీఎంసీల నీళ్లు ఇప్పటికే గోదావరి పాలయ్యాయి. మరింత వరద పెరిగే అవకాశాలున్నాయి. ప్రాజెక్టులు నిండడంతో ఆయకట్టు రైతులు ఊపిరి పీల్చుకున్నారు.