గంజాయి సేవిస్తున్న యువకుల పట్టివేత
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:35 AM
మండలంలో గంజాయిని సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌లోని తిరుమల హోమ్స్ ఏరియాలో ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్నారు. పోలీసులకు సమాచారం వచ్చింది.
తిమ్మాపూర్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): మండలంలో గంజాయిని సేవిస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు పట్టుకున్నారు. ఎల్‌ఎండీ ఎస్సై శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మాపూర్‌లోని తిరుమల హోమ్స్ ఏరియాలో ముగ్గురు యువకులు గంజాయి సేవిస్తున్నారు. పోలీసులకు సమాచారం వచ్చింది. ఈ మేరకు పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులను చూసిన యువకులు పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. ఒకరు పారిపోయారు. వారి వద్ద తనిఖీ చేయగా 110 గ్రాముల గంజాయి దొరికింది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం, జయ్యారం గ్రామానికి చెందిన కోరండ్ల రఘువర్దన్‌రెడ్డి, అదే గ్రామానికి చింతకింద శ్రీకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రఘువర్దన్‌రెడ్డి లారీ డ్రైవర్‌గా పని చేస్తూ తిరుమల హోమ్స్‌లో గది అద్దెకు తీసుకుని శ్రీకృష్ణతోపాటు ఉంటున్నాడు. శ్రీకృష్ణ తిమ్మాపూర్‌లోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. కొంతకాలంగా వీరు తిమ్మాపూర్‌లోని ఒక హాస్టల్‌లో ఉంటున్న యువకుడి వద్ద గంజాయి కొనుక్కుని సేవిస్తున్నారు. వీరికి గంజాయి ఇచ్చిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. వీరి వద్ద నుంచి 110 గ్రాముల గంజాయితోపాటు ఒక మొబైల్, రెండు గంజాయి తాగే భంగ్ డబ్బాలను, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. తిమ్మాపూర్ హాస్టల్స్‌లో ఉంటున్న చాలా మంది విద్యార్థులు గంజాయికి అలవాటు పడుతున్నారని తమకు సమాచారం వచ్చిందని ఎస్సై చెప్పారు. గంజాయి సేవించినా, అమ్మినా నేరమన్నారు. గంజాయికి అలవాటు పడి జీవితం పాడు చేసుకోవద్దని ఎస్సై తెలిపారు. ఆయా హాస్టల్స్‌కు సంబందించిన యజమానులు విద్యార్థులపై నిఘా పెట్టాన్నారు. ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.