Share News

మనం భద్రమేనా?

ABN , Publish Date - Aug 30 , 2025 | 01:14 AM

వానాకాలంలో వర్షాలు, వరదల తీరు కొన్నేళ్లుగా తేడాలు కనిపిస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో మబ్బులు ముసురుకొని గంటల తరబడి కురిసే వర్షాలకు బదులు ఆకాశం బద్దలైనట్లుగా కుండపోత వాన కురుస్తోంది.

మనం భద్రమేనా?

జగిత్యాల, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో వర్షాలు, వరదల తీరు కొన్నేళ్లుగా తేడాలు కనిపిస్తున్నాయి. తుఫాన్‌ ప్రభావంతో మబ్బులు ముసురుకొని గంటల తరబడి కురిసే వర్షాలకు బదులు ఆకాశం బద్దలైనట్లుగా కుండపోత వాన కురుస్తోంది. 30 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 24 గంటల వ్యవధిలో 10 సెంటిమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని క్లౌడ్‌ బరస్ట్‌గా పిలుస్తారు. ఈ తరహా పరిస్థితి తలెత్తితే ఒక్కసారి వరద ఊరు, వాడ, పొలం, చెలక తేడా లేకుండా అంతా కమ్మేస్తుంది. కేవలం పది సెంటీమీటర్ల వర్షానికే పరిస్థితితులు ఇంత భయానకంగా మారతాయనుకుంటే.. గడిచిన నాలుగైదేళ్లుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా 30 సెంటీమీటర్లకు తక్కువగా కాకుండా వర్షం కురుస్తోంది. ప్రతీ సంవత్సరం ఒక జిల్లా క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా చిగురాటకులా వణికిపోతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఈ పరిస్థితి తట్టుకోవడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు జిల్లావాసుల్లో తలెత్తుతున్నాయి.

వరదలు వస్తే కష్టాలే...

యేటా వర్షాలతో వరద ఉధృతి పెరిగి ధర్మపురి, సారంగాపూర్‌, రాయికల్‌, మల్లాపూర్‌, ఇబ్రహీంపట్నం, కథలాపూర్‌, జగిత్యాల రూరల్‌, గొల్లపల్లి, బీర్‌పూర్‌, మెట్‌పల్లి, కోరుట్ల తదితర మండలాల పరిధిలో అనేక గ్రామాలకు రోజుల తరబడి రవాణా సౌకర్యం, రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఎదురవుతోంది. అయినప్పటికీ శాశ్వత బ్రిడ్జిల నిర్మాణం, ప్రమాదకరమైన రోడ్ల మరమ్మతులు తాత్కాలికంగా చేస్తున్నారు. ఈ సారి గత నెల వరకు అనుకున్న స్థాయిలో వర్షాలు లేకపోవడంతో వరదలు లేవు. ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండడంతో రవాణాకు అంతరాయం కలుగుతోంది. బ్రిడ్జిలు, లోలెవల్‌ కాజ్‌వేలు, ప్రమాదకరంగా ఉన్న రోడ్లు, కట్టల మరమ్మ తుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది.

హైవేపై నిలిచిపోతున్న రాకపోకలు

భారీ వర్షాలు కురిసిన సమయంలో పలు ప్రాంతాల్లో నేషనల్‌ హైవేపై వరదతో రాకపోకలు నిలిచిపోతున్నాయి. జిల్లాలో ఇబ్రహీంపట్నం మండలం బండలింగాపూర్‌ శివారులోని గండి హనుమాన్‌ దేవస్థానం నుంచి మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి పట్టణాల మీదుగా నేషనల్‌ హైవే - 65 వెళ్తోంది. అయితే వరదలు ఎక్కువగా వచ్చిన సమయాల్లో మెట్‌పల్లి మండలం మేడిపల్లి (పడమర) వద్ద ఉన్న లోలెవల్‌ కల్వర్టు కారణంగా పలు సందర్భాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. అదే విధంగా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట బ్రిడ్జి, మేడిపల్లి మండల శివారులోని కాకతీయ కాలువ బ్రిడ్జి ప్రమాదకరంగా ఉన్నాయి. జగిత్యాల రూరల్‌ మండలం అనంతారం, ధర్మపురి మండలంలోని పలు ప్రాంతాల్లో లెవల్‌ బ్రిడ్జి చిన్న పాటి వానకే నీట మునిగి రోజుల తరబడి రాక పోకలు, రవాణా బంద్‌ అవుతోంది.

రాళ్లవాగుకు తరచూ గండి..

కథలాపూర్‌ మండలంలోని రాళ్లవాగు కుడి కాలువ, ఎడమ కాలువలకు తరుచూ గండి పడుతున్న సందర్భాలు ఎదురవతున్నాయి. కొద్దిగా ఎక్కువ వర్షాలు పడిన సందర్భాల్లో రాళ్లవాగు కాలువలకు ఎక్కడో ఒక చోట గండి పడుతుండడం సర్వసాధారణంగా మారింది. తాత్కాలిక మరమ్మతులు జరిపి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. శాశ్వత చర్యలపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

వాగులు పొంగితే రాకపోకలకు అంతరాయం..

జిల్లాలో పలు ప్రాంతాల్లో వాగులు పొంగిపొర్లితే రాకపోకలు నిలిచిపోతున్నాయి. జిల్లాలోని సుమారు ముప్పయి ప్రాంతాల్లో లో లెవల్‌ బ్రిడ్జిలు వరద నీటికి మునిగిపోతున్నాయి. ప్రదానంగా ధర్మపురి మండలం ఆకుసాయిపల్లి, రాయికల్‌, గొల్లపల్లి, జగిత్యాల రూరల్‌, కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్‌, బీమారం, మేడిపల్లి తదితర మండలాల్లో ఓ మోస్తారు వర్షాలకే వాగు నీరు రహదారులపై ప్రవహించి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ధర్మపు రి మండలం, రాయికల్‌ మండలం వడ్డెలింగాపూర్‌, ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ, కథలాపూర్‌ మండలం భూషణ్‌రా వుపేట, ఇప్పపల్లి, తాండ్రియాల, వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి, రాయికల్‌ మండలం మైతాపూర్‌, భూపతి పూర్‌, రామోజిపేట, సారంగాపూర్‌ మండలం పోచంపేట, లచ్చక్కపేట, నాగునూరు తదితర ప్రాంతాల్లో వాగు నీరు రహదారిపైకి వచ్చి రాకపోకలు, రవాణాకు తరచూ అంతరాయాలు ఎదురవుతున్నాయి.

పట్టణాల్లోనూ పరిస్థితులు అంతే

జిల్లాలో ప్రధాన పట్టణాలు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలో భారీ వర్షాలు, వరదల సందర్భంగా పరిస్థితులు అధ్వానంగా ఉంటున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షపు నీరు చేరి జనం ఇక్కట్ల పాలవుతున్నారు. పలు కాలనీల్లోకి చెరువు నీరు, వరద నీరు చేరి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. జిల్లా కేంద్రంలోని గోవిందుపల్లి శివారులో గల లోలెవల్‌ వంతెనపైకి వరద నీరు వస్తే జిల్లా కేంద్రంతో కాలనీకి సంబంధాలు తెగిపోతున్నాయి. పట్టణాల్లో పలు ప్రాంతాల్లో మురుగు నీటి కాలువల్లో చెత్తాచెదారం పేరుకపోయి వరద నీరు రహదారులపైకి వస్తోంది. దీనికి తోడు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వస్తుండడంతో జనం ఇక్కట్ల పాలవుతున్నారు. వరద నీరు చెరువులు, కుంటలు, వాగుల్లోకి వెళ్లేలా పట్టణ ప్రణాళికను రూపొందించాల్సి ఉంది.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఇబ్బందులు

భారీ వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయంతో పరివాహక ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్‌, రాయికల్‌, బీర్‌పూర్‌, ధర్మపురి, వెల్గటూరు మండలాల్లోని పలు గ్రామాల గుండా గోదావరి ప్రవహిస్తోంది. గోదావరి కుర్రు ప్రాంతాల్లో మేతకు పశువులను తీసుకవెళ్లిన కాపరులు, మత్స్యకారులు గల్లంతవుతున్న సంఘటనలు ఉన్నాయి. అదే విధంగా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు కాకతీయ కాలువ, వరద కాలువలకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడం వల్ల పలు ప్రాంతాల్లో శిథిలావస్థకు గురయ్యాయి. భారీ వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా ప్రజాప్రతినిధులు అధికా రులు ముందస్తు చర్యలు తీసుకోవాల్సి ఉన్నది.

Updated Date - Aug 30 , 2025 | 01:14 AM