Share News

మద్యం షాపులకు దరఖాస్తులు అంతంతే...

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:59 AM

జిల్లాలో వైన్స్‌ షాపుల ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. 74షాపులకు శుక్రవారం వరకు కేవలం 274దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. శనివారం దరఖాస్తులు దాఖలు చేసేందుకు చివరి తేది ఉంది. ఆఖరి రోజు దరఖాస్తులపైనే ఎక్సైజ్‌శాఖ ఆశలు పెట్టుకున్నది.

 మద్యం షాపులకు   దరఖాస్తులు అంతంతే...

- నేడు చివరి రోజు.... ఎక్సైజ్‌ అధికారుల్లో టెన్షన్‌

- దరఖాస్తు చేసుకోవాలని వ్యాపారులకు ఫోన్లు

- గతంలో 2022 దరఖాస్తులు... రూ.40.4కోట్ల ఆదాయం...

- ఇప్పుడు 73షాపులకు 274దరఖాస్తులే

కోల్‌సిటీ, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో వైన్స్‌ షాపుల ఏర్పాటుకు సంబంధించి ఎక్సైజ్‌శాఖ ఆశించిన మేరకు స్పందన రావడం లేదు. 74షాపులకు శుక్రవారం వరకు కేవలం 274దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. శనివారం దరఖాస్తులు దాఖలు చేసేందుకు చివరి తేది ఉంది. ఆఖరి రోజు దరఖాస్తులపైనే ఎక్సైజ్‌శాఖ ఆశలు పెట్టుకున్నది. గతంలో 77షాపులకు 2022దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వానికి కేవలం దరఖాస్తుల రూపంలోనే రూ.40.44కోట్ల ఆదాయం సమకూరింది. కేవలం చివరి రోజే 1329దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. 2025-27 సంవత్సరాలకుగాను ఈ ఏడాది సెప్టెంబరు 25న నోటిఫికేషన్‌ జారీ చేశారు. 26 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. దసరా తరువాత దరఖాస్తుల ప్రక్రియ ఊపందుకుంటుందని ఎక్సైజ్‌ అధికారులు భావించారు. కానీ ఈ సారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఎక్సైజ్‌శాఖ గెజిట్‌లో వ్యాపారులను ప్రోత్సహించేందుకు సడలించిన నిబంధనల ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్‌లలో లైసెన్స్‌ వచ్చిన వారు ఎక్కడైనా షాపు పెట్టుకునేలా నిబంధనలు మార్చారు. మున్సిపాలిటీలో ఎక్కడైనా పెట్టుకునే అవకాశం కల్పించగా, రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని 50డివిజన్లను రెండు సెక్టార్లుగా విభజించారు. ఈ సెక్టార్ల పరిధిలో షాపులు వస్తే ఎక్కడైనా షాపులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. డిమాండ్‌ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని షాపులను క్లబ్‌ చేశారు. దీంతో డిమాండ్‌ ఉన్న అడ్డాల్లో షాపులు పెట్టే గుత్తాధిపత్యాన్ని తగ్గించినట్లయ్యింది. దీంతో వ్యాపారులు కొంత వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది. గతంలో కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు డ్రాలో దక్కించుకున్న వారు వెంటనే బేరాలు పెట్టి అమ్ముకునే వారు. రూ.5లక్షల రోజువారి అమ్మకాలు ఉన్న షాపులు, బెల్ట్‌షాపులు ఎక్కువగా ఉన్న షాపులు కోటి వరకు డిమాండ్‌ పలికాయి. ఈ సారి పరిస్థితి కొంత భిన్నంగా ఉంది.

ఆర్థిక మాంద్యం, గిరాకీలు తగ్గడంతో వెనుకంజ...

మార్కెట్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గిపోవడం, రిజిస్ర్టేషన్లు అంతంత మాత్రంగా ఉండడం, ఇతర వ్యాపారాలు మందకొడిగా ఉండడంతో మార్కెట్‌లో ఆర్థిక లావాదేవీలు తగ్గిపోయాయి. దీని ప్రభావం మద్యం అమ్మకాలపై సైతం పడింది. గతంలో రోజు వారి రూ.3లక్షల నుంచి రూ.4లక్షలు ఉన్న కౌంటర్లు రూ.2లక్షల వరకే అమ్ముడుపోతున్నట్టు వ్యాపారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో మద్యం వ్యాపారంలో పలువురు నష్టాలు చవి చూసినట్టు తెలుస్తుంది. సేల్స్‌ తగ్గడంతో ఇక్కడి నుంచి మూడు షాపులను రంగారెడ్డి జిల్లాకు బదలాయించారు. ఇప్పటి వరకు ఈ రంగంలో వ్యాపారాలు నిర్వహిస్తున్న కొందరు ప్రతి ఏడు ఇతర భాగస్వామ్యులను కలుపుకోవడం, నష్టాలు చూపడంతో ఇతరులు ఆసక్తి చూపడం లేదనే ఆరోపణలున్నాయి.

ఆఖరి రోజుపైనే ఆశలు...

వైన్స్‌ టెండర్ల దరఖాస్తులకు శనివారమే ఆఖరి రోజు. ఆఖరి రోజు భారీ స్థాయిలో దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్‌శాఖ అంచనా వేస్తుంది. మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగే షాపులకు ఎక్కువ ఫోకస్‌ చేశారు. చివరి సమయం వరకు చూసి తక్కువ దరఖాస్తులు ఉన్న నెంబర్లపై దరఖాస్తులు పెట్టాలనే ఆలోచనలో వ్యాపారులు ఉన్నట్టు తెలుస్తుంది. జిల్లాలోని భూపతిపూర్‌, ఎలిగేడు, గర్రెపల్లి, అంతర్గాం, కాల్వ శ్రీరాంపూర్‌, ముత్తారం తదితర ప్రాంతాల్లో షాపులకు ఈ సారి టెండర్లు ఎక్కువగా దాఖలవుతాయని భావిస్తున్నారు. గతంలో ఆఖరి రోజే 1329దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్‌శాఖ పేర్కొంటుంది.

Updated Date - Oct 18 , 2025 | 12:59 AM