Share News

బల్దియాలో అవినీతిపై చర్యలేవీ?

ABN , Publish Date - Oct 04 , 2025 | 12:52 AM

రెండేళ్ల క్రితం నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని పలు ముఖ్యకూడళ్లలో చేపట్టిన జంక్షన్ల బ్యూటిఫికేషన్‌ పనుల్లో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనుల్లో కూడా లక్షలాది రూపాయలను స్వాహా చేశారని పలువురు కమిషనర్‌ మొదలుకొని కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ముఖ్యమంత్రికి, విజిలెన్సు, ఇతర దర్యాప్తు సంస్థలకు మాజీ కార్పొరేటర్లతోపాటు నగరపౌరులు ఫిర్యాదు చేశారు.

బల్దియాలో అవినీతిపై చర్యలేవీ?

- రెండేళ్లుగా కొనసాగుతున్న విచారణ

- లక్షల ప్రజాధనం దుర్వినియోగం

- అధికారుల తీరుపై ప్రజల ఆగ్రహం

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): రెండేళ్ల క్రితం నగర సుందరీకరణలో భాగంగా నగరంలోని పలు ముఖ్యకూడళ్లలో చేపట్టిన జంక్షన్ల బ్యూటిఫికేషన్‌ పనుల్లో భారీగా అవినీతి జరిగిందనే విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆవరణలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణ పనుల్లో కూడా లక్షలాది రూపాయలను స్వాహా చేశారని పలువురు కమిషనర్‌ మొదలుకొని కమిషనర్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, ముఖ్యమంత్రికి, విజిలెన్సు, ఇతర దర్యాప్తు సంస్థలకు మాజీ కార్పొరేటర్లతోపాటు నగరపౌరులు ఫిర్యాదు చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం స్మార్ట్‌సిటీ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ పట్టణ ప్రగతి నిధులతో వందల కోట్ల రూపాయలతో నగరపాలక సంస్థ పరిధిలో జంక్షన్లు, పార్కులు, ఓపెన్‌ జిమ్స్‌, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లు, రోడ్లు, డ్రైనేజీలు, వరద మురుగునీటి కాలువ లు, కల్వర్టుల నిర్మాణాలను చేపట్టారు. తెలంగాణచౌక్‌లోని ఇందిరాచౌక్‌ జంక్షన్‌ను దాదాపు కోటి రూపాయలకుపైగానే వెచ్చించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఈ జంక్షన్‌కు సంబం ధించి ఇప్పటికే 90 లక్షలకుపైబడి బిల్లులు కూడా చెల్లించినట్లు తెలిసింది. ఇంకా మిగిలిన బిల్లుల కోసం కాంట్రాక్టర్‌ అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఒక్క ఈ జంక్షన్‌కు కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసినట్లు బిల్లులు రికార్డు చేశారని, దీనిలో భారీగా అవకతవకలుజరిగాయని పిర్యాదు చేశారు. దీనిపై విజిలెన్సు, క్వాలిటీ కంట్రోల్‌ అధికారులతో పాటు, మున్సిపల్‌ అధికారులు కూడా విచారణ జరిపినట్లు తెలిసింది. అయితే రెండేళ్లకే జంక్షన్‌ నిర్వహణ సరిగా లేక కోటి రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్య తీసుకోలేదు.

అలాగే వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ముందు జంక్షన్‌, కాపువాడ జంక్షన్‌, తీగెలవంతెన సమీపంలోని బైపాస్‌ జంక్షన్‌ల బ్యూటిఫికేషన్‌కు లక్షల్లోనే వెచ్చించారు. జంక్షన్ల నిర్వహణ పూర్తిగా గాలికి వదిలివేశారు. జంక్షన్‌ల సుందరీకరణ ఖర్చుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 20 నుంచి 25 లక్షలలోపు అయ్యే జంక్షన్లకు ఎక్కువ బిల్లులు రికార్డు చేసి ప్రజాధనం దండు కున్నారని విమర్శిస్తున్నారు.

తాజాగా పద్మనగర్‌ జంక్షన్‌ బ్యూటిఫికేషన్‌తోపాటు వర్షపు నీరు నిలువకుండా మురుగునీటి కాలువ నిర్మాణానికి సుమారు 50 లక్షల మేరకు అంచనా వేసి పనులు చేపట్టాలని నిర్ణయించడం కూడా విమర్శలతో పాటు వివాదస్పదంగా మారాయి. ఇదిలా ఉంటే కరీంనగర్‌ వ్యవసాయ మార్కెట్‌ ఆవరణలో 5 కోట్ల 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ నిర్మాణాన్ని చేపట్టారు. మార్కెట్‌ నిర్మాణ సమయంలో అక్కడ ఎలాంటి రాక్‌ (రాయి) లేకున్నా రాక్‌ కటింగ్‌ పేరుతో బిల్లు రికార్డు చేశారని, పనుల్లో నాణ్యత లోపించిందని, భారీ అంచనాలతో బిల్లులు రికార్డు చేసి కాంట్రాక్టర్లతో ఇంజనీరింగ్‌ అధికారులు కుమ్మక్కయ్యారని ఇద్దరు ముగ్గురు మాజీ కార్పొరేటర్లు వాటిపై చర్య తీసుకోవాలంటూ ఇప్పటికీ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. దీనిపై విచారణ జరిపిన అధి కారులు విచారణ వివరాలను వెల్లడించకుండా ఒక ఏఈని బాధ్యుడిని చేస్తూ చేతులు దులుపుకున్నారనే విమర్శలున్నాయి. దీనికి సంబంధించిన ఎంబి రికార్డులను కూడా మాయం చేశారని, దీనిపై కూడా విచారణ జరుపాలని పలువురు ఫిర్యాదు చేశారు.

నగరపాలక సంస్థ పరిధిలోని జంక్షన్లు, మార్కెట్లు, పార్కులు, ఓపెన్‌ జిమ్స్‌లో జరిగిన అవినీతిపై జిల్లా కలెక్టర్‌ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నందున విచారణ జరిపించి చర్యలు తీసుకుంటారని భావించారు. అయితే పాలకవర్గం పదవీకాలం ముగిసి తొమ్మిది నెలలు అవుతున్నా, ప్రత్యేక అధికారిగా కలెక్టర్‌, ఐఏఎస్‌ అధికారి మున్సిపల్‌ కమిషనర్‌గా కొనసాగుతున్నా లక్షలాది రూపాయల అవినీతి ఆరోపణలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందన లేకపోవడం అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అవినీతి ఆరోపణ ఫిర్యాదుల విచారణను వేగవంతం చేసి బాధ్యులైన వారిపై చర్య తీసుకోవాలని, అవినీతి ఫిర్యాదులు ఉన్న పనులకు సంబంధించిన బిల్లులను చెల్లింపులు చేయకుండా పెం డింగ్‌లో పెట్టి, ఒకవేళ ఎక్కువ బిల్లులు తీసుకున్నట్లు రుజువైతే సంబంధిత కాంట్రాక్టర్‌ నుంచి ఆ మొత్తాలను చట్టప్రకారంగా రికవరీ చేయడంతో పాటు చర్యలు తీసుకోవాలని నగర ప్రజ లు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Oct 04 , 2025 | 12:52 AM