Share News

గోదావరిఖనిలో మరో సోలార్‌ కేంద్రం

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:25 AM

గోదావరి ఖనిలో మరో సోలార్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానున్నది. మూతపడిన 18మెగావాట్ల సింగరేణి థర్మల్‌ కేంద్రం స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సింగరేణి సిద్ధపడింది. మరో రెండు మూడు మాసాల్లో సోలార్‌ కేంద్రం పనులు ప్రారంభంకానున్నాయి. 21 ఎకరాల స్థలంలో 5మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేయనున్నది.

గోదావరిఖనిలో మరో సోలార్‌ కేంద్రం

గోదావరిఖని, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): గోదావరి ఖనిలో మరో సోలార్‌ విద్యుత్‌ కేంద్రం ఏర్పాటు కానున్నది. మూతపడిన 18మెగావాట్ల సింగరేణి థర్మల్‌ కేంద్రం స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సింగరేణి సిద్ధపడింది. మరో రెండు మూడు మాసాల్లో సోలార్‌ కేంద్రం పనులు ప్రారంభంకానున్నాయి. 21 ఎకరాల స్థలంలో 5మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను సింగరేణి ఏర్పాటు చేయనున్నది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కార్యాచరణ ప్రారం భమైంది. రూ.30కోట్ల వ్యయం అంచనాలతో ఈ సోలార్‌ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు.

సింగరేణి వ్యాప్తంగా ఇప్పటికే 350మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా రామగుండం రీజియన్‌లో కూడా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసేం దుకు నిర్ణయం తీసుకున్నది. ఆర్‌జీ-3 పరిధిలో రూ.200 కోట్లతో 50 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ ఇప్పటికే సింగ రేణి ఆధ్వర్యంలో ఉంది. రూ.126కోట్లతో 22మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఓసీపీ-1 డంప్‌ యార్డ్‌పై నిర్మిస్తు న్నారు. రూ.150కోట్ల అంచనాలతో మరో 37మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను ఆర్‌జీ-3 పరిధిలో నిర్మాణం చేసేం దుకు టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయ్యింది. సింగరేణిలో ఓసీపీ డంప్‌ యార్డులపై ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్లను నిర్మించేందుకు సింగరేణి ముందుకు సాగుతున్నది. థర్మల్‌ విద్యుత్‌ మెగావాట్‌కు రూ.7 నుంచి రూ.8కోట్లు ఖర్చు అవుతుండగా సోలార్‌ మెగావాట్‌ విద్యుత్‌కు కేవలం రూ.5కోట్లు మాత్రమే వ్యయం అవుతున్న నేపథ్యంలో సింగరేణి సోలార్‌ విద్యుత్‌ వైపు దృష్టి కేంద్రీకరిం చింది.

గోదావరిఖనిలో గతంలో ఉన్న 18మెగావాట్ల థర్మల్‌ స్టేషన్‌ 6సంవత్సరాల క్రితం మూత పడింది. ఖాళీగా ఉన్న ఈ స్థలంలో 5మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ను నిర్మించేందుకు సింగరేణి అన్నీ అనుమతులు పొందింది. నిధుల కేటాయింపు కూడా జరిగింది. పక్కనే ఉన్న ఎన్‌టీపీసీ రాజీవ్‌ రహదారిని ఆనుకుని 10 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్‌ను నిర్వహిస్తున్నది. సింగరేణి 5మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ కూడా రాజీవ్‌ రహదారికి పక్కనే ఉండడం గమనార్హం. ఎన్‌టీపీసీ బ్యాలెన్సింగ్‌ వాటర్‌ రిజర్వాయర్‌లో 100మెగావాట్ల నీటి మీద తేలియాడే ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ద్వారా కూడా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నది. గోదావరిఖని కేం ద్రంగా కేవలం 8కిలోమీటర్ల పరిధిలోనే ఎన్‌టీపీసీ 110మెగావాట్లు సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తుండగా సింగరేణి 114మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు సిద్ధపడింది.

వాతావరణంలో మార్పులకు అవకాశం

గోదావరిఖనిలో సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటుతో వాతా వరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. పాత పవర్‌హౌస్‌ 21ఎకరాల్లో ప్రస్తుతం భారీ వృక్షాలతో పచ్చని వాతావరణం ఉంటుంది. ఈ ప్లాంట్‌ ఏర్పాటుతో ఈ చెట్లను తొలగించాల్సి ఉంటుంది. ఇది ఇక్కడి వాతావరణ సమత్యులతపై ప్రభావం చూపే అవకా శాలున్నాయి. పాత థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఉన్నప్పుడు ధ్వని కాలుష్య, పొగ, దుమ్ము, బొగ్గు రవాణాతో ఇబ్బందులు ఉండేవి. సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు వల్ల ఆ రకమైన ఇబ్బందులు లేకపోయినప్పటికీ ఉష్ణోగ్రతల ప్రభావాలు పడే అవకాశం ఉంది. ప్లాంట్‌కు పక్కనే జీఎం కాలనీ, సీఎస్‌పీ కాలనీ, మరో వైపు గంగానగర్‌, ప్లాంట్‌ ముందు పవర్‌హౌస్‌కాలనీ జనావాసాలు ఉన్నాయి. అయితే సింగరేణి యాజమాన్యం స్థలం వృథాగా ఉండే కన్నా సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణం వల్ల స్థలం వినియోగంలోకి వస్తుందని భావిస్తున్నది. గోదావరిఖని పట్టణం నడిబొడ్డున ఉన్న ఖరీదైన స్థలంలో సోలార్‌ ప్లాంట్‌ నిర్మాణానికి సిద్ధపడడం చర్చనీయాంశం కానున్నది.

Updated Date - Jun 18 , 2025 | 01:25 AM