Share News

జిల్లాకు మరో మణిహారం

ABN , Publish Date - Oct 08 , 2025 | 01:14 AM

రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా అందులో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో కేంద్రీయ విద్యాలయాన్ని జగిత్యాలకు మంజూరు చేస్తూ ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

జిల్లాకు మరో మణిహారం

జగిత్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు కేంద్రీయ విద్యాలయాలు మంజూరు కాగా అందులో ఒకటి జగిత్యాల జిల్లాకు కేటాయించారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో కేంద్రీయ విద్యాలయాన్ని జగిత్యాలకు మంజూరు చేస్తూ ఇటీవల కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయంలో ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్‌ వరకు విద్యనభ్యసించే అవకాశం ఉంటుంది. కేంద్రీయ విద్యాలయంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ బోధిస్తారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించి విద్యను అభ్యసించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీంతో పేద, మద్య తరగతి విద్యార్థులు చదువుకోలేని పరిస్థితి ఉంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడంతో పేద, మధ్య తరగతి ప్రజల్లో హర్షం వ్యక్తం అవుతోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి బోధన జరిపేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

ఫ25 ఎకరాల స్థలంలో ఏర్పాటుకు కసరత్తు

జిల్లా కేంద్రానికి సమీపాన జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న చల్‌గల్‌ వాలంతరి వ్యవసాయ ప్రదర్శన క్షేత్రంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. సుమారు 25 ఎకరాల స్థలంలో కేంద్రీయ విద్యాలయ భవన సముదాయం నిర్మాణం కానుంది. నాణ్యమైన విద్య, అత్యుత్తమ బోధన, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో కేంద్రీయ విద్యాలయాలు దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పాఠశాలల్లో ప్రవేశాలకు బాగా డిమాండ్‌ ఉంది.

ఫకేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు ప్రాధాన్యం..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికుల పిల్లలకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యత కల్పిస్తారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల ఉద్యోగులకు వరుసగా రెండు, మూడు, నాలుగో ప్రాధాన్యత ఇస్తారు. మిగిలిన విద్యార్థులకు ఐదో ప్రాధాన్యతతో ప్రవేశాలు కల్పిస్తారు. కేంద్రీయ విద్యాలయంలో ఆన్‌లైన్‌ పద్ధతిలో నామినల్‌ ఫీజులతో అడ్మిషన్లు నిర్వహిస్తారు. జిల్లాలోని కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ మంజూరు అయ్యాయి. ఆ స్కూళ్లకు సంబంధించి ఇంకా గ్రౌండ్‌ వర్క్‌ కొనసాగుతోంది. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం రావడంతో జిల్లాలోని విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది.

ఫనాణ్యమైన విద్య..

కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో జగిత్యాల ప్రాంత విద్యార్థులకు జాతీయ స్థాయి సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందనున్నది. కేంద్రీయ విద్యాలయంలో సౌకర్యవంతమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయం, వైద్యం, క్యాంటిన్‌, క్రీడా సౌకర్యాలు ఉంటాయి. ప్రయోగాత్మక అభ్యసన అనుభవాలను విద్యార్థులకు అందించేందుకు సైన్స్‌ కంప్యూటర్‌, లాంగ్వేజ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. గ్రంథాలయంలో కేంద్రీయ విద్యాలయ పుస్తకాలు, మ్యాగజైన్లు, వార్తా పత్రికలు, ఇతర రీడింగ్‌ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులకు విశాలమైన క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి క్రికెట్‌, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌ బాల్‌, వాలీబాల్‌ వంటి క్రీడల కోసం పరికరాలను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులకు అవసరమైనప్పుడు వైద్య సహాయం అందించేందుకు వైద్య సిబ్బందిని నియమించి పాఠశాలలో క్లినిక్‌ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు కౌన్సెలింగ్‌ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.

ఫఎడ్యుకేషన్‌ హబ్‌గా జిల్లా

జిల్లాకు గత యేడాది మంజూరు అయిన నవోదయ విద్యాలయాన్ని కోరుట్లలో ఏర్పాటు చేశారు. నవోదయ విద్యాలయంలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో 40 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. కోరుట్ల పట్టణంలోని వేములవాడ రోడ్‌లో గల వసతిగృహంతో పాటు గతంలో కొనసాగిన అగ్రికల్చర్‌ బీఎస్సీ కళాశాల భవనంలో నవోదయ విద్యాలయం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మంజూరు అయిన కేంద్రీయ విద్యాలయాన్ని జిల్లా కేంద్రం శివారులోని చల్‌గల్‌ వాలంతరీ వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం ప్రవేశాలు నిర్వహించడానికి అనుగుణంగా అధికారులు కసరత్తులు చేస్తున్నారు. కొడిమ్యాల మండలం నాచుపల్లిలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాల, కోరుట్లలో పశు వైద్య కళాశాల, జగిత్యాల మండలం పొలాసలో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆవరణలో వ్యవసాయ డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్‌ కళాశాల, జగిత్యాల మండలం నూకపల్లి వద్ద అడ్వాన్స్‌ టెక్నాలజీ ట్రేనింగ్‌ సెంటర్‌, జగిత్యాలలో మెడికిల్‌ కళాశాల, నర్సింగ్‌ కళాశాలలు పనిచేస్తున్నాయి. వీటికి తోడు నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ మంజూరయ్యాయి. వీటితో జగిత్యాల జిల్లా ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుతోంది.

ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు

-ధర్మపురి అర్వింద్‌, నిజామాబాద్‌ ఎంపీ

జగిత్యాల జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిన ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రివర్గానికి కృతజ్ఞతలు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుంది. ఇప్పటికే కోరుట్లలో నవోదయ విద్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ప్రస్తుతం కేంద్రీయ విద్యాలయం మంజూరుతో పేదలకు ఉన్నతమైన విద్య మరింత చేరువ కానుంది.

కేంద్రీయ విద్యాలయం మంజూరు హర్షణీయం

-తాటిపర్తి జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి

చల్‌గల్‌లో కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. జగిత్యాల ప్రాంతంలోని ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజల పిల్లలకు నాణ్యమైన బోధనను అందించనుండడం సంతోషకరం. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.

Updated Date - Oct 08 , 2025 | 01:14 AM