Share News

ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:29 AM

అక్రమ స్థలాల క్రమబద్ధీకరణకు ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు గడువును మరోసారి పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 30 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునే వారికి ఫీజులో 25శాతం రాయితీని కొనసాగిస్తూ మరో అవకాశం కల్పించింది.

ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): అక్రమ స్థలాల క్రమబద్ధీకరణకు ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు గడువును మరోసారి పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూన్‌ 30 వరకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకునే వారికి ఫీజులో 25శాతం రాయితీని కొనసాగిస్తూ మరో అవకాశం కల్పించింది. నగర పాలక సంస్థలో కుప్పలు తెప్పలుగా ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికి సాంకేతిక సమస్యలతో ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోలేక పోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31వరకు అవకాశం ఇవ్వగా చాలా మంది ముందుకు రాలేదు. దీంతో ఏప్రిల్‌ 30 వరకు గడువు పొడగిస్తూ ఇదే చివరి అవకాశంగా పేర్కోంది. అయినా ఆశించిన మేరకు స్పందన రాకపోవడంతో ఎల్‌ఆర్‌ఎస్‌ గడువు మరోసారి పొడిగించింది. ఏమేరకు దరఖాస్తు దారులు ఈ అవకావాన్ని సద్వినియోగం చేసుకుంటారు వేచి చూడాలి. గతంలో దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరు ఫీజు చెల్లించేందుకు ముందుకు వచ్చినప్పటికి అనేక సాంకేతిక కారణాలు వారికి ఆటంకంగా మారాయి.

ఫ నామమాత్రంగా స్పందన

2020లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తు చేసుకొని వెయ్యి రూపాయల రుసుమును చెల్లించిన వారికే రాయితీ వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ను అమలు చేసినప్పటికీ రుసుములో ఎలాంటి రాయితీ ఇవ్వకపోవడంతో వెయ్యి రూపాయలు చెల్లించి దరఖాస్తు చేసుకున్న వారు మిగిలిన మొత్తం చెల్లించేందుకు ముందుకు రాలేదు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్‌ఆర్‌ఎస్‌ చార్జీలపై 25శాతం రాయితీ ప్రకటించి మార్చి 31లోగా దరఖాస్తుదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇదే చివరి అవకాశమని పేర్కొంది.

ఫ ఆయా శాఖల్లో కియరెన్సుల్లో జాప్యం

దరఖాస్తులకు ఎల్‌-1,ఎల్‌-2,ఎల్‌-3 స్టేజీల్లో ఇరిగేషన్‌, రిజిస్ట్రేషన్‌, రెవెన్యూ శాఖల్లో క్లియరెన్సు ఇచ్చిన తర్వాతనే ఎల్‌ఆర్‌ఎస్‌ చేస్తామని ప్రకటించింది. దీంతో చాలా మంది ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా రెగ్యులరైజ్‌ చేసుకునేందుకు సిద్ధపడ్డారు. చాలా మంది రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ముందుకువచ్చి డాక్యుమెంట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేశారు. చాలా మందికి ఎల్‌-1,ఎల్‌-2 స్టేజీల్లో పెండింగ్‌లో ఉన్నాయంటూ చూపిస్తున్నాయి. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ నుంచి నో ఆబ్జక్షన్‌ సర్టిఫికేట్లను తీసుకురావాలంటూ అధికారులు సూచిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు ఆయాశాఖల కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కరీంనగర్‌లోనే వెయ్యికి పైగా దరఖాస్తులు రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి ఎన్‌వోసీ కోసం వచ్చాయి. కొందరికి డాక్యుమెంట్‌లోని సర్వే నంబర్‌ కోర్టు కేసుల్లో ఉంటే ప్లాట్‌పై ఎలాంటి కేసులు లేకున్నా మొత్తం ఆ సర్వేనెంబర్‌లోని అన్ని ప్లాట్లపై కేసు ఉన్నట్లు రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు ఎన్‌వోసీ ఇస్తున్నారు. దీంతో ఎల్‌ఆర్‌ఎస్‌ రుసుము చెల్లించినా కూడా రెగ్యులరైజ్‌ అయింతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. డాక్యుమెంట్లతోపాటు ఎన్‌వోసీలను తీసుకుని నగరపాలక సంస్థకు వెళ్లి తాము ఎంత చార్జీలు చెల్లించాలో చెప్పాలని అధికారులను కోరగా వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడం లేదంటూ, ఆన్‌లైన్‌లో వచ్చిన మొత్తం చెల్లించాలంటూ అధికారులు సమాధానాలిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేసుకోకుండానే వెనుదిరిగి పోతున్నారు. ప్రభుత్వం గడువు పొడిగించిన నేపథ్యంలో సాంకేతిక సమస్యలు పరిష్కరించి ఎల్‌ఆర్‌ఎస్‌ చేయాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.

Updated Date - Jun 18 , 2025 | 01:29 AM