ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో అవకాశం
ABN , Publish Date - May 02 , 2025 | 01:09 AM
రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుదారుల ప్రయో జనం కోసం ఏప్రిల్ నెలాఖరు వరకు వన్ టైం సెటిల్‌మెంట్ చేసిన వారికి 25 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించింది.
జగిత్యాల, మే 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) దరఖాస్తుదారుల ప్రయో జనం కోసం ఏప్రిల్ నెలాఖరు వరకు వన్ టైం సెటిల్‌మెంట్ చేసిన వారికి 25 శాతం రాయితీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. వివిధ కారణాలతో ప్రజలు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకో లేకపోయారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ మూడు రోజుల పాటు గడువు పొడిగించింది. ఈ నెల 3వ తేదీలోపు ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించిన వారికి వన్ టైం సెటిల్‌మెంట్ కింద 25 శాతం రాయితీ ప్రకటించింది. ఎఫ్‌టీఎల్, నిషేధించిన సర్వే నంబర్లు మినహా ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ రెగ్యులరైజేషన్ ఫీజు నిర్ణయించారు. ఫీజు చెల్లించేందుకు అర్హత ఉన్న దరఖాస్తుదారులు మే 3వ తేదీలోగా నిర్ణీత రుసుము చెల్లిస్తే రిబేటు వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించింది.
విస్తృతంగా ప్రచారం చేసినా..
25శాతం రాయితీపై అవగాహణ కల్పించేందుకు అధికారులు గత నెల 1వ తేదీ నుంచి విస్తృతంగా ప్రచారం జరిపారు. మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ మేళాలు నిర్వహించారు. ప్లాట్లు, వెంచర్ల యజమానులతో సమావేశమై రాయితీ గురించి వివరించారు. వార్డు ఆఫీసర్లతో ఫోన్లు చేయించారు. దరఖాస్తుదారుల ఫోన్ నంబర్లకు మెసేస్‌లు పంపారు. హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. అయినా ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కాగా రాయితీ గడువు గత నెల 30వ తేదీతో ముగియడంతో దరఖాస్తుదారుల అభ్యర్థన మేరకు మరో మూడు రోజులు పొడగిస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది.
ఆదాయం అనుమానమే
గతంలో రాష్ట్ర ప్రభుత్వం 2020 ఆగస్టు 28వ తేదీ వరకు ఎల్‌ఆర్‌ఎస్ కొరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశమిచ్చింది. కానీ అప్పట్లో ప్రక్రియ ముందుకు సాగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆగస్టు 1వ తేదీ నుంచి మళ్లీ ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియను కొనసాగిస్తోంది. అయితే గతంలో మాదిరిగా కాకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలన జరుపుతున్నారు. ప్రధానంగా దరఖాస్తుదారుడు కొనుగోలు చేసిన స్థలం పట్టా, ప్రభుత్వ భూమా లేదా...ఏదేని చెరువు, కుంట ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉందా.. అనే అంశాలతో పాటు ఆ ప్లాట్‌కు సంబంధిచంఇన లింక్ డాక్యుమెంట్‌లను మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు క్షుణంగా పరిశీలన జరిపారు. ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లో అప్‌లోడ్ చేశారు. కాగా ఎల్‌ఆర్‌ఎస్ ప్రక్రియ ప్రారంభించి నాలుగేళ్లు కావడంతో ఇప్పటికే సగం మంది ఓపెన్ ప్లాట్లను ఇతరులకు విక్రయించినట్లుగా భావిస్తున్నారు. మరికొందరు ఇళ్ల నిర్మాణాలు కూడా చేపట్టారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల,మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తు చేసుకున్న పలు ఓపెన్ ప్లాట్లలో ఇళ్లు దర్శనమిస్తున్నాయని సంబంధిత వర్గాలు అంటున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆదాయం రావడం అనుమానమేనని అంటున్నారు.