అన్నా.. తప్పక రావాలే..
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:22 AM
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. సర్పంచ, వార్డు మెంబర్‌గా ఒక్క ఓటు తేడాతే ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఇంటింటి ప్రచారంతో ఒక వైపు గ్రామంలో నివాసం ఉంటున్న ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు.
- వలస ఓటర్లపై పంచాయతీ అభ్యర్థుల నజర్
- పట్టణాల్లో ఉంటున్న వారికి ఫోన్లు
- ముంబాయి, భీవండి, హైదరాబాద్..తదితర పట్టణాలకు ట్రావెల్స్ బస్సులు
- ప్రతీ ఓటు కీలకం కావడంతో దూర ప్రాంత ఓటర్లను రప్పించడానికి ప్రయత్నాలు
పంచాయతీ ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకమే.. సర్పంచ, వార్డు మెంబర్‌గా ఒక్క ఓటు తేడాతే ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. దీంతో ఇంటింటి ప్రచారంతో ఒక వైపు గ్రామంలో నివాసం ఉంటున్న ఓటర్లను అభ్యర్థులు ఆకర్షిస్తున్నారు. మరోవైపు వలస ఓటర్లపై దృష్టి సారిస్తున్నారు. ఒక్క ఓటు కూడా చేజారిపోకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
జగిత్యాల, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): పల్లెల్లో ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి... రచ్చబండల వద్ద జోరుగా చర్చ జరుగుతోంది. పంచాయతీ సమరంలో ప్రతీ ఓటు కీలకం కావడంతో అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. విజయం తమనే వరించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇంటింటి ప్రచారంతో ఒక వైపు గ్రామంలో నివాసం ఉంటున్న ఓటర్లకు గాలం వేస్తున్నారు. పోలింగ్‌కు వచ్చేలా పల్లె నాయకులు, స్థానిక పెద్దలు ఫోన్లు చేస్తూ వలస ఓటర్లను రప్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లోని ఓటర్లను దగ్గరుండి పల్లెకు రప్పించేందుకు ప్రత్యేకంగా మనుషులను కేటాయించడంపై దృష్టి సారించారు. అవసరమైతే ఓటుకు రేటు కట్టి మరీ పల్లెకు చేరుకునేలా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఉపాధి నిమిత్తం పలు పల్లెల యువతీయువకులు పట్టణాలతో పాటు హైద్రాబాద్, ముంబాయి, బీవండి, పుణే, బెంగుళూరు ప్రాంతాలకు వెళ్లిన గ్రామాలకు చెందిన వ్యక్తుల ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాలో 385 పంచాయతీలు..
జగిత్యాల జిల్లాలోని 20 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలో 385 పంచాయతీలు, 3,536 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 6,07,263 మంది పంచాయతీ ఓటర్లున్నారు. ఇందులో 2,89,702 మంది పురుషులు, 3,17,552 మంది సీ్త్రలు, తొమ్మిది మంది ఇతరులున్నారు. 3,536 జంబో బ్యాలెట్ బాక్సులు, 1,428 సాధారణ బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. జిల్లాలో తొలి విడతలో 122 సర్పంచ 1,172 వార్డులకు, రెండో విడతలో 144 సర్పంచ 1,276 వార్డులకు, మూడో విడతలో 119 సర్పంచ 1,088 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి
రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్న అభ్యర్థులు..
గ్రామాల్లో సర్పంచ ఎన్నికల సందడి జోరందుకుం టోంది. అభ్యర్థుల ఇళ్లలో హడావుడితో పాటు బయట కూడా అదే ఉత్సాహం కనిపిస్తోంది. హైదరాబాద్ భీవండి, నిజామాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో ఉన్న గ్రామ ఓటర్లను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ట్రావెల్స్ బస్సులు, కార్లను ముందస్తుగా బుక్ చేస్తున్నారు. పోలింగ్ రోజున సుదూర ప్రాంతాల నుంచి ఓటర్లను తీసుకొచ్చే వాహనాలు ఆలస్యం కాకుండా ముందస్తుగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు.
సోషల్ మీడియాలో సందేశాలు..
పంచాయతీ ఎన్నికల్లో పల్లె ఓటర్లతో పాటు ఉపాధి నిమిత్తం పట్టణాలకు వెళ్లిన ఓటర్లు సైతం కీలకమవుతున్నారు. అన్నా హైదరాబాద్‌లో మనోడు వచ్చడా, ముంబాయి, భీవండి నుంచి ఎప్పుడు బయలు దేరుతున్నారు అంటూ అభ్యర్థులు వాకబు చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పెళ్లి ఆహ్వాన పత్రాలు పంపినట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో ఓటర్లకు తమ అభ్యర్థి తరపున సందేశాలు పంపిస్తున్నారు. అన్నా పోలింగ్ రోజు తప్పకుండా గ్రామానికి రావాలి. మీ అమూల్యమైన ఓటు వేయాలి.. అంటూ మెసెజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అభ్యర్థులు ముహుర్తాలు చేసుకుని పట్నం బయలు దేరి ఊరి ఓటర్లు ఉన్న కాలనీలకు వెళ్లి సమావేశాలతో వారి మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారు...ఎక్కడ ఉంటున్నారు... ఎప్పుడు వస్తారు... ఎలాంటి వాహనాలు ఏర్పాటు చేయాలి.. అనే పనిలో అభ్యర్థుల అనుచరులు నిమగ్నమయ్యారు. మరికొంత మంది అభ్యర్థులు తమ ఓటర్లకు వ్యక్తిగతంగా పోన చేసి మద్దతు కోరుతున్నారు. వలసల పెరుగుదలతో ఇప్పుడు గ్రామరాజకీయాల్లో పట్నం ఓటర్ల ప్రభావం పెరిగింది.
విందులే విందులు..
గ్రామాల్లో ఓటర్లను ఆకర్శించే విధంగా విందు రాజకీయాలకు తెర లేపుతుండగా పట్నంలో ఉన్న వలస ఓటర్లను సైతం తమవైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న ప్రతి అభ్యర్థి ఆయా ప్రాంతాల్లో రోజూవారీ వంటకాలు, విందులకు ప్లాన చేసుకుంటున్నారు. పట్నం ఓటర్లు ఏఏ ప్రాంతాల్లో ఉన్నారనే లెక్కల మేరకు ఒక్కో ఏరియాకు ఇనచార్జిలను నియమించి పోలింగ్ తేదీ వరకు అక్కడే ఉండే విధంగా ప్లాన చేశారు. ఇనచార్జిలు ప్రతీ రోజు వలస ఓటర్లను కలవడం, పనులు ముగించుకుని ఇంటికి రాగా దావతలతో ఖుషీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు.