Share News

అంజన్నా.. వెళ్లొస్తాం..

ABN , Publish Date - May 24 , 2025 | 12:28 AM

కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్‌ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు గురువారం అర్ధరాత్రి వరకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో కొండగట్టు అంజన్న సన్నిధానం కిక్కిరిసిపోగా శుక్రవారం కూడా రద్దీ నెలకొంది.

అంజన్నా.. వెళ్లొస్తాం..
అంజన్నను దర్శించుకొని బయటకు వస్తున్న భక్తులు

- ముగిసిన హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలు

- నేటి నుంచి అర్జితసేవలు పునరుద్ధరణ

మల్యాల, మే 23 (ఆంధ్రజ్యోతి): కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధిలో హనుమాన్‌ పెద్ద జయంతి వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు గురువారం అర్ధరాత్రి వరకు వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో కొండగట్టు అంజన్న సన్నిధానం కిక్కిరిసిపోగా శుక్రవారం కూడా రద్దీ నెలకొంది. వేలాదిగా హనుమాన్‌ భక్తులు దీక్షవిరమణ మండపంలో మాలవిరమణ చేసి అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. మూడు రోజుల పాటు జరిగిన జయంతి వేడుకలకు లక్షలాదిగా వచ్చిన భక్తులు వెళ్లోస్తాం.. అంజన్న.. చల్లంగా చూడు.. అంటూ తిరిగి వెళ్లారు.

- ఉత్సవాలు విజయవంతం..

జయంత్యుత్సవాలు విజయవంతంగా ముగియడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికీ దేవస్థానం తరుపున అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌ పర్యవేక్షణలో భక్తులకు సేవలు అందించిన పోలీస్‌, పంచాయితీరాజ్‌, ట్రాన్స్‌కో, ఆర్టీసీ, వైద్య, అగ్నిమాపక, 108, రెవెన్యూ, దేవాదాయ, మిషన్‌ భగీరథ తదితర ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందికి, స్వచ్చంద సేవా సంస్థల సేవలను కొనియాడారు. అందరి సహకారంతోనే ఉత్సవాలు విజయవంతం అయినట్లు పేర్కొన్నారు.

- నేటి నుంచి వాహన పూజలు..

హనుమాన్‌ జయంతి సందర్భంగా నిలిపివేసిన అర్జిత సేవలను తిరిగి కొనసాగించనున్నట్లు ఆలయ ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. శనివారం నుంచి వాహనపూజలు, అభిషేకాలు, సత్యనారాయణస్వామి వ్రతాలు తదితర పూజలు యఽథావిధిగా ఉంటాయని భక్తులు గమనించాలని సూచించారు.

- వందలాది సిబ్బంది ఉన్నా.. లోపించిన పారిశుధ్యం

హనుమాన్‌ జయంతి ఉత్సవాలకు వేలాదిగా భక్తులు కొండగట్టుకు తరలిరాగ కొండపై అపరిశుభ్రత భక్తులను అసహనానికి గురిచేసింది. అడుగడుగున చెత్త దర్శనం ఇవ్వగా స్నానాలు చేయడానికి కోనేరుకు వెళ్లే మార్గం ద్వారం వద్దే బురదతో పాటు భక్తులు సమర్పించిన తలనీలాలు, చెత్తకుప్పలు ఉండడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. స్వామి వారి దర్శనం చేసుకొని వచ్చే వెనుక ద్వారం మెట్లన్నీ బ్లీచింగ్‌తో బురదగా మారి భక్తులు కొందరు జారిపడ్డారు. ఆలయంలోనూ భక్తులు వచ్చే మార్గంలో ముడుపుల బియ్యం కుప్పలుగా ఉండగా వాటిని వెంట వెంటనే తొలగించకపోవడంతో వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పారిశుధ్యం కోసం సుమారు నాలుగు వందల పైగా సిబ్బందిని నియమించినప్పటికీ అపరిశుభ్రతే దర్శనం ఇవ్వడంపై భక్తులు, దీక్షాపరులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Updated Date - May 24 , 2025 | 12:28 AM