Share News

‘అంగారిక‘ను అభివృద్ధి చేయాలి

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:59 PM

తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగారిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

‘అంగారిక‘ను అభివృద్ధి చేయాలి
సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డికి వినతిపత్రం సమర్పిస్తున్న అంగారిక టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్ల సంఘం ప్రతినిధులు

సుభాష్‌నగర్‌, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగారిక టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రఘుశంకర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం అంగారిక టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్ల సంక్షేమ సంఘం ఆద్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట చేపట్టిన ధర్నాకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రఘుశంకర్‌రెడ్డి మాట్లాడుతూ మూడు సంవత్సరాల క్రితం ఆనాటి బీఆర్‌ఎస్‌ పాలనలో తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణపూర్‌ కాలనీలోని రాజీవ్‌స్వగృహకు కేటాయించిన స్థలంలో 824 ప్లాట్లను ఏర్పాటు చేసి అంగారికాటౌన్‌షిప్‌ పేరుతో ఆనాటి కలెక్టర్‌ బహిరంగ వేలంలో విక్రయించారని చెప్పారు. ప్రభుత్వానికి 147 కోట్లరూపాయల ఆదాయం సమకూరగా, రిజిస్ట్రేషన్ల ద్వారా మరో దాదాపు 12 కోట్ల రూపాయలు సమకూరిందని అన్నారు. ప్లాట్ల విక్రయంతో వచ్చిన ఆదాయంతో టౌన్‌షిప్‌లో అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అప్పటి కలెక్టర్‌, ఆర్డీవో ప్రకటించారన్నారు. ప్లాట్లను విక్రయించి మూడేళ్లవుతున్నా ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కలిసినా స్పందించడం లేదని, తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నా చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. లేనిపక్షంలో దశలవారి ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు చంద సత్యనారాయణ, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, మారెపల్లి మల్లారెడ్డి, ఓరుగంటి సర్సింహారెడ్డి, తోట మోహన్‌రెడ్డి, తుమ్మల రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌కు, సుడా చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఫ అంగారికా టౌన్‌షిప్‌ అభివృద్ధికి సహకరిస్తా

- ‘సుడా’ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

రామకృష్ణ కాలనీలో గత ప్రభుత్వం ప్లాట్లను విక్రయించిన ఏర్పాటు చేసిన అంగారిక టౌన్‌షిప్‌ అభివృద్ధికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం సుడా కార్యాలయంలో అంగారికా టౌన్‌షిప్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు చైర్మన్‌ నరేందర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. సుడా నిధులతోనైనా టౌన్‌షిప్‌ను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ అంగారికా టౌన్‌షిప్‌ ప్లాట్ల వేలంతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దాదాపు 150 కోట్లు వచ్చాయని, ఆనాటి ప్రభుత్వం వాటిని వాడుకుందన్నారు. ఇప్పటికే రెండు కోట్లతో టౌన్‌షిప్‌లో అంతర్గత రోడ్లను ఫార్మేషన్‌ చేసి వరద నీరు వెళ్ళే విధంగా పైపులు వేయించానన్నారు. మరో 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మిగిలిన 32 ప్లాట్లను విక్రయించి వచ్చిన ఆదాయంతోనైనా అభివృద్ధి చేయడం కోసం కలెక్టర్‌ ద్వారా గృహనిర్మాణశాఖ అనుమతి కోరామన్నారు. త్వరలోనే అనుమతి తీసుకొని అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని నరేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Updated Date - Sep 19 , 2025 | 11:59 PM