అంగన్‌వాడీ సిబ్బంది వేతనాలు పెంచాలి
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:01 AM
పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో కరీంనగర్ అంగన్‌వాడీ సిబ్బంది పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశంసించారు.
గణేశ్‌నగర్, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పోషణ్ అభియాన్ కార్యక్రమం అమల్లో కరీంనగర్ అంగన్‌వాడీ సిబ్బంది పనితీరు బాగుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ప్రశంసించారు. అనేక క్లిష్ట పరిస్థితుల్లో వారందిస్తున్న సేవలను గుర్తించి వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం కరీంనగర్ కళాభారతిలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ పోషణ్ మాసం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ దేశంలో ఒకప్పుడు చిన్న పిల్లలు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడ్డారన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందన్నారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పేరుతో ఉచితంగా ఐదు లక్షల రూపాయల వరకు వైద్యం అందిస్తోందన్నారు. బస్తీ దవాఖానాలతోపాటు ప్రభుత్వ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు. అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన సందర్శించారు. చిన్నారులకు పోషణ, ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు మహిళలు చేతి గ్లౌజ్ తరహాలో తయారు చేసిన ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. వీటిని ప్రతి ఒక్క పిల్లవాడికి అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఎంపీ నిధుల నుంచి వాటిని కొనుగోలు చేయించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.