గంజాయిపై ఉక్కుపాదం
ABN , Publish Date - Aug 07 , 2025 | 01:13 AM
జగిత్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసులు దృష్టి సారించి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో ప్రస్తుత యేడాది గంజాయికి సంబంధించిన కేసుల నమోదులో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినందుకు జిల్లా పోలీసుల తీరును ప్రశంసిస్తూ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య రూ.50 వేల నగదు రివార్డును అందజేశారు. జిల్లాలో గంజాయి వ్యవహారంపై ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు.
-అంతర్రాష్ట్ర నిందితులను పట్టుకున్న పోలీసులు
-రవాణా, విక్రయంపై ప్రత్యేక నిఘా
-మత్తుకు బానిసైన యువతకు కౌన్సెలింగ్
జగిత్యాల, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి రవాణా, విక్రయం, వినియోగంపై పోలీసులు దృష్టి సారించి అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలో ప్రస్తుత యేడాది గంజాయికి సంబంధించిన కేసుల నమోదులో రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచినందుకు జిల్లా పోలీసుల తీరును ప్రశంసిస్తూ తెలంగాణ నార్కోటిక్ బ్యూరో డీజీపీ సందీప్ శాండిల్య రూ.50 వేల నగదు రివార్డును అందజేశారు. జిల్లాలో గంజాయి వ్యవహారంపై ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించారు. పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి విక్రయిస్తున్న ముఠాను ఇటీవల అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలో ఇటీవల మత్తు పదార్థాల నివారణపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ఎస్పీ అశోక్ కుమార్ నేతృత్వంలో యువతతో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను నిర్వహించారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలతో పాటు పలు ప్రాంతాల్లో విద్యార్థులు, యువతతో అవగాహన ర్యాలీలు నిర్వహించారు.
ఫజిల్లాలో గంజాయి కేసులు..
జిల్లాలో 2021 సంవత్సరంలో 14 గంజాయి కేసులు నమోదు కాగా 38 మందిని పోలీసులు అరెస్టు చేసి 30 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2022 సంవత్సరంలో 11 కేసులు నమోదు కాగా 32 మందిని అరెస్టు చేసి 18.42 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2023 సంవత్సరంలో 13కేసులు నమోదు కాగా 36 మందిని అరెస్టు చేసి 91.54 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 2024 సంవత్సరంలో 50 కేసులు నమోదు కాగా 135 మందిని అరెస్టు చేసి రూ.16,43,199 విలువ గల 68.36 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 2025 సంవత్సరంలో ఇప్పటి వరకు 60 కేసులు నమోదు కాగా 138 మందిని అరెస్టు చేశారు. రూ.5,44,525 విలువ గల 19.78 కిలోల గంజాయి, నాలుగు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఫవిద్యార్థులు, యువతే టార్గెట్
మైనర్లు, విద్యార్థులు, యువతనే టార్గెట్‌గా చేసుకొని కొన్ని ముఠాలు వారికి గంజాయి అలవాటు చేసి విక్రయిస్తున్నాయి. ముఠా సభ్యులు కొందరు పలువురు విద్యార్థులకు డబ్బు ఆశ చూపి వారితో గంజాయి రవాణా చేయిస్తున్నాయి. తాజాగా విశాఖ, సీలేరు ప్రాంతాల నుంచి జగిత్యాలకు గంజాయి తీసుకువస్తున్న ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక రాష్ట్రాలతో పాటు భద్రాచలం నుంచి జిల్లాకు అక్రమంగా గంజాయి రవాణా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గంజాయిని చిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో గంజాయి నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్‌లతో విక్రయిస్తున్నారు. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకెట్‌ను రూ.300 వందల నుంచి 1,000 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. చదువుకునే వయసులో వ్యసనాలకు అలవాటు పడిన విద్యార్థులు ఈజీగా డబ్బు సంపాదించడానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాలతో పాటు పలు మండల కేంద్రాలు, మేజర్ పంచాయతీల్లో యువకులు చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నారు. కొందరు యువత మత్తు పదార్థాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులపై దాడులకు సైతం దిగుతున్నారు. ఇలాంటి సంఘటనలపై పోలీసులు దృష్టి సారించి చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువతతో పాటు వారి తల్లిదండ్రులకు సైతం కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ఫఇటీవల నమోదైన కేసులు
-కొడిమ్యాల పోలీస్ స్టేషన్ పరిధి పూడూరులో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. నాగ్‌పూర్ ప్రాంతం గంజాయి తీసుకొని వచ్చి జగిత్యాల, కరీంనగర్, చొప్పదండి తదితర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లుగా విచారణలో వెల్లడైంది.
-జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో ఓ ఇంట్లో పెంచుతున్న నాలుగు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకొని యజమానిపై కేసు నమోదు చేశారు.
-నాలుగు నెలల క్రితం రాయికల్, మల్లాపూర్ మండలాల్లో 10 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ వారిలో చదువు మానేసిన విద్యార్థులు, యువకులు ఉండడం గమనార్హం.
చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తాం
-అశోక్ కుమార్, ఎస్పీ
గంజాయి రవాణా, అమ్మడం, సేవించడం నేరం. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టి పెట్టాలి. పదే పదే నేరాలకు పాల్పడుతున్న వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తాం. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్ముతున్నట్లు, రవాణా చేస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం.