రైతుల వివరాలతో యాప్ సిద్ధం చేయాలి
ABN , Publish Date - Sep 17 , 2025 | 12:53 AM
జిల్లాలోని రైతుల వివరాలతో యాప్ సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని రైతుల వివరాలతో యాప్ సిద్ధం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో వ్యవసాయ,ఉద్యానవన శాఖలపై ఆయా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అందరూ రైతుల పూర్తి వివరాలు ఎన్ని ఎకరాలు ఉంది, ఆధార్ నెంబర్, గ్రామం, మండలం, పట్టాదార్ పాస్ బుక్ నెంబర్ తదితర వివరాలతో అప్లికేషన్ సిద్ధం చేయాలని సూచించారు. దీంతో రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలు, క్రాప్ బుకింగ్, ఎంత యూరియా తీసుకున్నారో వివరాలు ఉండాలని స్పష్టం చేశారు. ఏ రైతు జిల్లాలో ఎక్కడ కొనుగోలు చేసినా ఆ వివరాలు నమోదు కావాలని సూచించారు. జిల్లాకు ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరం, ఇప్పటి వరకు ఎంత వచ్చిందో ఆరా తీశారు. 23 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని, ఇప్పటి వరకు 18 వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని, మిగతా యూరియా పంటల సాగుకు అనుగుణంగా అందుబాటులో ఉంటుందని కలెక్టర్ దృష్టికి జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తీసుకెళ్లారు. జిల్లాలో ఎరువులకు కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు.
లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలి
ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా ఆయిల్ పామ్ సాగును చేసేందుకు ఉద్యానవన శాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు విస్తీర్ణం లక్ష్యం కాగా, ఇప్పటివరకు 1172 ఎకరాల్లో 339 మంది రైతులు ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపించారని, 126 ఎకరా లలో ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తిగా ఉన్న రైతుల రిజిస్ట్రేషన్, పరిపాలన మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఆయిల్ పామ్ ప్లాంటేషన్ వేగవంతం చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి చూపుతున్న రైతుల వద్ద నుంచి మొక్కలు, డ్రిప్ ఏర్పాటుకు రైతుల వాటా డీడీలను సేకరించి సంబంధిత ఏజె న్సీల ద్వారా డ్రిప్ సౌకర్యం సత్వరమే అందేలా చూడాలని, నిర్దేశిత లక్ష్యం ప్రకారం ఆయిల్‌పామ్ సాగు ప్లాంటేషన్ పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 37.5 టన్నులు హార్వెస్టింగ్ చేశారని, టన్ను రూ 19107 పైగా ధర లభించిందని, పంట దిగుబడి వస్తున్న రైతుల అనుభవాలను కొత్త రైతులకు తెలియజేయాలని పేర్కొన్నా రు. కంపెనీ వారు వచ్చి ఆయిల్ పామ్ ఉత్పత్తులు సేకరిస్తారని, వారం రోజుల్లో రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని వెల్లడించారు. లాభసాటి ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఆయిల్‌పామ్ పంట సంబంధించి రైతులు సలహాలు, సూచనలు అందించేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 9398684240కు తెలియజేయాలని, పంట లాభం పై అధిక ప్రచారం కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం, ఉద్యానవన శాఖ అధికారి లత, వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.