Share News

అధ్వాన స్థితిలో అంబులెన్స్‌లు

ABN , Publish Date - Jun 10 , 2025 | 01:07 AM

పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా రోగులకు మౌలిక సదుపాయలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వంద పడకల ఆసుపత్రి నుంచి 362 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడడం లేదు.

  అధ్వాన స్థితిలో అంబులెన్స్‌లు
మూలనపడిన అంబులెన్స్‌

ఇక్కట్లు పడుతున్న రోగులు

నిర్వహణలో విఫలమైన అధికారులు

మరమ్మతులకు నోచుకోక మూలన పడిన వాహనాలు

కళ్యాణ్‌నగర్‌, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): పేరుకే పెద్ద ఆసుపత్రి అయినా రోగులకు మౌలిక సదుపాయలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. వంద పడకల ఆసుపత్రి నుంచి 362 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ అయిన గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ప్రభు త్వం గతంలో మూడు అంబులెన్స్‌లను మంజూరు చేసినా వాటిలో ఒకటి మూలనపడింది. రెండు అంబు లెన్స్‌లతో నెట్టుకువస్తున్నారు. ఎన్‌టీపీసీ సీఎస్‌ఆర్‌ ఫండ్స్‌తో గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి ఇచ్చిన అంబులెన్స్‌లో ఉండాల్సిన స్ట్రెచర్లు రెగ్జిన్‌ చిరిగి పోయి అద్వాన్నంగా ఉన్నాయి. రోగులను ఎక్స్‌రే, సిటీ స్కాన్‌కు తీసుకెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. మరో అంబులెన్స్‌ను మందులకు, ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారు. కరోనా సమయంలో పెద్దపల్లి నుంచి ఇక్కడికి ఈ వాహనాన్ని తీసుకువచ్చారు. వీటి మరమ్మతు చేయకపోవడంతో అది కూడా ఎప్పుడు నడుస్తుందో నడువదో తెలియని పరిస్థితి. మరో అంబులెన్స్‌ ఆక్సిజన్‌ ప్లాంట్‌ వెనుక చెత్త కుప్పల్లో పడి ఉంది.

మృతదేహాల తరలింపునకు ఇక్కట్లు

ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాల తరలింపునకు ప్రత్యేకంగా అంబులెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. మృత దేహాల తరలింపునకు అంబులెన్స్‌లు అందుబాటులో లేవు. చికిత్స పొందుతూ మరణించిన వారికి ఇక్కడే పోస్టుమార్టం నిర్వహిస్తారు. పోస్టుమార్టం అనంతరం ప్రైవేట్‌ అంబులెన్స్‌లకు డబ్బులు చెల్లించలేక పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఆటోల్లో మృతదేహాలను తరలిస్తున్నారు.

అధిక వసూలు చేస్తున్న ప్రైవేట్‌ అంబులెన్స్‌

గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి వచ్చే పేదల బలహీనతలను ఆసరా చేసుకుని ప్రైవేట్‌ అంబులెన్స్‌ యజమానులు సిండికేట్‌గా మారి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరైనా రోగి అత్యవసర సమయంలో ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా, లోకల్‌ చార్జి రూ.2వేలు, మృతదేహానికి లోకల్‌కు రూ.2500, అత్యవసర చికిత్స కోసం కరీంనగర్‌కు రూ.3వేల నుంచి రూ.4వేలు, హైదరాబాద్‌కు రూ.6వేల నుంచి రూ.7వేలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయితే రూ.2వేలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రి గేటు బయట ఉన్న అంబులెన్స్‌ యజమానులంతా సిండికేట్‌గా మారి పేదలను దోచుకుంటున్నారు.

అంబులెన్స్‌ల సంఖ్యను పెంచండి...

సునీల్‌, బీజేపీ నాయకుడు

ధర్మాసుపత్రికి రోజుకు వందల సంఖ్యలో రోగులు వస్తున్నారు. వారికి కనీస వసతులు కల్పించడంలో వైద్య సిబ్బంది విఫలమవుతున్నారు. అంబులెన్స్‌లు అధ్వాన్న స్థితిలో ఉన్నా పట్టించుకోవడం లేదు. స్ట్రక్చర్లు రాడ్లు తేలి ఉన్నా వాటిని మరమ్మతులు చేయడం లేదు. మృతదేహాలను తరలించే అంబులెన్స్‌లను ఏర్పాటు చేసి పేదలకు భారం తగ్గించాలి. మూలన పడ్డ అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకురావాలి.

Updated Date - Jun 10 , 2025 | 01:07 AM