Share News

పంటలన్నీ నీళ్లపాలు..

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:52 AM

మొంథా తుఫాన్‌ ఆరుగాలం కష్టపడి పంటలను నీళ్లపాలు చేసింది.

పంటలన్నీ నీళ్లపాలు..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

మొంథా తుఫాన్‌ ఆరుగాలం కష్టపడి పంటలను నీళ్లపాలు చేసింది. అకాల వర్షాలతోనే కలవర పడుతున్న అన్నదాతలను గురువారం తెల్లవారుజాము వరకు కురిసిన వర్షాలతో వరి, పత్తి పంటల నష్టం కుంగతీసింది. జిల్లావ్యాప్తంగా గురువారం ఉదయం వరకు సగటు వర్షపాతం 102.3 మిల్లీమీటర్ల నమోదైంది. తుఫాన్‌ ప్రభావం గురువారం కూడా వర్షం ఉంటుందని భావించి జిల్లాలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు వివిధ విద్యాసంస్థలకు ఇన్‌చార్జి కలెక్టర్‌ ముందస్తుగా సెలవు ప్రకటించారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు కలెక్టరేట్‌లో కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేశారు. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలో ధాన్యం నీళ్ల పాలైనది. పత్తి తడిసి ముద్దయింది. జిల్లాలోని రుద్రంగి, చందుర్తి, వేములవాడ, కోనరావుపేట, బోయిన్‌పల్లి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఇల్లంతకుంట మండలాల్లోని వరి పంట నేలవాలింది. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆరబోసుకున్న ధాన్యం తడిసిపోయింది. వర్షానికి తడవకుండా టార్పాలిన్లు, కవర్లు కప్పుకున్న కుప్పల్లోకి నీళ్లు చేరి ధాన్యం కొట్టుకుపోయింది. జిల్లాలో 1.84 లక్షల ఎకరాల్లో వరి పంటసాగు కాగా 4.84 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేసింది. ఇందులో 2.70లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పౌరసరఫరాల శాఖ కొనుగోలు లక్ష్యంగా పెట్టుకొంది. ఇందుకోసం జిల్లాలో ఇప్పటివరకు 234 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 96 కేంద్రాల ద్వారా 10237 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. వర్షాల వల్ల ధాన్యం తగ్గడం, తేమ రాకపోవడంతో ధాన్యం తూకం వేగంగా జరగడం లేదు. మరోవైపు పొలాలు తడిగా మారడంతో హార్వెస్టర్లు నడవని పరిస్థితుల్లో కోతలు ముందుకు సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

పొంగుతున్న వాగులు.. మత్తడి దూకుతున్న చెరువులు

జిల్లాలో భారీగా కురిసిన వర్షానికి సిరిసిల్ల మానేరు, వేములవాడ మూలవాగులతో పాటు ఓర్రెలు, చిన్నచిన్న వాగులు పొంగిపొర్లుతున్నాయి. మానేరు, మూలవాగుల నుంచి శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. అన్నపూర్ణ, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లోకి నీరు చేరుతోంది. జిల్లాలోని చెరువులు మత్తడి దూకుతున్నాయి. భారీ వర్షానికి మట్టి ఇళ్లు దెబ్బతిన్నాయి. కోనరావుపేట, ఎల్లారెడ్డిపేటలో రెండు ఇండ్లు కూలిపోయాయి. జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి మానేరు, మూలవాగుల నుంచి శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి 9675 క్యూసెక్కుల నీరు చేరుతుంది. ప్రాజెక్టులో 27.55 టీఎంసీల సామర్థ్యాన్ని 26.760 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి దిగువకు 5175 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఎగువ మానేరు ప్రాజెక్టులోకి 366 క్యూసెక్కులు నీరు చేరుతోంది. అన్నపూర్ణ ప్రాజెక్టులో 3.50 టీఎంసీల సామర్థ్యానికి 3.49 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 300 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అన్నపూర్ణ ప్రాజెక్టు నుంచి 3300 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

జిల్లాలో 102.3 మిల్లీ మీటర్ల వర్షపాతం..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొంథా తుఫాన్‌ ప్రభావంతో గురువారం ఉదయం వరకు సగటు వర్షపాతం 102.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. తంగళ్ళపల్లిలో 171.9 మిల్లీమీటర్లు, ఇల్లంతకుంటలో 136.3 మిల్లీమీటర్లు, కోనరావుపేటలో 132.5 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 120.0 మిల్లీమీటర్లు, చందుర్తిలో 110.5 మిల్లీమీటర్లు, వేములవాడలో 108.3 మిల్లీమీటర్లు, వేములవాడ రూరల్‌లో 93.6 మీటర్లు, ముస్తాబాద్‌లో 92.6 మిల్లీమీటర్లు, సిరిసిల్లలో 88.7 మిల్లీమీటర్లు, బోయిన్‌పల్లిలో 88.5 మిల్లీమీటర్లు, వీర్నపల్లిలో 77.3మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిపేటలో 68.0 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 41.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

Updated Date - Oct 31 , 2025 | 12:52 AM