Share News

ప్రమాద ఘంటికలు..

ABN , Publish Date - Apr 10 , 2025 | 01:34 AM

జగిత్యాల, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవి ఆరంభం నుంచే ఎండల తీవ్రతతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ యేడాది ప్రారంభం, ప్రస్తుత పరిస్థితులకు పోల్చితే సుమారు మీటరు నుంచి మీటరున్నర లోతుకు నీటి మట్టం పడిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పలు ప్రాంతాల్లో బోర్లు పనిచేయడం లేదు.

ప్రమాద ఘంటికలు..

-కొడిమ్యాలలో అత్యధికంగా 11.95 మీటర్ల లోతులోకి..

-పలు ప్రాంతాల్లో వట్టిపోయిన బోర్లు

-నీటిని పొదుపుగా వాడాలంటున్న అధికార యంత్రాంగం

-వరికి ఆఖరి తడి అందక రైతుల ఆందోళన

జగిత్యాల, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వేసవి ఆరంభం నుంచే ఎండల తీవ్రతతో భూగర్భ జలమట్టం వేగంగా పడిపోతోంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు చేరుకున్నాయి. వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులతో రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ యేడాది ప్రారంభం, ప్రస్తుత పరిస్థితులకు పోల్చితే సుమారు మీటరు నుంచి మీటరున్నర లోతుకు నీటి మట్టం పడిపోయిందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు అడుగంటి పలు ప్రాంతాల్లో బోర్లు పనిచేయడం లేదు. మరోవైపు ఎస్సారెస్పీ కాలువ చివరి భూములకు సాగు నీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీర్‌పూర్‌ మండలంలో అత్యల్పంగా 2.08 మీటర్ల లోతులో, కొడిమ్యాల మండలంలో అత్యధికంగా 11.95 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి.

ఫపెరిగిన ఎండల తీవ్రత...

జిల్లాలో పెరిగిన ఎండల తీవ్రతతో బయటికి వెళ్లాలంటే ప్రజలు భయపడాల్సి వస్తోంది. రాతి వేళల్లో ఉక్కపోత కూడా ఎక్కువైంది. దీంతో మే నెలలో ఇంకా భూగర్భ జలమట్టం పడిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బోర్లు వట్టిపోయాయి. బోర్లపైనే ఆధారపడి పంటలు పండిస్తున్న రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. పంటలను కాపాడుకోవడానికి రూ.లక్షల్లో వ్యయం చేసి బోర్ల తవ్వకం చేపట్టినా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటోంది. జిల్లాలో 509 గ్రామ పంచాయతీ చెరువుల కింద 3,130 హెక్టర్ల నీటి విస్తీర్ణం, 185 మత్స్య శాఖ చెరువుల కింద 15,162 హెక్టార్ల నీటి విస్తీర్ణం ఉంది. రాతిపొరలు, కఠిన శిలలు గల గ్రానైట్‌ రాతి 80 శాతం, ఎర్ర, నల్ల రాయి 20శాతం ఉంది.

ఫజిల్లాలో 31 ఫ్యూజో మీటర్లు...

జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి మట్టాన్ని తెలుసుకునేందుకు ప్రభుత్వం గ్రౌండ్‌ వాటర్‌ శాఖ ఆధ్వర్యంలో 31 ఫ్యూజో మీటర్ల ఏర్పాటు చేసింది. ప్రతీ నెల 15వ తేదీ నుంచి 28వ తేదీ లోపు అధికారులు, సిబ్బంది గ్రౌండ్‌ వాటర్‌ లెవల్స్‌ వివరాలు సేకరిస్తున్నారు. ఎక్కడైతే 10 మీటర్లలోపు అడుగులో నీరు ఉంటుందో అక్కడ ఇబ్బంది ఉండదని వారు పేర్కొంటున్నారు. 11 మీటర్ల నుంచి 15 మీటర్ల లోపు, 15 నుంచి 20కి పైగా మీటర్లలోతుల్లో నీటి మట్టం పడిపోతే డేంజర్‌ జోన్‌లోకి ఆ ప్రాంతం వెళ్లినట్లుగా అధికారులు ప్రకటిస్తారు. వెంటనే అక్కడ వాటర్‌ రీచార్జింగ్‌ పద్ధతిని చేపడతారు.

జిల్లాలో భూగర్భ జలాల వివరాలు (మీటర్లలో...)

-------------------------------------------------------------------------------------

మండలం....ఫిబ్రవరి.................మార్చి

-------------------------------------------------------------------------------------

బీర్‌పూర్‌..................1.72..................2.08

బుగ్గారం.................4.50..................5.20

ధర్మపురి..................5.47..................5.81

ఎండపల్లి.................8.30..................7.77

గొల్లపల్లి..................5.45..................4.70

జగిత్యాల రూరల్‌..3.00..................2.55

జగిత్యాల అర్బన్‌....7.70..................8.05

పెగడపల్లి..................4.80..................4.31

రాయికల్‌..................3.38..................3.91

సారంగపూర్‌............5.66..................5.98

వెల్గటూరు..................3.15..................3.54

కొడిమ్యాల..................10.75...............11.95

మల్యాల.....................6.00..................6.92

ఇబ్రహీంపట్నం.......5.27..................4.26

కోరుట్ల.........................8.52..................9.77

మల్లాపూర్‌..................5.34..................5.86

బీమారం.....................4.75..................4.01

కథలాపూర్‌.................2.70..................3.15

మేడిపల్లి.....................4.66..................4.92

మెట్‌పల్లి....................4.93..................6.10

-------------------------------------------------------------------------------------

జిల్లా సగటు...........4.86..................5.24

-------------------------------------------------------------------------------------

Updated Date - Apr 10 , 2025 | 01:34 AM