రైతులపై అదనపు ఆర్థికభారం
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:57 AM
జిల్లాలో పంటలు చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫానుతో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి చేలు పూర్తిగా నేలవాలాయి. దీంతో పంటలు కోయడం భారంగా మారింది.
జగిత్యాల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పంటలు చేతికి వచ్చే సమయంలో మొంథా తుఫానుతో కురిసిన భారీ వర్షాలకు వరి, పత్తి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి చేలు పూర్తిగా నేలవాలాయి. దీంతో పంటలు కోయడం భారంగా మారింది. ఇప్పటికే తెగుళ్లు, వర్షాలతో పెట్టుబడి పెరిగింది. వరుణుడి దెబ్బతో రైతులపై మరింత భారం పడింది. పంటలు కోయాల్సిన సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవడంతో వరి పొలాలు నీట మునిగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సుమారు 3.15లక్షల ఎకరాల్లో వరి సాగయింది. జిల్లాలో సుమారు 7.50 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
ఫనేల వాలిన పంటలు..
వర్షాకాలం ప్రారంభంలో కురిసిన చినుకులు రైతులకు ఆశ కలిగించాయి. ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు నిండడంతో పంటలు పుష్టిగా పండాయి. అయితే అక్టోబరులో కురిసిన వర్షాలు పంటలను దెబ్బతీశాయి. పెసర, మినుము, సోయా, చిక్కుడు, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు వరి పొలాలు నీటమునిగాయి. పంటలు చేతికొచ్చిన సమయంలో వర్షాలు పడడంతో నష్టపోయారు. ఇప్పుడు వరి పంటలు కోయడం మరింత భారంగా మారింది.
ఫయంత్రాలే ఆధారం..
వర్షాలతో పొలాల్లో నీరు నిలిచిపోవడంతో కూలీలతో పనులు కష్టంగా మారింది. మహిళా కూలీల కొరత, కూలి రేట్లు పెరగడం రైతులకు భారమైంది. ఒక్కో మహిళా రైతుకు రోజు కూలి రూ.600 నుంచి రూ.800 వరకు చెల్లిస్తున్నారు. అయినా కూలీలు దొరకడం లేదు. దీంతో రైతులు హార్వేస్టర్లను ఆశ్రయిస్తున్నారు. వర్షాలతో పొలాల్లో బురద ఉండడంతో సాధారణ యంత్రాలతో పంటలు కోసే పరిస్థితి లేదు. దీంతో చైన్ యంత్రాలకు డిమాండ్ పెరిగింది. దీంతో వాటి యజమానులు అద్దె కూడా పెంచారు. గత యేడాది గంటకు రూ.2,500 నుంచి రూ.2,800 వరకు ధరలు చెల్లించారు. ప్రస్తుత యేడాది గంటకు రూ.2,800 నుంచి రూ.3,500 వరకు వసూలు చేస్తున్నారు. వీటితో తడిసిన పొలాల్లో యంత్రాలు నెమ్మదిగా పనిచేయడంతో సమయం, ఖర్చు రెండూ పెరుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫదిగుబడి అంతంతమాత్రమే..
వానాకాలం పంటలపై రైతులు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఎకరానికి రూ.25వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చుచేసినా చేతికొచ్చే దిగుబడి అంతంతమాత్రంగానే ఉంటుంది. వర్షాల కారణంగా పంట నష్టంతో అప్పులు, వడ్డీ భారాన్ని భరించాల్సిన పరిస్థితి నెలకొంది. శ్రమ వృథా అవుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సహకరించకపోతే తమ కష్టం వర్షార్పణం అవుతోందని పేర్కొంటున్నారు.
అకాల వర్షంతో నష్టం
-చిట్యాల భూమారెడ్డి, రైతు, తిమ్మాపూర్ గ్రామం
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు వరి పంటలు పూర్తిగా నేలవాలాయి. పొట్ట దశ నుంచి వర్షాలు అధికంగా పడడంతో పంటలకు నష్టం జరిగింది. వరి పైరు వెన్ను విరిగి నేల వాలడంతో కోయడం కష్టంగా మారింది. యంత్రాలతో కోయించినా దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. యంత్రాల చార్జీలు పెరిగాయి.
మిషన్లకు పైసలు పోతున్నాయి
-జెట్టి అంజయ్య, రైతు, బట్టపల్లి గ్రామం
జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంట పలు ప్రాంతాల్లో నేల వాలింది. ఐదు ఎకరాలు చైన్ మిషన్‌తో కోయిస్తున్నారు. గంటకు రూ.3,500 నుంచి రూ.3,800 వరకు తీసుకుంటున్నారు. మార్పిడి చేసిన ధాన్యం తీసుకురావడం కూడా కష్టంగా మారింది. వర్షాలకు పొలాలు చిత్తడిగా ఉండడంతో పెట్టుబడి మరింత పెరిగింది.