Share News

ధాన్యం సేకరణకు కార్యాచరణ

ABN , Publish Date - Oct 23 , 2025 | 01:17 AM

వానాకాలంలో పండిన ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

ధాన్యం సేకరణకు కార్యాచరణ

- ప్రారంభమవుతున్న కొనుగోలు కేంద్రాలు

- ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి

- మార్కెట్‌కు మూడు లక్షల టన్నులు వస్తుందని అంచనా

- జిల్లావ్యాప్తంగా 325 కొనుగోలు కేంద్రాలు

- 72 గంటల్లో డబ్బు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

వానాకాలంలో పండిన ధాన్యం సేకరణకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ సీజన్‌లో సుమారు ఆరు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని, దానిలో మూడు లక్షల టన్నుల మేరకు కొనుగోలు కేంద్రాలకు రైతులు విక్రయిస్తారని అంచనా వేస్తున్నారు. వ్యవసాయ శాఖ, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ తయారు చేసిన కార్యాచరణను పకడ్బందీగా అమలులో పెట్టి ధాన్యం కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలని భావిస్తున్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఈ వానాకాలం వ్యవసాయశాఖ సమాచారం మేరకు 2,76,879 ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీనిలో 1,53,787 ఎకరాల్లో దొడ్డు రకాలు, 1,23,092 ఎకరాల్లో సన్న రకాలను రైతులు సాగు చేశారు. సన్న రకాల్లో ఎకరాకు 20.23 క్వింటాళ్లు, దొడ్డురకం ఎకరాకు 22.37 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఈ మేరకు 2,60,938 మెట్రిక్‌ టన్నుల సన్న రకాలు, 3,36,991 మెట్రిక్‌ టన్నుల దొడ్డు ధాన్యం దిగుబడిగా వస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో దిగుబడిగా వచ్చిన 5,97,929 మెట్రిక్‌ టన్నుల ధాన్యంలో విత్తన పంట, రైతులు విత్తనాలుగా ఉపయోగించుకోవడానికి మినహాయించుకొనే ధాన్యం 94,493 మెట్రిక్‌ టన్నులు ఉంటుంది. రైతులు ఆహారం కోసం వినియోగించుకునే ధాన్యంతోపాటు ప్రైవేట్‌ మిల్లర్లు కొనుగోలు చేసే ధాన్యం రెండు లక్షల మెట్రిక్‌ టన్నుల మేరకు ఉంటుందని భావిస్తున్నారు. సివిల్‌ సప్లయిస్‌ శాఖ అంచనాల మేరకు 3,01,880 మెట్రిక్‌ టన్నుల కొనుగోలు కేంద్రాలకు వస్తుంది. కొనుగోలు కేంద్రాలకు 1,68,025 మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం, 1,33,855 మెట్రిక్‌ టన్నుల సన్నరకాల వస్తుందని భావిస్తున్నారు.

ఫ జిల్లాలో 325 కొనుగోలు కేంద్రాలు

ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లావ్యాప్తంగా 325 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 184, ఐకేపీ ద్వారా 161 , డీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో 36, హాకా ఆధ్వర్యంలో నాలుగు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసేందుకు జిల్లాలో 79 బాయిల్డ్‌ మిల్లులు, 48 రా రైస్‌మిల్లులు ఉన్నాయి. ఈ మిల్లుల మిల్లింగ్‌ సామర్థ్యం 5,92,000 మెట్రిక్‌ టన్నులు, జిల్లాలో పండిన మొత్తం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చినా మిల్లింగ్‌ చేసే సామర్థ్యం జిల్లా రైస్‌ మిల్లర్లకు ఉంది.

ఫ కొనుగోలు కేంద్రాల్లో సామగ్రి

జిల్లాలో 325 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ధాన్యంపై కప్పేందుకు 10,522 టార్పాలిన్లు అవసరమని గుర్తించారు. 187 ఆటోమెటిక్‌ ప్యాడీ క్లీనర్లు, తేమ శాతం కొలిచే యంత్రాలు, 360 ధాన్యం కొలిచే యంత్రాలు, 769 ఎలక్ర్టానిక్‌ బరువు తూచే మిషన్లు, 360 ఫీల్డ్‌ రిమూవర్స్‌, ధాన్యం ఆరబెట్టే యంత్రాలు రెండు, వీటిలో 3,574 టార్పాలిన్లు, 171 ఆటోమెటిక్‌ ప్యాడీ క్లీనర్లు, 360 ఫీల్డ్‌ బ్యాలెన్సులను తెప్పించాల్సి ఉన్నది.

ఫ సన్న రకాలకు బోనస్‌

ప్రభుత్వం గత రబీ సీజన్‌ నుంచి సన్న రకాలకు క్వింటాల్‌కు 500 రూపాయల చొప్పున బోనస్‌ చెల్లించాలని నిర్ణయించింది. ఈసారి 1,33,855 మెట్రిక్‌ టన్నుల సన్న ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశారు. క్వింటాల్‌కు 500 చొప్పున మెట్రిక్‌ టన్నుకు ఐదు వేల రూపాయల 66.92 కోట్ల రూపాయలు రైతులకు బోనస్‌గా లభించనున్నాయి. ధాన్యం కొనుగోలు చేసిన 72 గంటల్లోగానే ధాన్యం డబ్బుతోపాటు బోనస్‌ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రకటించారు.

ఫ రబీ బోనస్‌ ఏది?

రబీ సీజన్‌లో జిల్లాలో 32,694 మెట్రిక్‌ టన్నుల సన్న వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలు విక్రయించారు. దీనికి 500 రూపాయల చొప్పున 16.35 కోట్ల రూపాయల బోనస్‌ రావాల్సి ఉంది. ఐదు నెలలు గడినాఆ ఆ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కాలేదు. ఈ ధాన్యానికి సంబంధించిన డబ్బు 15 రోజుల్లోగానే రైతుల ఖాతాల్లో జమ అయినా, బోనస్‌ సొమ్ము ఎప్పుడు వచ్చేది వ్యవసాయశాఖ కాని, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ కానీ రైతులకు చెప్పలేకపోతున్నాయి. రబీ సీజన్‌ బోనస్‌ చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే సమాచారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్‌ బోనస్‌ 72 గంటల్లో జమ చేస్తామని మంత్రి ప్రకటన వచ్చింది. రబీ బోనస్‌ గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేకుండా పోయింది.

Updated Date - Oct 23 , 2025 | 01:17 AM