Share News

యాసంగి సాగుకు కార్యాచరణ

ABN , Publish Date - Nov 05 , 2025 | 12:45 AM

జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు, బావులు, బోరు బావులు నీటితో కళకళ లాడుతున్నాయి.

యాసంగి సాగుకు కార్యాచరణ

జగిత్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యాసంగి సాగు ప్రణాళికపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో చెరువులు, కుంటలు, బావులు, బోరు బావులు నీటితో కళకళ లాడుతున్నాయి. భూగర్భ జలాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి. దీంతో యాసంగి సాగుకు అన్ని రకాల పంటలు వేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. జిల్లాలో వివిధ పంటల సాగు అంచనా, ఎరువులు, విత్తనాల అవసరాలు ఎంత అనే కార్యాచరణను రూపొందించారు. వ్యవసాయ శాఖ తాజాగా యాసంగి సాగు ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి అందించింది.

ఫసమృద్ధిగా నీటి నిల్వలు

జిల్లాలో అత్యధిక మంది రైతులు ఎస్సారెస్పీ కాకతీయ కాలువ, వరద కాలువ, చెరువులు, కుంటలు, బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తుంటారు. ప్రతీ సంవత్సరంలో యాసంగిలో వరి, మొక్కజొన్న, జొన్న, ఆవాలు, సజ్జ, నువ్వులు, ఆయిల్‌పామ్‌ పంటలు పండిస్తుంటారు. ప్రస్తుత సీజన్‌లో జిల్లా అంతటా సాగు నీరు అందుబాటులో ఉండడంతో వరి సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు. తక్కువ నీటి అవసరముండే ఆరు తడి పంటలు వేసుకోవడం ఉత్తమమని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నప్పటికీ రైతులు ప్రధాన పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు.

ఫ3.02 లక్షల ఎకరాల వరి సాగు అంచనా..

జిల్లాలో యాసంగి సీజన్‌లో సుమారు 3,95,555 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తారన్న అంచనా ఉంది. ఇందులో ప్రధానంగా వరి పంటను సాగు చేయనున్నారు. జిల్లాలో వరి పంట 3,02,600 ఎకరాలు, మొక్కజొన్న 35,000 ఎకరాలు, నువ్వులు 11,000 ఎకరాలు, మామిడి 38,300 ఎకరాలు, పల్లి 320 ఎకరాలు, జొన్నలు 2,300 ఎకరాలు, మిరప 750 ఎకరాలు, చెరుకు 190 ఎకరాలు, ఆయిల్‌పామ్‌ 4,200 ఎకరాలు, పెసర, మినుము, ఆలసంద, ఆవాలు, కందులు తదితర పంటలు 895 ఎకరాల్లో సాగు అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో పది నుంచి ఇరవై శాతం హెచ్చుతగ్గులు ఉండవచ్చని తెలిపారు.

ఫవిత్తనాలు, ఎరువుల అవసరాలు ఇలా..

జిల్లాలో యాసంగి సీజన్‌లో యూరియా 49,948 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 16,899 మెట్రిక్‌ టన్నులు, పొటాష్‌ 8,330 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ 37,844 మెట్రిక్‌ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 3,665 మెట్రిక్‌ టన్నులు అవసరముంటుందని అంచనా వేశారు. అదేవిదంగా వరి విత్తనాలు 75,650 క్వింటాళ్లు, మొక్కజొన్న 2,800 క్వింటాళ్లు, నువ్వు 385 క్వింటాళ్లు, జొన్న 35క్వింటాళ్లు, పల్లి 128 క్వింటాళ్ళలో అవసరవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఎరువులు, విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.

వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి

-భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, జగిత్యాల

జిల్లాలో రానున్న యాసంగి సీజన్‌కు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు కసరత్తులు చేస్తున్నాం. రైతులకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నాం. రైతులు ఎరువులు, విత్తనాలు కొనుగోలు సందర్భంగా అప్రమత్తంగా వ్యవహరించాలి. అవసరమైన సందర్బాల్లో ఆయా మండలాల వ్యవసాయ అధికారులను సంప్రదించి వారి సూచనలు పాటించాలి.

Updated Date - Nov 05 , 2025 | 12:45 AM