ఎరువుల పంపిణీలో అవకతవకలు జరిగితే చర్యలు
ABN , Publish Date - Jul 24 , 2025 | 12:38 AM
రైతులకు పంపిణీ చేసే ఎరువుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు.
కలెక్టర్ సత్య ప్రసాద్
ఇబ్రహీంపట్నం, జూలై 23 (ఆంధ్రజ్యోతి): రైతులకు పంపిణీ చేసే ఎరువుల పంపిణీలో అవకతవకలు జరిగితే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ సత్యప్రసాద్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎరువులు పంపిణీ చేసిన రికార్డులను పరిశీలించారు. మే నెలలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి 35 బస్తాల యూరియా పంపిణీ చేసినట్లు రికార్డులో చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు రైతుల భూమి వివరాలు ఏమీ లేకుండా ఎలా ఇచ్చారని, ఒక రైతుకు అన్ని బస్తాల ఎరువులు ఇస్తే మిగతా రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ విషయమై సంబంధిత పీఏసీఎస్ సీఈవో, ఏఈవో పై చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారిని ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రికార్డులను పరిశీలించి, డెంగ్యూ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. సిబ్బంది పని తీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. భూభారతి దరఖాస్తులను, సాదాబైనామ దరఖాస్తులు, ప్రభుత్వ భూములకు సంబంధించిన, పట్టా భూములకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించారు. రేషన్‌కార్డు దరఖాస్తుల వివరాలను తహసీల్దార్‌ను అడిగి తెలుసుకున్నారు. మండలంలో మొత్తం 1300 రేషన్ కార్డులు వచ్చాయని అందులో 293 కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా పూర్తిచేయాలని తహసీల్దార్ ను ఆదేశించారు. మండల కేంద్రంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో గల 972 సర్వేనంబర్ గల భూమిలో 5000 మొక్కలు నాటాలని అధికారులకు సూచించారు.
ఫ నీటిని వదలాలని కలెక్టర్‌కు వినతి..
గోదావరి నదిలోకి ఎస్సారెస్పీ నీటిని వదలాలని గంగనాల ప్రాజెక్టు ఆయకట్టు రైతులు కలెక్టర్ సత్యప్రసాద్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఇబ్రహీంపట్నం మండలంతో పాటు మల్లాపూర్ మండలాల రైతులు ఈ ఆయకట్టు నీటి ద్వారానే పంటలు సాగు చేస్తారని రైతులు కలెక్టర్ కు తెలియజేశారు. కలెక్టర్ వెంట డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి సురేష్, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఏడీఏ రమేష్, తహసీల్దార్ వరప్రసాద్, ఇన్‌చార్జి ఎంపీడీవో రామకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, ఏవో రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.