అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు
ABN , Publish Date - Jun 07 , 2025 | 12:46 AM
రైతుల అనుమతి లేకుండా అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు.
ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్
పెగడపల్లి, జూన్ 6 (ఆంధ్రజ్యోతి): రైతుల అనుమతి లేకుండా అక్రమంగా నీటిని తరలిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హెచ్చరించారు. పెగడపల్లి మండలంలోని నామాపూర్ గ్రామశివారులోని జంగంకుంట చెరువును విప్ లక్ష్మణ్ కుమార్ మండల నాయకులు, రైతులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న కాళేశ్వరం లింక్-2 కాలువ పక్కనే ఉన్న చెరువులోని నీటిని మెగా కంపెనీ పైపుల ద్వారా నీటిని తరలించారని స్థానిక రైతులు అధికారులకు, పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విప్ లక్ష్మణ్‌కుమార్ శుక్రవారం చెరువును పరిశీలించి మాట్లాడుతూ చెరువులో నీటిని ఎట్టిపరిస్థితిలో తీయవద్దని ఇరిగేషన్ శాఖ డీఈ నర్సింగరావును ఆదేశించారు. రైతులు త్యాగం చేసి భూములు ఇవ్వడం వల్లనే నేడు ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని అన్నారు. రైతులు తమ విలువైన భూములు ఇచ్చినపుడు వారిని గౌరవించడం నేర్చుకోవాలని ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ కంపెనీ ప్రతినిధులకు సూచించారు. మరోసారి ఇలాంటి సమస్య ఉత్పన్నమైతే చట్టపరమైన చర్యలు తప్పవని మెగా కంపెనీ ఏజీఎం దినేష్ సింగ్‌ను లక్ష్మణ్‌కుమార్ హెచ్చరించారు. కార్యక్రమంలో మండల నాయకులు మార్కెట్ చైర్మన్ బుర్ర రాములుగౌడ్, పవన్ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, భరత్ రెడ్డి, రవి తదితరులు ఉన్నారు.