పునర్విభజనలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
ABN , Publish Date - Jun 15 , 2025 | 12:07 AM
డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హెచ్చరించారు.
- నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్
కరీంనగర్ టౌన్, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ హెచ్చరించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలిసి ఆయన శనివారం పర్యటించారు. డివిజన్ల పునర్విభజనపై వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో ఆయన విచారణ జరిపారు. అనంతరం నగరపాలక సంస్థ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పురపాలక శాఖ నిబంధనల ప్రకారం ఫీల్డ్ లెవల్‌లో పరిశీలించి పారదర్శకంగా ఫిర్యాదులను పరిష్కరించాలన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఫిర్యాదులను పరిశీలించాలని ఆదేశించారు. బిల్ కలెక్టర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో ఇంటి నంబర్లు తప్పిపోకుండా సరైన వివరాలను అందించాలన్నారు. ఇంటి నంబర్లలో తప్పిదాలు జరిగితే సంబంధిత బిల్ కలెక్టర్లు, ఆర్‌ఐలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ కమ్యూనిటీ ప్రజలకు అన్యాయం జరగకుండా పారదర్శకంగా డివిజన్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఇన్‌చార్జి డీసీపీ బషీరొద్దీన్, ఏసీపీలు శ్రీధర్, వేణు, టీపీఎస్‌లు రాజ్‌కుమార్, తేజస్విని, సంధ్య, ఆర్‌వో భూమానందం, ఆర్‌ఐలు విజయలక్ష్మి, కిష్టయ్య, హిదాయుత్లా, సూపరింటెండెంట్ సంజీవ్, టీజీవోలు సాయిచరణ్, ఖాదర్, నదియా, సాయికిరణ్, నవీన్ పాల్గొన్నారు.