పక్కాగా.. భూముల లెక్క
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:42 AM
రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత అంశాల్లో పారదర్శకత పెంచేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతిగా మార్చారు. తాజాగా భూసమస్యల పరిష్కారానికి లైసెన్సడ్ సర్వేయర్లను నియమించిన ప్రభుత్వం సమగ్ర స్థాయిలో భూ సర్వేకు నిర్ణయించింది.
- భూ సర్వేకు సర్కారు సిద్ధం
- జిల్లాలో తొలి విడతగా 70 గ్రామాలు ఎంపిక
జగిత్యాల, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం భూసంబంధిత అంశాల్లో పారదర్శకత పెంచేలా కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన ధరణి చట్టాన్ని రద్దు చేసి భూభారతిగా మార్చారు. తాజాగా భూసమస్యల పరిష్కారానికి లైసెన్సడ్ సర్వేయర్లను నియమించిన ప్రభుత్వం సమగ్ర స్థాయిలో భూ సర్వేకు నిర్ణయించింది. జగిత్యాల జిల్లా నుంచి 70 గ్రామాల జాబితాను సమర్పించగా, ప్రభుత్వ అనుమతి తీసుకొని ఆయా గ్రామల్లో సర్వే నిర్వహించడానికి నిర్ణయించారు. ఇందులో రెండు వేల ఎకరాల లోపు భూమి ఉన్న గ్రామాలను ఎంచుకున్నారు. తద్వారా సర్వే త్వరగా పూర్తవుతుందని, ఆపై ఎదురయ్యే సమస్యల ఆధారంగా ముందుకు సాగొచ్చని భావిస్తున్నారు. సర్వే నిర్వహించడానికి సుమారు వంద మంది లైసెన్సడ్ సర్వేయర్లకు శిక్షణను ఇచ్చారు. కాగా సర్వే అనంతరం భూమి వివరాలతో ప్రతీ రైతుకు భూ ఆధార్ కార్డు జారీ చేస్తారు. ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డులాగా భూమికి సంబంధించి సమస్త వివరాలతో భూఆధార్ కార్డులు రూపొందించనున్నారు.
- అందుబాటులోకి షేప్ ఫైల్స్..
భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు ఎదురుకాకుండా ప్రభుత్వం డిజిటలైజేషన విధానాన్ని ఉపయోగిస్తోంది. ఇందులో భాగంగా భూములు సర్వే అనంతరం హద్దులు ఇతర వివరాలను షేప్ ఫైల్స్ పేరుతో భూభారతి సైట్‌లో అప్‌లోడ్ చేస్తారు. తద్వారా కొనుగోళ్లు, అమ్మకాల సమయంలో ఎలాంటి కొర్రీలకు అవకాశం ఉండదని, ఎవరూ మార్చడానికి వీలుకాదని చెబుతున్నారు. ఇందులోనే ప్రభుత్వ భూముల వివరాలు నమోదు చేయనుండడంతో పట్టాభూమి, ప్రభుత్వ భూముల వివరాలు తెలుసుకోవడం సులభం అవుతుంది. ఇప్పటికే ప్రభుత్వం హైవేలు, ఇతర అభివృద్ధి పనులకు సేకరించిన భూముల వివరాలు సైట్‌లో అప్‌లోడ్ చేసింది.
- మొబైల్ యాప్ ద్వారా..
భూముల సర్వే కోసం మొబైల్ యాప్ రూపొందించారు. గతంలో డ్రోన్లు, ఆ తర్వాత రోవర్స్ ద్వారా భూములను కొలిచేవారు. ప్రస్తుతం యాప్ ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా భూములు సర్వే చేస్తారు. ట్రాక్ తెలంగాణ రిమోట్ అప్లికేషన సెంటర్ ఎనఐసీ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ ఆధ్వర్యంలో సర్వే జరుగనుంది.
- జగిత్యాల రెవెన్యూ డివిజనలో ఎంపికైన గ్రామాలివే..
జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్, గుల్లపేట, తక్కలపల్లి, కొడిమ్యాల మండలం శనివారంపేట, తిప్పాయిపల్లి, పోతారం, చెప్యాల, మల్యాల మండలం గొర్రెగూడెం, రాంపూర్, నర్సాపూర్, పెగడపల్లి మండలం కీచులాటపల్లి, ల్యాగలమర్రి, నర్సింహునిపేట, వెంగళాయిపేట గ్రామాలు ఎంపికయ్యాయి. బీర్‌పూర్ మండలం రేకులపల్లి, రంగసాగర్, చెర్లపల్లి, తుంగూరు, బుగ్గారం మండలం చిన్నాపూర్, సిర్‌వంచ కోట, గంగాపూర్, యశ్వతరావుపేట, ధర్మపురి మండలం నాగారం, తీగల ధర్మారం, తెమ్మెనాల, ఆరెపల్లి, గొల్లపల్లి మండలం అబ్బాపూర్, అగ్గిమల్ల, బీంరాజ్‌పల్లి, బొంకూర్, రాయికల్ మండలం అలూరు, చింతలూరు, ఉప్పుమడుగు, వీరాపూర్, సారంగాపూర్ మండలం లచ్చక్కపేట, నాగునూర్, పోతారం, ఎండపల్లి మండలం వడ్కల్, సానబండ, సూరారం, ఉండెడ, వెల్గటూరు మండలం ముక్కట్రావుపేట, శంకరపురం, రాంనూర్, బీర్సాని గ్రామాల్లో సర్వే చేయనున్నారు.
కోరుట్ల రెవెన్యూ డివిజనలో..
కోరుట్ల రెవెన్యూ డివిజనలోని కోరుట్ల మండలం ధర్మారం, గుమ్లాపూర్, సంగెం, మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, తొంబర్రావుపేట, దమ్మన్నపేట, భీమారం మండలంలోని లింగంపేట, రాగోజిపేట, పసునూర్, ఒడ్యాడ్, కథలాపూర్ మండలంలోని నాగమల్లప్పకుంట, ఊట్‌పల్లి, పెగ్గర్ల, దూలూరు గ్రామాల్లో సర్వే చేయనున్నారు.
మెట్‌పల్లి రెవెన్యూ డివిజనలో..
ఇబ్రహీంపట్నం మండలం కోమటి కొండపూర్, కేశాపూర్, మూలరాంపూర్, బర్ధిపూర్, మెట్‌పల్లి మండలంలోని మాసాయిపేట, పెద్దాపూర్, రాంచంద్రంపేట, విట్టంపేట, మల్లాపూర్ మండలంలోని గుండంపల్లి, రాందాస్‌పేట, లక్ష్మీపూర్ గ్రామాలు ఎంపికయ్యాయి.