Share News

ఊపందుకున్న సాగు

ABN , Publish Date - Aug 10 , 2025 | 02:27 AM

జిల్లాలో వానాకాలం సాగు జోరందుకుంది.

ఊపందుకున్న సాగు

జగిత్యాల, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం సాగు జోరందుకుంది. ముందస్తు వర్షాలు కురిసి ఊరించడం, తర్వాత ముఖం చాటేయడంతో రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. అనంతరం కొన్ని రోజులుగా మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. భూగర్భ జలాలు కొద్దికొద్దిగా పెరగడం, చిన్న నీటి వనరుల్లోకి నీరు రావడం, శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తి కాకతీయ కాలువ, వరద కాలువలకు నీరు విడుదల చేయడం వెరసి జిల్లాలో పంటల సాగు ఉత్సాహంగా కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్‌లో కురిసిన ముందస్తు వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో విత్తనాలు వేసినప్పటికీ రైతులు నష్టాలకు గురయ్యారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అన్నదాతలు వరి నాట్ల ప్రక్రియ దాదాపు పూర్తి చేశారు. లోటు వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న రైతులు వరి నాట్లను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వివిధ పంటల సాగు లక్ష్యం ఇప్పటికే 75శాతం దాటింది.

ఫజిల్లాలో సాగు ఇలా..

జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా వరి సాగు చేపడుతున్నారు. ప్రస్తుత సీజన్‌లో వరుణుడి కరుణ కొంతనైనా లభించడంతో సాగు పనులు ముమ్మరం చేశారు. జిల్లాలో వానాకాలం 4,15,169 ఎకరాల్లో పంటలు పండించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఇప్పటి వరకు 3,22,842 ఎకరాల్లో వివిధ పంటలను సాగు చేస్తున్నారు. వరి సాధారణ సాగు విస్తీర్ణం 3,10,242 ఎకరాలు కాగా ఇప్పటికే 2,43,432 ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో పత్తి 15,436 ఎకరాలు, మొక్కజొన్న 30,935 ఎకరాల్లో సాగు అవుతోంది. సోయాబిన్‌ 777 ఎకరాలు, కందులు 242 ఎకరాలు, పెసర 240 ఎకరాలు, చెరుకు 745 ఎకరాలు, అనుములు 208 ఎకరాలు, మిరప 365 ఎకరాలు, వెజిటేబుల్స్‌ 277 ఎకరాలు, పసుపు 10,126 ఎకరాలు, ఇతర పంటలు 20,09 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

అందుబాటులో ఎరువులు

-భాస్కర్‌, జిల్లా వ్యవసాయ శాఖాధికారి

జిల్లాలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వివిధ పంటలు సాగు పనులు ఊపందుకున్నాయి. జిల్లాలో వానాకాలం సాగులో అగ్రస్థానంగా వరి నిలుస్తోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా వరి సాగు చేస్తున్న జాబితాలో జగిత్యాల జిల్లా నిలుస్తోంది. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం సైతం సాగు పెరగడానికి కారణంగా నిలుస్తోంది.

Updated Date - Aug 10 , 2025 | 02:27 AM