Share News

ఏసీబీ దూకుడు..

ABN , Publish Date - Dec 31 , 2025 | 01:35 AM

జిల్లాలో ఈ యేడాది వివిధ శాఖల్లోని పలువురు అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. దీంతో జిల్లాలో అవినీతి నిరోదక శాఖ కూడా దూకుడు పెంచింది.

ఏసీబీ దూకుడు..

-లంచం తీసుకుంటూ చిక్కిన ఏడుగురు అధికారులు కటకటాల్లోకి..

-పైసలివ్వనిదే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో కదలని ఫైళ్లు

-పలువురు ఉద్యోగులకు అవినీతి మరక

జగిత్యాల, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఈ యేడాది వివిధ శాఖల్లోని పలువురు అధికారులు, సిబ్బంది ఏసీబీకి చిక్కారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై ప్రజలు, బాధితుల నుంచి ఫిర్యాదులు వెల్లు వెత్తాయి. దీంతో జిల్లాలో అవినీతి నిరోదక శాఖ కూడా దూకుడు పెంచింది. గతంలో ఫిర్యాదులపై ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాతే అధికారులు రంగంలోకి దిగేవారు. అయితే ఆలస్య మవుతున్న కొద్దీ ఫిర్యాదుదారు నిరుత్సాహంతో వెనక్కి తగ్గే అవకాశం ఉండడం, డబ్బులు డిమాండ్‌ చేసిన అధికారి జాగ్రత్తపడే అవకాశం ఉండడంతో ఏసీబీ స్పీడ్‌ పెంచింది. ఈ యేడాది బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే తక్షణమే స్పందిస్తున్నారు. లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే ఆరా తీసి వలపన్ని పట్టుకుంటున్నారు. ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు తక్షణమే స్పందిస్తుండడంతో పలు సంఘటనల్లో అవినీతి అధికారులు చిక్కుతున్నారు.

ఫఏసీబీ దాడుల కలకలం..

జనవరి 15న మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. ల్యాండ్‌ మార్ట్‌గేజ్‌ చేసేందుకు మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ అసిఫోద్దిన్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ రవి, ఆఫీస్‌ సబార్డినేట్‌ రవిలు కలిసి రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన హన్మకొండలో పనిచేస్తున్న డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌కు చెందిన జగిత్యాలలోని గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని ఫిర్యాదు మేరకు జగిత్యాలలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. మార్చి6న ధర్మపురి మున్సిపల్‌ కమిషనర్‌ కందుకూరి శ్రీనివాస్‌ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ మహేశ్‌ వద్ద వేతనం చెల్లింపు కోసం రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. మార్చి 5న కోరుట్ల ఎస్‌ఐ శంకరయ్య రూ.5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఏప్రిల్‌ 11న జిల్లా కేంద్రంలోని ట్రెజరీ శాఖ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌గా పనిచేస్తున్న అరిగె రఘుకుమార్‌ కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ వద్ద నుంచి రూ.7 వేల లంచం డబ్బులను తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుబడ్డాడు. జూన్‌ 2వ తేదీన ఓ రైతు నుంచి మధ్యవర్తి ద్వారా రూ.10 వేల లంచం తీసుకుంటుండగా రాయికల్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ గణేష్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. జూలై 30న జిల్లా కేంద్రంలో పంచాయతీరాజ్‌ శాఖ విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న సింగం అనిల్‌ కోరుట్లకు చెందిన ఓ కాంట్రాక్టర్‌కు క్వాలిటీ ధ్రువీకరణ పత్రం అందజేయడానికి రూ.7వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఫఅవినీతి అధికారులపై కొరడా

ప్రస్తుత యేడాది పలువురు అధికారులకు అవినీతి మరకలు అంటుకున్నాయి. రూ.లక్షల్లో జీతాలున్నా చేయి తడపపిదే కొంత మంది ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాల్లో పనిచేయడం లేదు. పని జరగాలంటే అంతో ఇంతో ముట్టజెబితే కానీ ఫైలు ముందుకు కదలడం లేదు. ఒకవైపు ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నా మరోవైపు అక్రమార్కుల తీరు మారడం లేదు. ఉన్నత ఉద్యోగం, సమాజంలో గౌరవం, నెల చివరి తేదీకి జీతం వచ్చినా అత్యాశకు పోతున్న కొంత మంది అధికారులు లంచాలు తీసుకుంటూ కటకటాలపాలవుతున్నారు. వివిధ పనుల నిమిత్తం, బిల్లుల మంజూరు కోసం లంచాలు డిమాండ్‌ చేసే అధికారులు, సిబ్బందిపై కొరడా ఝులిపించడానికి మేమున్మా మంటూ ఒకవైపు భరోసానిస్తూ అండగా నిలుస్తున్నప్పటికీ, మరోవైపు లంచాలు తీసుకోవడం ఆగడం లేదు. ప్రస్తుత యేడాది జిల్లాలో ఏసీబీ వరస దాడులు కలకలం రేపుతున్నాయి. గడిచిన ఏడు నెలల్లో ఏడుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

ఫకార్యాలయాల్లోనే లంచం తీసుకుంటూ..

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవినీతి అధికారులను టార్గెట్‌ చేస్తూ ఏసీబీ నిఘా పెంచడంతో అధికారుల్లో ఆందోళన నింపింది. ప్రస్తుత యేడాది పట్టుబడ్డ పలువురు అధికారులు, ఉద్యోగులు వారు పనిచేసే కార్యాలయాల్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖ, ట్రెజరీ శాఖ, మున్సిపల్‌, శాఖ, పోలీసు శాఖ, రవాణా శాఖ, అటవీ శాఖ, పంచాయతీరాజ్‌ శాఖల్లో ఏసీబీ సోదాల్లో పలువురు అధికారులు పట్టుబడ్డారు.

ఫమధ్యవర్తులనూ వదలని ఏసీబీ..

అవినీతికి పాల్పడుతున్న వారిని పట్టుకునే విషయంలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ యేడాది ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్న వారినీ వదిలిపెట్టడం లేదు. దీంతో మధ్యవర్తిత్వం చేసిన వారు కూడా ఏసీబీ కేసుల్లో ఇరుక్కోక తప్పడం లేదు. అధికారులకు వంత పాడేందుకు ప్రయత్నిస్తే ప్రైవేటు వ్యక్తులు అయినా సరే చట్టాలకు పనిచెప్పి తీరుతామని అంటున్నారు ఏసీబీ అధికారులు. ఈ యేడాది జనవరిలో మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సమయంలో ప్రైవేటు వ్యక్తి అయిన డాక్యుమెంట్‌ రైటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. ఈ యేడాది పలువురు అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కడం, మరికొందరు ఉద్యోగులపై నిఘా పెరగడం ఉద్యోగ వర్గాల్లో కలకలం రేపింది.

Updated Date - Dec 31 , 2025 | 01:35 AM