Share News

ఏసీబీ దూకుడు

ABN , Publish Date - Jul 31 , 2025 | 01:09 AM

జగిత్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. కొన్ని నెలలుగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకొని కటకటాల్లోకి పంపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వలపన్ని పట్టుకుంటున్నారు.

ఏసీబీ దూకుడు

-ఏడు నెలల్లో ఏడుగురు లంచావతారులు కటకటాల్లోకి...

-బాధితుల ఫిర్యాదుతో వల పన్ని పట్టుకుంటున్న అధికారులు

-తాజాగా ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ఏఈ

జగిత్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. కొన్ని నెలలుగా జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకొని కటకటాల్లోకి పంపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే వలపన్ని పట్టుకుంటున్నారు. బాధితుల నుంచి ఫిర్యాదు రాగానే ఏసీబీ అధికారులు స్పందిస్తుండడంతో అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. ఉన్నత ఉద్యోగం, సమాజంలో గౌరవం ఉన్నా అత్యాశకు పోతున్న కొంత మంది అధికారులు లంచాలు తీసుకుంటూ కటకటాలపాలవుతున్నారు. ఇటీవల జిల్లాలో ఏసీబీ వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. గత ఏడు నెలల్లో ఏడుగురు అధికారులు ఏసీబీకి పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బుధవారం జిల్లా కేంద్రంలో పంచాయతీ రాజ్‌ శాఖ విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్న సింగం అనిల్‌ కోరుట్లకు చెందిన కాంట్రాక్టర్‌ వెంకటేశ్‌కు క్వాలిటీ ధ్రువీకరణ పత్రం అందజేయడానికి రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

ఫఎవరికి ఫిర్యాదు చేయాలి...?

ప్రభుత్వ కార్యాలయాల్లో వివిధ పనుల కోసం లంచం అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి. సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫాంలో 9440446106 నంబరుకు గాని, తెలంగాణ ఏసీబీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌కు గాని, ట్విట్టర్‌లో గాని ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. టోల్‌ఫ్రీ నంబరు హైదరాబాద్‌ ఏసీబీ కార్యాలయంలో ఉంటుంది. అక్కడి నుంచి ఉమ్మడి జిల్లాలోని ఏసీబీ డీఎస్పీ స్థాయి అధికారి లేదా కార్యాలయానికి సమాచారం అందుతుంది. ఎవరైనా నేరుగా డీఎస్పీ లేదా ఇన్‌స్పెక్టర్లకు ఫిర్యాదు చేసినా విచారణ చేస్తారు. ఆరోపణలు నిజం అని తేలితే ఫిర్యాదుదారుడి నుంచి ఏసీబీ అధికారులు డబ్బులు తీసుకొని వాటికి కెమికల్‌ కలిపి ఇస్తారు. వారు సూచించిన విధంగా అవినీతి అధికారికి వాటిని ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడు సదరు అధికారి లేదా సిబ్బందికి నగదు ఇవ్వగానే ఏసబీబీ అధికారులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకుంటారు. ఫిర్యాదుదారుడి డబ్బులు కేసు నడుస్తుండగానే 30 నుంచి 45 రోజుల్లో వాపసు వస్తుందని ఏసీబీ వర్గాలు అంటున్నాయి.

ఫకార్యాలయాల్లోనే లంచం తీసుకుంటూ...

జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో అవినీతి అధికారులను టార్గెట్‌ చేస్తూ ఏసీబీ నిఘా పెంచడంతో అధికారుల్లో ఆందోళన కలుగుతోంది. ఇటీవల పట్టుబడ్డ పలువురు అధికారులు, ఉద్యోగులు వారు పనిచేసే కార్యాలయాల్లోనే లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్కుతున్నారు. జిల్లాలో రిజిస్ట్రేషన్‌ శాఖ, ట్రెజరీ శాఖ, మున్సిపల్‌, శాఖ, పోలీసు శాఖ, రవాణా శాఖ, అటవీ శాఖ, పంచాయతీ రాజ్‌ శాఖల్లో ఏసీబీ సోదాలు జరగడం, ఆరుగురు అధికారులు పట్టుబడ్డ సంఘటనలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసింది. మిగితా శాఖ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు.

ఫపట్టుబడుతున్న మధ్యవర్తులు

ఇటీవల కాలంలో ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికితే క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్నా వదిలిపెట్టడం లేదు. దీంతో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న వారు కూడా ఏసీబీ కేసుల్లో ఇరుక్కోక తప్పడం లేదు. ఈ యేడాది జనవరిలో మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన సమయంలో ప్రైవేటు వ్యక్తి అయిన డాక్యుమెంట్‌ రైటర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. గతంలో మీడియేటర్లు డబ్బులు తీసుకున్నట్లయితే వారిని అరెస్టు చేసే విధానాన్ని అవలంభించకపోయేవారు. కొంతకాలంగా వీరిని కూడా పట్టుకుంటుండడంతో అధికార యంత్రాంగం ఎంచుకున్న అవినీతి దారులను మూసివేసే ప్రయత్నం ఏసీబీ చేస్తున్నట్లుగా స్పష్టమవుతోంది.

ఏడు నెలల్లో ఏడు ఘటనలు...

ఫ జిల్లా కేంద్రంలో బుధవారం పంచాయతీ రాజ్‌ శాఖ విజిలెన్స్‌ అండ్‌ క్వాలిటీ కంట్రోల్‌ కార్యాలయం ఏఈ సింగం అనిల్‌ కోరుట్లకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఫ ఈ యేడాది జూన్‌ 2వ తేదీన ఓ రైతు నుంచి మద్యవర్తి ద్వారా రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా రాయికల్‌ ఇన్‌చార్జి తహసీల్దార్‌ గణేష్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఫ ఏప్రిల్‌ 11న కలెక్టరేట్‌లోని ట్రెజరీ జిల్లా శాఖ కార్యాలయంలో సీనియర్‌ అకౌంటెంట్‌ అరిగె రఘు కుమార్‌ కోరుట్ల పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ వద్ద నుంచి రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఫ మార్చి 6న ధర్మపురి మున్సిపల్‌ కమిషనర్‌ కందుకూరి శ్రీనివాస్‌ కార్యాలయంలో పనిచేసే కాంట్రాక్టు ఎన్విరాల్‌మెంట్‌ ఇంజనీర్‌ మహేశ్‌ వద్ద వేతనం చెల్లింపు కోసం రూ.20 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

ఫమార్చి 5న పేకాటకేసులో సెల్‌ఫోన్‌ రిలీజ్‌ చేయడానికి శ్రీనివాస్‌ అనే వ్యక్తి వద్ద కోరుట్ల ఎస్‌ఐ శంకరయ్య రూ.5 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు.

ఫజనవరి 15న ల్యాండ్‌ మార్ట్‌గేజ్‌ చేసేందుకు మెట్‌పల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ అసిఫోద్దిన్‌, డాక్యుమెంట్‌ రైటర్‌ రవి, ఆఫీస్‌ సబార్డినేట్‌ రవిలు రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

ఫఫిబ్రవరి 7న హన్మకొండలో పనిచేస్తున్న డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ పుప్పాల శ్రీనివాస్‌కు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఫిర్యాదు మేరకు జగిత్యాలలోని ఆయన గృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.

లంచం అడిగితే సమాచారమివ్వండి..

-విజయ్‌ కుమార్‌, ఏసీబీ డీఎస్పీ, కరీంనగర్‌

ప్రభుత్వ శాఖల్లో పనిచేసే అధికారులు ప్రజలను లంచం అడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులకు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరైనా లంచం ఇవ్వాలని అడిగితే 1064 టోల్‌ఫ్రీ నంబరుకు గానీ, ఏసీబీ వాట్సాప్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 9440446106కు గాని ఫిర్యాదు చేయాలి.

Updated Date - Jul 31 , 2025 | 01:09 AM