జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 01:08 AM
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు.
-కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఇతర అధికారులు హాజరయ్యారు. యూరియా సమస్య తలెత్తకుండా అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు దిశానిర్దేశం చేశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడారు. ప్రతి రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్‌ఫోర్స్ టీములు, డివిజన్ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభ, ముగింపు నిల్వలను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రతి విక్రయ కేంద్రం వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో సహకార శాఖల ద్వారా సరిపడా కేంద్రాలున్నాయని, అదనంగా కావాల్సిన విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. జిల్లాలో ఏఆర్‌ఎస్‌కే, డీసీఎంఎస్, ఫ్యాక్స్, రిటైలర్ల కేంద్రాలలో యూరియా విక్రయాలు జరుగుతున్నాయని తెలిపారు. రైతులు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు. యూరియా పంపిణీ ప్రక్రియ పారదర్శకంగా ఉండేలా ప్రజలకు స్పష్టంగా కనిపించే విధంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశిం చారు. ఏదేని సమాచారం కోసం సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.