Share News

ఏడాదిన్నరగా.. ఎదురుచూపులు

ABN , Publish Date - Dec 25 , 2025 | 01:01 AM

మన ఊరు.. మన బడిలో భాగంగా జిల్లాలోని ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఒక డైనింగ్‌ హాల్‌, అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గదిని నిర్మించిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తనకు రావాల్సిన సుమారు 12లక్షల రూపాయల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాడు. అయినా కూడా ఒక్క రూపాయి బిల్లు రాలేదు. ఈ విధంగా ఆయనే కాదు చాలా గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు.

ఏడాదిన్నరగా.. ఎదురుచూపులు

- మన ఊరు.. మన పాఠశాల బిల్లులు రాక ఇక్కట్లు.

- కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న మాజీప్రజాప్రతినిధులు

- బిల్లులు విడుదల చేయకుంటే చావే శరణ్యం అంటున్న బాధితులు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మన ఊరు.. మన బడిలో భాగంగా జిల్లాలోని ఓదెల మండలం కొలనూరు జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఒక డైనింగ్‌ హాల్‌, అదే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒక తరగతి గదిని నిర్మించిన ఓ మాజీ ప్రజాప్రతినిధి తనకు రావాల్సిన సుమారు 12లక్షల రూపాయల బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ఏడాదిన్నర కాలంగా తిరుగుతున్నాడు. అయినా కూడా ఒక్క రూపాయి బిల్లు రాలేదు. ఈ విధంగా ఆయనే కాదు చాలా గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు రాక అనేక మంది ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 5.5కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు వరకు ప్రభుత్వం బిల్లులు విడుదల చేయాల్సి ఉంది. గత ప్రభుత్వ హయాంలో మన ఊరు.. మన పాఠశాల కార్యక్రమంలో భాగంగా పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన పనుల బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో పనులు చేసిన వాళ్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏడాదిగా బిల్లులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో సదరు వ్యక్తులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు చేసి స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీల బాద్యులు, మాజీప్రజాప్రతినిధులు పనులు చేశారు. ఎంబీ రికార్డులు పూర్తయినా కూడా ప్రభుత్వం బిల్లులను విడుదల చేయకపోవడంతో తాము బతికేది ఎలా అని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో సుమారు 6 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండడం గమనార్హం. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలుమార్చాలని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమానికి 2021-22లో శ్రీకారం చుట్టింది. మూడేళ్లలో పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. ఇందుకోసం అప్పటి సీఎం కేసీఆర్‌ పలువురు మంత్రులతో కలిసి సబ్‌ కమిటీని వేశారు. ఈ కమిటీ 2021మార్చి 23, ఏప్రిల్‌8, జూన్‌17న సమావేశమై నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేసింది. 2022జనవరి 17న సమావేశమైన మంత్రివర్గం రాష్ట్రంలోని పాఠశాలలను రూ.7289కోట్లతో అభివృద్ధి చేయాలని నిర్ణయిం చారు. మొదటి దశలో 9,149 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందుకోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు యేటా కేటాయించే సీడీఎఫ్‌ నిధుల నుంచి 40శాతం నిధులను, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నుంచి కొన్ని నిధులను, మండల, జిల్లా పరిషత్‌లకు విడుదలైన 15వ ఆర్ధికసంఘం నిధులను సమకూర్చారు. జిల్లాలో 360ప్రాథమిక, 83ప్రాథమికోన్నత, 105ఉన్నతపాఠశాలలు మొత్తం 548పాఠశాలలు ఉండగా, 191పాఠశాలను ఎంపిక చేశారు. ఇందులో 101ప్రాథమిక, 27ప్రాథమికోన్నత, 63ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిని అభివృద్ధి చేసేందుకు రూ.55కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు.

ఫ మారిన రూపు రేఖలు..

ప్రయివేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను మన ఊరు మన బడి కార్యక్రమంలో అభివృద్ధి చేయడంతో వాటి రూపురేఖలు మారాయి. శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల స్థానంలో కొత్త గదుల నిర్మాణం, మరమ్మతు పనులు, ప్రహారీలు, మరుగుదొడ్ల నిర్మాణం, ఉన్న వాటికి నీటి సౌకర్యం కల్పించడం, తాగునీటి సౌకర్యం కల్పించడం, కిచెన్‌ షెడ్లు, ఫర్నీచర్‌, విద్యుద్దీకరణ, పాఠశాలకు తెలుపు, నీలం రంగులు వేయడం, డైనింగ్‌ హాళ్ల నిర్మాణాలు, డిజిటల్‌ తరగతుల విద్యాబో ధనకు కావాల్సిన సౌకర్యాలు, గ్రీన్‌చాక్‌ బోర్డుల ఏర్పాటు పనులు పూర్తి చేశారు. ఈ పనులన్నింటినీ స్కూల్‌ మేనేజ్మెంట్‌ కమిటీ గానీ, వాళ్లు నిర్ణయించిన వారికి పనులను అప్పగించారు. జిల్లాలో ఎక్కువగా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఉప సర్పంచులు పనులు చేశారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు బిల్లుల చెల్లింపు బాగానే జరిగాయి. నిధుల కొరత వల్ల అప్పటి ప్రభుత్వం రెండో విడత కింద కొత్త పాఠశాలలను ఎంపిక చేయలేదు. 2023 చివరలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. అప్పటి వరకు ఉన్న నిధులను వెచ్చించారు. కానీ పెండింగు బిల్లులను చెల్లించలేదు.

ఫ బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ..

పనులు చేసిన మాజీ ప్రతిప్రతినిధులు, ఎస్‌ఎంసీ బాధ్యులు బిల్లుల కోసం పంచాయతీరాజ్‌, రోడ్లు భవనాల శాఖ, జిల్లా విద్యాశాఖ కార్యాలయం చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నారు. కొన్ని పాఠశాలల్లో మొత్తం పనులు పూర్తి కాగా, మరికొన్ని పాఠశాలల్లో అర్ధాంతరంగా వదిలిపెట్టారు. ఆ పనులను అమ్మ ఆదర్శ కమిటీలకు ప్రస్తుతం ప్రభుత్వం కేటాయించిన నిధులతో చేశారు. పనులు పూర్తిచేసిన వాళ్లు మాత్రం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి పెండింగులో ఉన్న బిల్లులను ఇప్పించాలని కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. జిల్లాలో 6కోట్ల రూపాయల వరకు మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా చేసిన పనులకు చెల్లించాల్సి ఉందని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగు బిల్లులను విడుదల చేయాలని, లేకుంటే తమకు చావే శరణ్యం అని మాజీ ప్రతినిధులు, ఎన్‌ఎంసీ బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు.

Updated Date - Dec 25 , 2025 | 01:01 AM