Share News

ప్రతీ రైతుకు యూనీ కోడ్‌ కార్డు

ABN , Publish Date - May 06 , 2025 | 01:42 AM

కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్‌ కార్డు జారీ చేసిన తరహాలోనే ప్రతి రైతుకు ‘‘రైతు విశిష్ట సంఖ్య’’ ఫార్మర్‌ యూనీ కోడ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రతీ రైతుకు యూనీ కోడ్‌ కార్డు

- కేంద్ర వ్యవసాయ పథకాల కోసం ఫార్మర్‌ రిజిస్ర్టీ

- కేంద్ర ప్రభుత్వ పథకాలతో అనుసంధానం

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేంద్ర ప్రభుత్వం దేశంలో ప్రతి పౌరుడికి ఆధార్‌ కార్డు జారీ చేసిన తరహాలోనే ప్రతి రైతుకు ‘‘రైతు విశిష్ట సంఖ్య’’ ఫార్మర్‌ యూనీ కోడ్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు ఈ నెల 5 నుంచి ఫార్మర్‌ రిజిస్ర్టీ కార్యక్రమాన్ని చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఈ ఫార్మర్‌ రిజిస్ర్టేషన్‌ను అనుసంధానం చేస్తారు. పీఎం కిసాన్‌, తదితర వ్యవసాయాధారిత కేంద్ర పథకాల వర్తింపులో ఈ కార్డు కీలకపాత్ర వహించనున్నది. మే 5 నుంచి జూన్‌ 6 వరకు రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఫార్మర్‌ రిజిస్ర్టీ కార్యక్రమం అమలుకు వ్యవసాయ విస్తరణ అధికారులు నిర్ణీత షెడ్యూల్‌ మేరకు ఆయా గ్రామాల్లో పర్యటించి రైతుల పేర్లను నమోదు చేసుకుంటారు. ఏఈవోలు గ్రామానికి వచ్చినప్పుడు గాని, మీసేవ ద్వారాగాని వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయి రైతు తన ఆధార్‌ నంబర్‌ను పట్టాదారు పాస్‌పుస్తకం లేదా 1బిని ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. భూమి ఉన్న ప్రతి రైతు తన భూముల వివరాలను ఈ ఫార్మర్‌ రిజిస్ర్టీలో పొందుపర్చుకుని తన యాజమాన్య వివరాలను ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని ఆధారంగా రైతు విశిష్ట సంఖ్య(ఫార్మర్‌ ఐడీ)ని ఇస్తుంది. 11 నెంబర్లతో కూడిన ఈ రైతు గుర్తింపు కార్డు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఉపయోగపడుతుంది.

రైతు భరోసా, రుణమాఫీతో సంబంధం లేదు

రాష్ట్ర రెవెన్యూశాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను మాత్రమే ప్రామాణికంగా తీసుకుని దీనిని జారీ చేస్తారు. ఏ రకమైన యాజమాన్య హక్కును కొత్తగా కల్పించరు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రైతు భరోసా, రుణమాఫీ తదితర పథకాలకు ఈ రైతు రిజిస్ర్టీ కార్యక్రమానికి ఏరకమైన సంబంధం లేదు.

ఇలా నమోదు చేసుకోవాలి

మీసేవ కేంద్రాలకు వెళ్లి వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయిన తర్వాత రైతు తన ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి. ఆధార్‌కు లింకు చేసిన మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌ చేసిన తర్వాత రైతు మొబైల్‌ నంబర్‌ను ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. మరోసారి ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే రైతు వివరాలు ఆన్‌లైన్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఆ సర్వే నెంబర్లను సెలక్ట్‌చేసి సబ్మిట్‌ చేస్తే మరోసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేసిన తర్వాత రైతుకు 11 సంఖ్యల ఫార్మర్‌ రిజిస్ర్టీ నంబర్‌ జనరేట్‌ అవుతుంది. ఈ నంబర్‌ రైతు మొబైల్‌కు వస్తుంది. దీంతో ఫార్మర్‌ రిజిస్ర్టీ ప్రక్రియ పూర్తవుతుంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. రైతులందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయశాఖ కోరింది.

Updated Date - May 06 , 2025 | 01:42 AM