తొమ్మిది రోజుల్లో ఒకే దరఖాస్తు
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:36 PM
మద్యంషాపుల లైసెన్స్‌లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో 94 వైన్‌షాపుల నిర్వహణ కోసం సెప్టెంబరు 26న కరీంనగర్ ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తొమ్మిది రోజులు గడిచినా ఒకే దరఖాస్తు శనివారం అందింది.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): మద్యంషాపుల లైసెన్స్‌లకు వ్యాపారుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో 94 వైన్‌షాపుల నిర్వహణ కోసం సెప్టెంబరు 26న కరీంనగర్ ఎక్సైజ్‌శాఖ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తొమ్మిది రోజులు గడిచినా ఒకే దరఖాస్తు శనివారం అందింది. ఇల్లందకుంటలో గెజిట్ నంబరు 93కు ముష్యం కాశీనాథం అనే వ్యక్తి లైసెన్స్ కోసం 3 లక్షల రూపాయలు చలాన్‌తో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 18న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉండడంతో మద్యం వ్యాపారులు వేచిచూసే దోరణిని అవలంబిస్తున్నారు. దీంతో దరఖాస్తులు రావడంలేదని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఫ వేచి చూసే ధోరణిలో..
స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఈ నెల 9న కోర్టు తీర్పు ఉండటంతో ఎన్నికలు ఇప్పుడు జరుగుతాయా?లేదా? అనే సందేహంలో పడ్డారు. ప్రస్తుత మద్యం షాపులు నిర్వాహకులకు నవంబరు 30 వరకు గడువు ఉంది. డిసెంబరు 1 నుంచి కొత్తవారికి లైసెన్స్‌లు జారీ చేసేందుకే ఎక్సైజ్‌శాఖ ముందస్తుగా నోటిఫికేషన్ జారీ చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే డిసెంబరు 1లోగా స్థానిక ఎన్నికలు పూర్తి అయితే కొత్త లైసెన్సీలకు(2025-27) స్థానిక ఎన్నికల్లో మద్యం అమ్మకాలు ఉండవని, వ్యాపారం అనుకున్నంతగా సాగుతుందా అనే ఆలోచనతో కొందరు వ్యాపారులు దరఖాస్తులు సమర్పించేందుకు సంశయిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మద్యం వ్యాపారంలో ఉన్న పలువురు లైసెన్స్‌ల కోసం చలాన్‌లు లేదా డీడీలు చెల్లించి దరఖాస్తులు సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. కోర్టు తీర్పును అనుసరించి దరఖాస్తు చేసుకునేందుకు వ్యాపారులు మొగ్గుచూపుతున్నారు. మద్యం షాపుల లైసెన్స్‌ల కోసం దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఎక్సైజ్‌శాఖ అవకాశం కల్పించింది.
ఫ జిల్లాలో 94 వైన్స్
జిల్లాలో కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, హుజురాబాద్, తిమ్మాపూర్, జమ్మికుంట ఎక్సైజ్ సర్కిళ్ళ పరిధిలో 94 వైన్స్ ఉన్నాయి. ఇందులో 50 లక్షల ఎక్సైజ్ టాక్స్ పరిధిలో 11, 55 లక్షల ఎక్సైజ్ టాక్స్ పరిధిలో ఉన్న 40, 65 లక్షల ఎక్సైజ్ టాక్స్ పరిధిలో ఉన్న 43, మొత్తం 94 వైన్స్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది. 2023లో రెండు సంవత్సరాల కాలపరిమితితో మద్యం షాపుల లైసెన్స్ కోసం రెండు లక్షల రూపాయల దరఖాస్తుఫీజును విధించారు. ప్రస్తుతం 2025-27 ఎక్సైజ్ సంవత్సరంలో వైన్‌షాపుల లైసెన్స్ కోసం దరఖాస్తుఫీజును మూడు లక్షల రూపాయలకు పెంచారు. ఈ మూడు లక్షల రూపాయలు లైసెన్స్ పొందినా, పొందకపోయిన తిరిగి చెల్లించరు. దరఖాస్తులు నెమ్మదించడానికి ఇది కూడా ఒక కారణం కావచ్చు.
ఫ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు
కొత్త వైన్స్ లైసెన్స్ 2025 డిసెంబరు 1 నుంచి 2027 నవంబరు 30 వరకు ఉంటుంది. జిల్లాలోని ఐదు ఎక్సైజ్ సర్కిళ్లలోని 94 వైన్‌షాపులకు దరఖాస్తులను కరీంనగర్ గోదాంగడ్డ ప్రాంతంలోని కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో ఐదు ప్రత్యేక కౌంటర్ల ద్వారా స్వీకరిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలోనూ దరఖాస్తులు సమర్పించేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అక్టోబరు 23న కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో ఉదయం 11 గంటలకు లాటరీ ద్వారా లైసెన్స్‌దారులను ఎంపికచేస్తారు.
ఫ జిల్లాలో ఉన్న 94 వైన్స్‌లో కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21, కరీంనగర్ రూరల్‌లో 26, తిమ్మాపూర్‌లో 14, హుజూరాబాద్‌లో 17, జమ్మికుంటలో 16 వైన్స్ ఉన్నాయి. 94 షాపులలో గౌడ కులస్థులకు 17, ఎస్సీలకు తొమ్మిది వైన్స్ రిజర్వు అయ్యాయి.