Share News

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ప్రణాళిక రూపొందించాలి

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:20 AM

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి 2026-27 బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేయాలని, గల్ఫ్‌ కార్మికుల సమస్యలను తెలుసుకుని వారికి మనోదైర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి ప్రణాళిక రూపొందించాలి
అసెంబ్లీలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

- ప్రవాసి తెలంగాణ దివస్‌ పేరుతో కార్మికులకు మనోధైౖర్యం కల్పించాలి

- శాసనసభలో గళమెత్తిన ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

వేములవాడ, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్‌ కార్మికుల సంక్షేమానికి 2026-27 బడ్జెట్‌లో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి నిధులు మంజూరు చేయాలని, గల్ఫ్‌ కార్మికుల సమస్యలను తెలుసుకుని వారికి మనోదైర్యం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన శాసన సభ సమావేశంలో గల్ఫ్‌ కార్మికుల సంక్షేమంపై మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వ ఇప్పటికే గల్ప్‌ కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేసిందన్నారు. గల్ఫ్‌ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తోందని గుర్తు చేశారు. సీఎం ప్రవాసి ప్రజావాణి ఫిర్యాదు కేంద్రంలో గల్ఫ్‌ కార్మికుల కోసం ప్రత్యేక హెల్ఫ్‌లైన్‌ ఏర్పాటు చేస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు. కార్మికుల పిల్లల విద్యకు పెద్దపీట వేయాలన్నారు. సుమారు రూ. 10 లక్షల మంది కార్మికుల పిల్లలు ఉన్న నేపథ్యంలో రానున్న విద్యా సంవత్సరానికి గురుకులాల్లో ప్రత్యేకంగా సీట్లు కెటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ప్రవాసి భారతీయ దివస్‌ తరహాలో రాష్ట్రస్థాయిలో ప్రవాసి తెలంగాణ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. కార్మికులను సత్కరించి, వారి సమస్యలు వినడంతో మనోధైౖర్యం కల్పించవచ్చని, టీఓఎమ్‌సీఓఎమ్‌, న్యాక్‌ సంస్థలనుమరింత బలోపేతంగా చేయాల్సిన అవసరం ఉందని సభ దృష్టికి తీసుకువెళ్లారు. గల్ఫ్‌ వలస తాత్కాలికమైనదని పేర్కొంటూ, గల్ఫ్‌ ఎన్‌ఆర్‌ఐల కుటుంబాలకు సంబంధించిన రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులను సులభతరం చేసి, ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. గల్ఫ్‌ కార్మికులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారారని, వారి సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని ప్రజాహిత నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రతీనెలా సుమారు 100 ప్రసవాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం ఉన్న మాతశిశు సంరక్షణను 50 పడకలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ కోరారు.

Updated Date - Dec 30 , 2025 | 12:20 AM