Share News

విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం..

ABN , Publish Date - Sep 28 , 2025 | 01:23 AM

విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి శ్రీకారం..

తంగళ్లపల్లి, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యా వ్యవస్థలో నూతన ఒరవడికి ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టారని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని ప్రభుత్వ ఐటీఐ సెంటర్‌ను అధునాతన సాంకేతిక కేంద్రంగా(ఏటీసీ) అప్‌గ్రేడ్‌ చేయగా, వర్చువల్‌ విధానంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఆరు కోర్సులతో ఏర్పాటు చేసిన ఏటీసీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్యఅథితిగా హాజరయ్యారు. ముందుగా ఏటీసీలో ఏర్పాటుచేసిన పరికరాలు, యంత్రాలు, వాటి పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలో విద్య, వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేస్తూ అన్ని వర్గాలకు ప్రజాప్రభుత్వం అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. సీఏం రేవంత్‌రెడ్డి విద్యాశాఖ బాధ్యతలు చూస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారని వివరించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా యువత, విద్యార్థులకు ఉపాధి కల్పించడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. దీంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ 2324 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 65 ఏటీసీ కేంద్రాలను ముఖ్యమంత్రి ప్రారంభించినట్లు వెల్లడించారు. రుద్రంగిలో రూ.43 కోట్లతో ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఏటీసీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏటీసీల్లో నైపుణ్య శిక్షణ పొందిన యువతకు కనీసం రూ.20వేల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు అందించేందుకు టాటా సంస్థ సహకారంతో వివిధ కోర్సులు ఏటీసీలో విద్యార్థులకు నేర్పిస్తున్నామని వివరించారు. జిల్లాలోని ఏటీసీల్లో 172మంది విద్యార్ధులు శిక్షణ పొందుతున్నారని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఇంజనీరింగ్‌, ఎంబిఏ వంటి కోర్సులనే కాకుండా మంచి ఉపాధి అవకాశాలు సత్వరం లభించే ఏటీసీ కోర్సుల వైపు ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ వేముల స్వరూప తిరుపతిరెడ్డి, రొండి రాజు, అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్‌, ప్రిన్సిపాల్‌ కవిత, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నేరెళ్ల నర్సింగంగౌడ్‌, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు జల్గం ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 01:23 AM