Share News

సంక్షేమ పథకాల అమలులో ఆదర్శం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:16 AM

జగిత్యాల క్రైం, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని బీసీ కమిషన్‌ చైర్మన్‌ ఎగురవేశారు.

సంక్షేమ పథకాల అమలులో ఆదర్శం

-అభివృద్ధిలో అగ్రగామిగా జిల్లా

-బీసీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ నిరంజన్‌

-ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

జగిత్యాల క్రైం, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని బీసీ కమిషన్‌ రాష్ట్ర చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌లో బుధవారం తెలంగాణ ప్రజాపాలన వేడుకల్లో భాగంగా జాతీయ పతాకాన్ని బీసీ కమిషన్‌ చైర్మన్‌ ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ప్రజలకు, అధికారులకు, నాయకులకు ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1948 సెప్టెంబరు 17న తెలంగాణ నిజాం చెర నుంచి విముక్తి పొంది భారత దేశంలో విలీనమైన రోజును తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహించుకుంటు న్నామన్నారు.

ఫగృహజ్యోతితో 2,07,474 మందికి లబ్ధి

జిల్లాలో మహాలక్ష్మి పథకంతో ఇప్పటి వరకు 5.41 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని వినియోగించుకోవడంతో వారికి రూ.279.93 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2,89,725 గ్యాస్‌ సిలిండర్లను రూ.500లకే సరఫరా చేయడంతో వినియోగదారులకు రూ.23.74 కోట్ల సబ్సీడీని రాష్ట్ర ప్రభుత్వమే భరించిందన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్‌ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. 2024 మార్చి నుంచి 2025 ఆగస్టు వరకు జిల్లాలో 2,07,474 ఇళ్లలో ఉన్న విద్యుత్‌ మీటర్‌ సర్వీసులకు గాను రూ.125.62 కోట్లను సంబంధిత శాఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందన్నారు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం ద్వారా వానాకాలం సీజన్‌ ప్రారంభంలోనే 2,25,406 మంది రైతులకు రూ.243.32 కోట్లను రైతుల ఖాతాలో జమ చేసి అండగా నిలిచిన గొప్ప ప్రభుత్వం కాంగ్రెస్‌ ప్రభుత్వమన్నారు. రూ.2లక్షల వరకు రైతు రుణ మాఫీ పథకం కింద 80,515 మంది రైతులకు రూ.721.74 కోట్ల రుణ మాఫీ చేయడం జరిగిందన్నారు. రైతు బీమా ద్వారా జిల్లాలో వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాలకు రూ. 248.80 కోట్ల భీమా సొమ్మును అందజేసి ఆర్థిక చేయూత కల్పించామన్నారు. రాజీవ్‌ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో 2024-25లో 19,661 మందికి రూ.46.21 కోట్ల విలువ చేసే శస్త్ర చికిత్సలు ఉచితంగా చేయించామన్నారు.

ఫ10,775 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

నిరు పేదల స్వంత ఇంటి కల నెరవేర్చేందుకు జిల్లాలో 10,775 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామన్నారు. భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా ప్రజల భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ధరణి స్థానంలో భూ భారతి చట్టం అమలు చేసి 25,672 మంది రైతుల వద్ద దరఖాస్తులు స్వీకరించడంతో పాటు పరిష్కార పక్రియను వేగవంతంగా అమలు చేస్తున్నా మన్నారు. యాసంగి సీజన్‌లో జిల్లాలో 428 కొనుగోలు కేంద్రాల్లో 86,979 మంది రైతుల ద్వారా 4,63,308 మెట్రిక్‌ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ. 1,075 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేశామన్నారు. 30,626 మెట్రిక్‌ టన్నుల సన్న రకం ధానాన్ని 940 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి 11 కోట్ల రుపాయలతో పాటు క్వింటాలుకు రూ. 500 చొప్పున బోనస్‌ ఇచ్చామన్నారు.

ఫ38,619 నూతన రేషన్‌ కార్డులు జారీ

జిల్లాలో ఇప్పటి వరకు 38,619 మందికి నూతన రేషన్‌ కార్డులను జారీ చేయడంతో పాటు 75,052 మంది కుటుంబ సభ్యుల పేర్లను కొత్తగా నమోదు చేసి 3,45,710 కుటుంబాలకు ప్రతి నెల 6,356 టన్నుల సన్న బియ్యాని పంపిణీ చేస్తున్నామని వివరించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం కింద జిల్లాలో 1,67,154 మందికి జాబ్‌ కార్డులు జారీ చేసి 11.12 లక్షల పని రోజులు కల్పించి ఉపాధి చూపించామన్నారు. ఇందిరా మహిళా శక్తి ద్వారా 461 యూనిట్లకు గాను రూ.10.21 కోట్లు మంజూరు చేయడంతో పాటు 53 మహిళా గ్రూపులకు 9.14 కోట్లు కేటాయించడంతో పాటు 330 స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది రూ. 45.54 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలను మంజూరు చేయడం జరిగిందన్నారు. షెడ్యూల్‌ కులాలు, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ శాఖల ద్వారా విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో వసతి గృహాలు నిర్వహిస్తూ, ఉపకార వేతనాలు అందించడంతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యపించాలనే పేద విద్యార్థుల కలను సాకారం చేసేందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా అభివృధ్దికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, ఎస్పీ అశోక్‌ కుమార్‌, అదనపు కలెక్టర్లు లత, రాజా గౌడ్‌, మాజీ మంత్రి జీవన్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:16 AM