రసవత్తరంగా ‘పంచాయతీ’ పోరు
ABN , Publish Date - Dec 06 , 2025 | 01:25 AM
‘పంచాయతీ’ ఎన్నికలతో గ్రామాల్లో రసవత్తర పోరు నెలకొంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సర్పంచు, వార్డు పదవుల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నామినేషన్ల చివరిరోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులు తీరారు.
- ముగిసిన నామినేషన్ల ప్రక్రియ
- ఉప సర్పంచ్ పదవులపై నేతల ఫోకస్
- ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో భారీగా డిమాండ్
- మహిళా రిజర్వుడ్ స్థానాల్లో తీవ్ర పోటీ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
‘పంచాయతీ’ ఎన్నికలతో గ్రామాల్లో రసవత్తర పోరు నెలకొంది. మూడో విడతలో ఎన్నికలు జరిగే పంచాయతీల్లో సర్పంచు, వార్డు పదవుల కోసం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారం ముగిసింది. నామినేషన్ల చివరిరోజు కావడంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవుల కోసం అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు బారులు తీరారు. సాయంత్రం 5 గంటల తర్వాత క్లస్టర్లలో ఉన్న వారందరికి టోకెన్లు జారీ చేసి నామినేషన్లను స్వీకరిస్తున్నారు. మొదటి, రెండో విడతలో ఎన్నికలు జరిగే గ్రామపంచాయతీల్లో ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడంతో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు ప్రచారంతోపాటు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
- రిజర్వుడ్ స్థానాలపై దృష్టి..
సర్పంచ్ స్థానాలు ఎస్సీ, ఎస్టీ, మహిళలకు రిజర్వుడ్ అయిన గ్రామాల్లో ఉపసర్పంచు పదవులపైనా నేతలంతా ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. గతంలో పోటీ చేసి గెలుపొందిన మాజీ సర్పంచులు, ఓటమి పాలైన అభ్యర్థులు తిరిగి సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు రెండేళ్లపాటు నిరీక్షింయాకె. కొంత మందికి రిజర్వేషన్లు అనుకూలించగా మరికొంత మందికి పోటీచేసే అవకాశం లేకుండా పోయింది. అలాంటి నాయకులు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, వాటికి కూడా రిజర్వేషన్లు అనుకూలిస్తాయో లేదో తెలియక కొందరు వార్డుసభ్యులుగా పోటీ చేసి ఉపసర్పంచు పదవులను దక్కించుకునేందుకు నామినేషన్లు వేసి ఎన్నికల బరిలో నిలిచారు. మరికొంత మంది వారి అనుచరులు, మద్దతుదారులను పోటీలో నిలిపి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వరకు వేచి చూసే ధోరణితో పంచాయతీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇంకొందరు రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్న వారి కుటుంబసభ్యులు, బంధుమిత్రులను పోటీలో నిలిపి సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులతో గ్రామాల్లో రాజకీయపట్టు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. చాలా గ్రామాల్లో రిజర్వేషన్లతో సర్పంచ్‌గా పోటీకి అవకాశం లేనివారంతా ఉప సర్పంచ్ పదవులపై కన్నేశాయి.
- జిల్లాలో 316 పంచాయతీల్లో ఎన్నికలు..
జిల్లాలో 318 గ్రామపంచాయతీలు ఉండగా రెండు గ్రామాలపై కోర్టుకేసులు ఉండడంతో ప్రస్తుతం 316 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు 71, బీసీలకు 84, ఇతరులకు 162 స్థానాలు రిజర్వు అయ్యాయి. 146 పంచాయతీల సర్పంచ్ పదవులు మహిళలకు కేటాయించారు. ఎస్టీకి ఒక సర్పంచ్ స్థానం రిజర్వు కాగా అక్కడ ఉపసర్పంచ్ పదవిపై జనరల్, బీసీ అభ్యర్థులు పోటీకి సిద్ధమవుతున్నారు. బీసీలకు కేటాయించిన 84 సర్పంచు స్థానాల్లో 39 మహిళలకు రిజర్వ్ అయ్యాయి. అక్కడ కూడా ఉప సర్పంచ్ పదవి కీలకంగా మారింది. మొదటి విడతలో ఈనెల 11న సర్పంచ్, వార్డులకు ఎన్నికలను నిర్వహించి అదే రోజు ఓట్లు లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. అనంతరం ఉప సర్పంచ్ ఎన్నికల నిర్వహిస్తారు. రెండో విడత 14న, మూడో విడత ఎన్నికలు 17న నిర్వహిస్తారు. అదే రోజు ఉపసర్పంచ్‌ల ఎన్నికల ఉంటుంది.
- ఊపందుకున్న ప్రచారాలు..
మొదటి, రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో సర్పంచ్, వార్డు సభ్యుల పదవికి పోటీచేస్తున్న అభ్యర్థులంతా ప్రచారాలపై దృష్టి సారిస్తున్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, చొప్పదండి, రామడుగు, గంగాధర మండలాల్లోని గ్రామాల్లో సర్పంచు, వార్డుసభ్యులకు గుర్తులు కేటాయించారు. అభ్యర్థులు కరపత్రాలు, బ్యాలెట్ నమూనాలు, వారికి కేటాయించిన గుర్తులను చేతబట్టుకొని ఇంటింటికి వెళ్లి ఓటర్ల మద్దతు కూడగట్టే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఆయా కుల సంఘాల పెద్దలను కలుసుకొని ఆశీర్వదించి మద్దతు ఇవ్వాలని, తమను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి పాటుపడతామంటూ హామీలు ఇస్తున్నారు. ఓటర్లను ప్రభావితం చేసే నాయకులకు మందు, విందులు కూడా ఏర్పాటు చేసి వారి మద్దతు కూడగడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లను ఫోన్లలో సంప్రదించి పోటీలో ఉన్నానని, తనకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. దీంతో మొదటి విడత ఎన్నికలు జరిగే 91 గ్రామాల్లో రాజకీయం రోజురోజుకు రసవత్తరంగా మారింది. రెండో విడత ఎన్నికలు జరిగే పంచాయతీల్లో ఆదివారం ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అభ్యర్థుల తుది జాబితాతోపాటు పోటీలో ఉన్న సర్పంచ్, వార్డుసభ్యులకు గుర్తులను కేటాయిస్తారు. దీనితో ఆయా గ్రామాల్లో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఉపసంహరణ కోసం బుజ్జగింపు, నజరానాలను ప్రకటిస్తూనే మరోవైపు ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓవైపు చలి తీవ్రత పెరుగుతుంటే పంచాయతీ పోరుతో గ్రామాల్లో రాజకీయం వేడెక్కుతోంది.