చెక్‌డ్యాం పేల్చివేతపై జ్యుడీషియల్ విచారణ జరపాలి
ABN , Publish Date - Nov 29 , 2025 | 12:29 AM
జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు
సుభాష్‌నగర్, నవంబరు 28 (ఆంఽధ్రజ్యోతి): జమ్మికుంట మండలం తనుగుల చెక్‌డ్యామ్‌ను పేల్చేసిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేసి బాధ్యులను శిక్షించాలని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలార్, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం గంగుల కమలాకర్ మీడియాతో మాట్లాడుతూ తనుగుల చెక్‌డ్యాం పేల్చివేత ఇసుక మాఫియా పనేనన్నారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికి ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదన్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు తెప్పించి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. వర్షాకాలం చెక్కు చెదరని చెక్‌డ్యాం ఇపుడు ఎలా దెబ్బతిన్నదని ప్రశ్నించారు. ఈ విషయమై శనివారం డీజీపీని కలుస్తామన్నారు. అక్కడికి జిలెటిన్ స్టిక్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ తనుగుల చెక్‌డ్యాంనుబాంబులు పెట్టి పేల్చేశారని ఇరిగేషన్ ఏఈ జమ్మికుంట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లాలోని హుస్సేన్‌మియా వాగుపై నిర్మించిన చెక్‌డ్యాంను పేల్చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అప్పడే నిందితులను అరెస్టు చేసిఉంటే తనుగులలో ఇలాంటి ఘటన జరగకపోయేదన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారవు అది నిజంగా పేల్చినట్లైతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారని తెలిపారు. రేవంత్‌రెడ్డినే ఏమిటని బారాబర్ మాట్లాడుతానని, విజయరమణారావుఎంత అన్ని అన్నారు. విజయరమణారావుకు దగ్గరి వారు తనకు ఫోన్లు చేస్తున్నారని, అలాంటి ఫోన్లకు తాను భయపడనని అన్నారు. ఓట్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చేశారని ఆరోపించారు. వాటిని కట్టింది రాఘవ కన్స్‌స్ట్రక్షన్ అని ఇది పొంగులేటి శ్రీనివాస్‌రెడ్దిదని, దానిని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కుమార్ ఈ ఘటనపై సీబీఐ విచారణ వేయించాలన్నారు. కాంగ్రెస్ నాయకుల ఫోన్లకు భయపడేది లేదని, తాను హుందాగా రాజకీయం చేస్తున్నానని, మీకు చేతనైతే హుందాగా రాజకీయం చేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్‌రావు, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్, జంగిలి సాగర్, మాజీ సర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, నాయకులు పాల్గొన్నారు.