ఆరోగ్య మహిళే లక్ష్యం
ABN , Publish Date - Sep 17 , 2025 | 01:18 AM
దేశ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ‘స్వస్త్ వారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం అమలు చేయనుంది.
జగిత్యాల, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): దేశ ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించిన కేంద్ర ప్రభుత్వం నేషనల్ హెల్త్ మిషన్‌లో భాగంగా మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈనెల 17వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా ‘స్వస్త్ వారి సశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమం అమలు చేయనుంది. ఇటీవల హైదరాబాద్ నుంచి సంబంధిత ఉన్నతాధికారులు అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కార్యక్రమ విజయవంతానికి దిశా నిర్ధేశం చేశారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా, మండల, గ్రామీణ స్థాయి వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పూర్తి చేశారు.
ఫశిబిరాల నిర్వహణ ఇలా...
జిల్లాలో 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లలో 69 మంది ప్రత్యేక వైద్య నిపుణులను అందుబాటులో ఉంచుతున్నారు. 13 పని దినాల్లో ఒక్కో రోజు నాలుగు వైద్య శిబిరాలను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 52 వైద్య శిబిరాలను నిర్వహించనున్నారు. 3 లక్షల మంది మహిళలకు ప్రయోజనం కలిగేలా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో రోజు ఒక్కో ప్రదేశంలో ఒక్కో స్పెషలిస్టు ఉండేలా శిబిరాల షెడ్యూల్ రూపొందించారు. మొదట సీహెచ్‌సీ, పీహెచ్‌సీ తర్వాత ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాల్లో శిబిరాలు కొనసాగుతాయి. పీహెచ్‌సీలో స్పెషలిస్టు వైద్యుడు ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల ఆశా కార్యకర్తలు, ఎంఎల్‌హెచ్‌పీలు మహిళలను శిబిరాలకు తీసుకొచ్చి వైద్యసేవలు అందించేలా కార్యాచరణ రూపొందించారు.
ఫనిర్వహించే వైద్య పరీక్షలు...
జిల్లాలో నిర్వహించే వైద్య శిబిరాల్లో మహిళలకు పలు రకాల వైద్య పరీక్షలు చేయనున్నారు. ఇందులో ఈఎన్‌టీ, నేత్ర, రక్తపోటు, మధుమేహం, దంత పరీక్షలతో పాటు నోటి, రొమ్ము ఇతర కాన్సర్, రక్తహీనత, టెలిమానస్ సేవలు, గర్భిణులకు ఆరోగ్యం, సికిల్ సెల్ ఎనిమియా తదితర వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. మాతా శిశు సంరక్షణ (ఎంసీపీ) కార్డు, ప్రధానమంత్రి మాతృ వందన కార్యక్రమంలో పేర్లు నమోదు, సికిల్‌సెల్ కార్డు, పోషన్ ట్రాకర్‌లో లబ్ధిదారుల రిజిస్ట్రేషన్ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పోషకాహారం గురించి వివరించడం, టేక్ హోమ్ రేషన్ (టీహెచ్‌ఆర్) పంపిణీ, పది శాతం చక్కెర, వంట నూనెలు తగ్గించడం వల్ల ఊబకాయాన్ని తగ్గించడం, శిశు సంరక్షణ, బాలల ఆహార పద్ధతులు తదితర అంశాల గురించి అవగాహన కల్పిస్తారు. రక్తదాన శిబిరాలు, నిశ్చయ్ మిత్ర వలంటర్లీ రిజిస్ట్రేషన్, అవయవ దాతల రిజిస్ట్రేషన్ వంటివి నిర్వహించనున్నారు. మహిళలకు యోగా మెళకువలు, బలవర్థక ఆహారం తీసుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలు వివరించనున్నారు. మహిళల ఆరోగ్యంతోనే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు అంటున్నాయి.
పకడ్బందీగా నిర్వహిస్తాం...
-డాక్టర్ ప్రమోద్ కుమార్, డీఎంహెచ్‌వో
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వస్త్ నారి...సశక్త్ పరివార్ అభియాన్ బుధవారం నుంచి పక్కగా నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. జిల్లాలోని ప్రతి మహిళకు వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. జిల్లాలోని అన్ని ప్రాంతాల మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం
- డాక్టర్ నీలారపు శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో, జగిత్యాల
మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా వైద్య శిబిరాలు చేపడుతున్నాం. మహిళలకు ఆరోగ్యంపై అవగాహనతో పాటు చైతన్యం కల్పించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కృషి చేస్తోంది. జిల్లాలో 13 రోజుల పాటు నిర్వహించనున్న ప్రత్యేక వైద్య శిబిరాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి.
------------------------------------------------------------------------------------------------------
జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు
------------------------------------------------------------------------------------------------------
జనరల్ ఆసుపత్రి.....1
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు..17
24 గంటలు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు...7
పల్లె దవాఖానాలు...102
బస్తీ దవాఖానాలు....9
అర్బన్ హెల్త్ సెంటర్లు...5
కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు...3
ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాలు...151