వైభవంగా లక్ష్మీనరసింహస్వామి కల్యాణం
ABN , Publish Date - May 12 , 2025 | 12:16 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయం నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ భూనిలా సహిత లక్షీనరసింహస్వామి వారి కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది.
- పట్టువస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
- ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
వేములవాడ రూరల్, మే 11 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయం నాంపల్లి గుట్టపై వెలసిన శ్రీ భూనిలా సహిత లక్షీనరసింహస్వామి వారి కల్యాణం ఆదివారం వైభవంగా జరిగింది. ఉదయం ఆలయంలో స్వామి వారికి అభిషేకం, హోమం, బలిహరణం నిర్వహించారు. కొండపైనున్న ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవమూర్తులను పూలతో అందంగా అలంకరించిన కల్యాణ వేదిక వద్దకు డప్పుచప్పుల్లు, కళాకారుల నృత్యాల మధ్య ఊరేగింపుగా తీసుకువచ్చారు. ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ , రాజన్న ఆలయ ఈవో కె వినోద్‌రెడ్డి స్వామివారికి పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఆలయ అర్చకులు రాచకొండ రామాచారిసంధ్యారాణి దంపతులు కన్యాదాతలుగా వ్యవహించగా, అర్చకులు రాచకొండ విజయేంద్రచారి, రామకృష్ణాచారి, హర్షవర్దనచారి ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణతోపాటు అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం ప్రతీఒక్కరి భాద్యత అన్నారు. స్వామివారి కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. స్వామివారి కల్యాణోత్సవం సందర్భంగా కరీంనగర్ సజ్జప్ప కళాక్షేత్రం, సజ్జప్ప కూచిపూడి డ్యాన్స్, మ్యూజిక్ అకాడమీ వారి కళాప్రదర్శనలు అందరిని అలరించాయి. కళాకారులను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సన్మానించారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి వరంగల్‌కు చెందిన తోపుచెర్ల శ్రీనాథ్‌స్వాతి దాతలుగా వ్యవహరించగా. ముస్తాబాద్‌కు చెందిన రాసమడుగు నర్సింగారావు భక్తులకు తాగునీరు అందించారు. కల్యాణం సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఏఈవోలు శ్రీనివాస్, అశోక్, ఈఈ రాజేశ్, డిఈ మహిపాల్ రెడ్డి, సూపరిండెంట్లు వెంకటరాజు, పూజిత, ఆలయ ఇన్‌చార్జి నరేందర్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.