Share News

పంచాయతీలకు నజరానా..

ABN , Publish Date - Nov 23 , 2025 | 12:46 AM

పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానున్నది.

పంచాయతీలకు నజరానా..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికలకు త్వరలోనే నోటిఫికేషన్‌ రానున్నది. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు మొదలైంది. పాత పద్ధతిలో 50 శాతం కోటా మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడమే కాకుండా ఆదివారం సవరణతో కూడిన తుది ఓటర్‌ జాబితా వెల్లడి కానున్నది. పంచాయతీ ఎన్నికలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పల్లెల్లో ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన ఆశావహుల హడావుడి జోరందుకుంది. ప్రభుత్వం డిసెంబరులో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తిచేసే విధంగా చురుకుగా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రాజకీయ పార్టీలు కూడా స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టడంతో పల్లెల్లో రాజకీయ సందడి మొదలైంది. పంచాయతీ ఎన్నికల్లో పదవులు కైవసం చేసుకోవాలని ఆశతో ఉంటే గ్రామాల్లో మంత్రి తుమ్మల మాటలతో మరోసారి ఏకగ్రీవ పంచాయతీల చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం తరహాలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకగ్రీవ ఆశలు ముందుకు తీసుకొచ్చింది. వ్యవసాయ, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిషత్‌, పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా పల్లెలు సజావుగా అభివృద్ధి చెందుతాయని, ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభుత్వం రూ 10 లక్షలు ప్రోత్సాహం ఇస్తుందని వెల్లడించారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పల్లెల్లో ఏకగ్రీవాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. గత ప్రభుత్వ హయాంలో 2019 ఎన్నికల్లో ఏకగ్రీవ పంచాయతీలకు రూ 10 లక్షలు ప్రోత్సాహం ఇస్తామని మంత్రులు ప్రకటించారు. పదవీ కాలం ముగిసినా రూ 10 లక్షల ప్రోత్సాహం మాత్రం రాలేదు. సర్పంచ్‌, పాలకవర్గం ఏకగ్రీవ నిధులు, ప్రభుత్వం అందించే నిధులతో బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు ఉండవని భావించి అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసిన వారికి నిరాశే మిగిలింది. బిల్లులు రాక, కనీసం అందిస్తామన్న ప్రోత్సాహం నిధులు లేక అప్పుల పాలయ్యారు.

జిల్లాలో 2019 ఎన్నికల్లో 41 పంచాయతీలు ఏకగ్రీవం..

గ్రామాభివృద్ధికి నిదులు ఉపయోగపడుతాయని ఊరంతా ఒక్కటై గ్రామపంచాయతీ పాలకవర్గాలను ఏకగ్రీవం చేసుకున్నారు. 2019 గ్రామపంచాయతీల పాలకవర్గాల గడువు ముగిసిపోయిన నిధులు మాత్రం విడుదల కాలేదు. జిల్లాలో ఎకగ్రీవమైన గ్రామ పంచాయతీలు 41 ఉండగా వీటికి ప్రొత్సాహం కింద రూ.4.10 కోట్లు రావాల్సి ఉంది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రొత్సాహం కింద ప్రభుత్వం రూ.7 లక్షలు అందజేస్తే దీనిని తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రభుత్వం నిదులు విడుదల చేస్తుందని ఆశగా ఎదురు చూశారు. నిధులు విడుదల కాకపోగా ప్రభుత్వం మారడంతో నిధులు ఊసేలేకుండా పోయింది. మరోవైపు గ్రామపంచాయతీల్లో చేసిన పనులకు బిల్లులు రాక ఒకవైపు సొంతంగా డబ్బులు ఖర్చుచేసి అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్‌లు ఏకగ్రీవ నజరానా వచ్చినా ఉపశమనం లభిస్తుందని భావించి నిధులు రాకపోవడంపై పలెల్లో తీవ్ర అసంతృపి వ్యక్తమయింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలు జరగగా ఫిబ్రవరి 2న పాలకవర్గాలు ప్రమాణ స్వీకారం చేశాయి. ఏకగ్రీవ పంచాయతీలకు రూ.10లక్షలు మాత్రం అందకుండానే పాలకవర్గాలు ముగిసి 20నెలలు గడిచిపొయింది. ఆర్థిక సంఘం నిధులతోనే పంచాయతీ పాలకవర్గాలు అభివృద్ధి పనులను నెట్టుకువచ్చారు. ఆర్థిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు చేరుతున్నా వాటిని ఖర్చు పెట్టుకోవడానికి నిబంధనలు ఉన్నాయి. కనీసం ప్రొత్సాహక నిధులైనా వస్తే ప్రజలకు అవసరమైన పనులు చేయవచ్చని పాలకవర్గాలు భావించినా నిధులు మాత్రం రాలేదు.

ఏకగ్రీవ పంచాయతీలు ఇవే..

జిల్లాలో 2019లో 255 గ్రామ పంచాయతీలు ఉండగా, 253 గ్రామ పంచాయతీలకు మూడు విడతలుగా నిర్వహించిన ఎన్నికల్లో 41 గ్రామపంచాయతీలు ఎకగ్రీవం అయ్యాయి. ఏకగ్రీవ పంచాయతీల్లో బోయినపల్లి మండలంలో కోరెం, చందుర్తి మండలంలో దేవునితండా, కట్టలింగంపేట, కొత్తపేట, ఇల్లంతకుంట మండలంలో చిక్కుడువానిపల్లె, గుండెపల్లి, కిష్టారావుపల్లి, పెద్దలింగాపూర్‌, రామోజీపేట, సోమారంపేట, గంభీరావుపేట మండలంలో లక్ష్మీపూర్‌, రాజుపేట, పొన్నాలపల్లి, కోనరావుపేట మండలంలో అజ్మీర తండా, గోవిందరావుపేట తండా, జై సేవాలాల్‌ భూక్య తండా, జై సేవాలాల్‌ ఊరు తండా, కమ్మరిపేట తండా, ముస్తాబాద్‌ మండలంలో గన్నవానిపల్లె, రుద్రంగి మండలంలో అడ్డబోరు తండా, బడి తండా, చింతమాని తండా, డేగావత్‌ తండా, రూపులానాయక్‌ తండా, సర్పంచ్‌ తండా, వీరుని తండా, తంగళ్లపల్లి మండలంలో చింతల్‌ఠాణా, నర్సింహూలపల్లె, వీర్నపల్లి మండలంలో మద్దిమల్ల తండా బాబాయి చెరువు తండా, భూక్య తండా, లాల్‌ సింగ్‌ తండా, శాంతినగర్‌, ఎర్రగడ్డతండా, వేములవాడ రూరల్‌ మండలంలో తుర్కాశినగర్‌, ఎల్లారెడ్డిపేట మండలంలో బుగ్గ రాజేశ్వర్‌ తండా, గుంటపల్లి చెరువు తండా, దేవుని గుట్ట తండా, అగ్రహారం, హరిదాస్‌నగర్‌, గ్రామ పంచాయతీలు పూర్తి పాలకవర్గంతో సహా ఏకగ్రీవమై ప్రొత్సాహానికి అర్హతగా నిలిచాయి. ఏకగ్రీవ గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు మంత్రి కేటీఆర్‌ తన నియోజకవర్గ నిధుల నుంచి రూ 15 లక్షలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కేటీఆర్‌ పంచాయతీలకు వివిధ రకాలుగా నిదులు సమకూర్చారు. కానీ ప్రోత్సాహక నిధులు మాత్రం రాలేదు. మరోసారి ఏకగ్రీవ పంచాయతీల ప్రోత్సాహక అంశాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చింది.

Updated Date - Nov 23 , 2025 | 12:46 AM