రాజన్నకు జ్వాలా తోరణం..
ABN , Publish Date - Nov 06 , 2025 | 12:31 AM
కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి అర్చకులు జ్వాలా తోరణం నిర్వహించారు.
వేములవాడ టౌన్, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): కార్తీక పౌర్ణమి సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం రాత్రి అర్చకులు జ్వాలా తోరణం నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రదోషకాల పూజ చేశారు. రాత్రి 10.15గంటలకు స్వామివారికి అర్చకులు మహాపూజ చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్తీకమాసోత్సవంలో భాగంగా రాజరాజేశ్వర ఆలయంలో ఉదయం స్వామివారికి 11మంది రుత్వికులతో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనుబంధ పరివార దేవతలకు అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. రాజరాజేశ్వరస్వామి ఆలయంలో స్థానిక భక్తులకు కార్తీకపౌర్ణమి సందర్భంగా గర్భాలయ దర్శనం కల్పించినప్పటికీ ఉదయం 9గంటలకే నిలిపివేసి లఘు దర్శనం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా భక్తులు వేకువజాముననే ఆలయ ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి రాజరాజేశ్వరస్వామి, భీమేశ్వరస్వామివారలకు పంచామృతాలతో అభిషేకాలు చేసి దర్శించుకున్నారు. రాజన్న ఆలయం ఎదుట రావిచెట్టు కింద, భీమేశ్వరాలయంలో ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలు వెలిగించి భక్తిప్రపత్తిని చాటారు. భీమేశ్వరాలయంలో స్వామివారికి కోడెల మొక్కులు చెల్లించి ఆర్జిత సేవలైన నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి, బిజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, వేదపండితులు, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.
భీమన్న సన్నిధిలో కార్తీక లక్షదీపోత్సవం
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భీమేశ్వరాలయం, భీమేశ్వరసదన్‌లో బుధవారం రాత్రి కార్తీక లక్ష దీపోత్సవం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్, ఈవో రమాదేవి, ఎస్పీ మహేష్ బి. గీతే, ఏఎస్పీ శేషాద్రినిరెడ్డిలు కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్, ఎస్పీలు భీమేశ్వరస్వామివారిని దర్శించుకొని కార్తీక మొక్కులు చెల్లించారు. భీమన్న సన్నిధిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సాముహిక దీపారాధన కార్యక్రమంలో ఆశేషభక్తజనం హాజరై దీపాలు వెలిగించారు. అనంతరం భక్తిగీతాలు, భజనలతో భక్తులను అలరించారు. సాముహిక దీపాలంకరణకు హాజరైన సుహాసీనులకు వాయినం పసుపు, కుంకుమ, అక్షింతలు, గాజులు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇఇ రాజేష్, టౌన్ సీఐ వీరప్రసాద్, ఏఈవో శ్రీనివాస్, ఏఈ రామకృష్ణ, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ, చింతపంటి కమలాకర్‌లు పాల్గొన్నారు.