Share News

ఉత్కంఠకు తెర

ABN , Publish Date - Jun 28 , 2025 | 01:08 AM

కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మల్కాపూర్‌, చింతకుంట, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌ గ్రామా లను కలిపి 66 డివిజన్లుగా వార్డుల పునర్విభజన చేస్తూ హద్దులతో కూడిన తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది.

ఉత్కంఠకు తెర

- వార్డుల పునర్విభజన తుదిజాబితా విడుదల

- 66 డివిజన్లకు హద్దులతో ఏర్పాటు

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ నగరపాలక సంస్థలో ఇటీవల విలీనమైన కొత్తపల్లి మున్సిపాలిటీతో పాటు మల్కాపూర్‌, చింతకుంట, గోపాల్‌పూర్‌, దుర్శేడ్‌, బొమ్మకల్‌ గ్రామా లను కలిపి 66 డివిజన్లుగా వార్డుల పునర్విభజన చేస్తూ హద్దులతో కూడిన తుది జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. మొదటి డివిజన్‌ ఆరెపల్లి, 66 చివరి డివిజన్‌గా ప్రధాన కూరగాయల మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు శుక్రవారం సీడీఎంఏ శ్రీదేవి ఉత్తర్వులు జారీ చేశారు. నగరపాలక సంస్థలో శివారు గ్రామాలను విలీనం చేయడంతో ప్రస్తుతమున్న 60 డివిజన్లను 66 డివిజన్లు చేసిన ప్రభుత్వం ఈ నెల మొదటి వారంలో వార్డుల పునర్విభజనకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 66 డివిజన్లతో కూడిన ముసాయిదా జాబితాను అధికారులు తయారు చేయగా ఆ జాబితా పూర్తిగా తప్పుల తడకగా, నిబంధనలకు విరుద్ధంగా తయారు చేశారని దీంతో ఇటు ప్రజలకు, అటు పరిపాలనాపరంగా ఉద్యోగులకు ఇబ్బందులు కలుగుతాయని అధికార, ప్రతిపక్ష పార్టీలతోపాటు చాలామంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఫ వెల్లువెత్తిన అభ్యంతరాలు

246 మంది ముసాయిదా జాబితాలోని డివిజన్లలో తప్పులు దొర్లాయని, వాటిని సవరించి తుది జాబితాను విడుదల చేయాలంటూ ఆర్జీలు పెట్టుకున్నారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ ఎంఐఎంతో కుమ్మక్కై డివిజన్ల పునర్విభజన చేయించిందని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించగా, బీజేపీ కూడా ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకు కాంగ్రెస్‌ నిబంధనలకు విరుద్ధంగా వార్డుల పునర్విభజనకు సహకరించిందని విమర్శించింది. మరోవైపు ఎంఐఎం కూడా రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేస్తున్నారని, ముసాయిదా జాబితాలోని తప్పులను సవరించి వార్డుల పునర్విభజన చేయాలంటూ అధికారులను కోరింది. బీఆర్‌ఎస్‌ నాయకులు తప్పులను సవరించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని కూడా హెచ్చరిస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఇలా వివిధ పార్టీలకు చెందిన నాయకులతో పాటు కార్పొరేటర్లుగా పోటీ చేయాలనుకుంటున్న ఔత్సాహికులు, దళిత సంఘాల నాయకులు, విలీన గ్రామాల నాయకులు కూడా ముసాయిదా జాబితాపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌, నగరపాలక సంస్థ స్పెషల్‌ ఆఫీసర్‌ పమేలా సత్పతి ఆదేశాల మేరకు కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ మున్సిపల్‌ టౌన్‌ ప్లానింగ్‌, రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి అభ్యంతరాలను పరిశీలించి తప్పులు లేకుండా క్షేత్రస్థాయికి వెళ్లి తుది జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరపడమే కాకుండా అభ్యంతరాలు వ్యక్తం చేసిన వారి నుంచి కూడా సమాచారం తీసుకున్నారు. తుది జాబితాను తయారు చేసి ఈ నెల 19న కలెక్టర్‌ ఆమోదంతో ప్రభుత్వానికి పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 30 మున్సిపాలిటీలకు సంబంధించిన వార్డుల పునర్విభజనకు సంబంధించిన తుది జాబితాలను పరిశీలన చేసి ఈ నెల 21న తుది జా బితాలను ప్రకటిస్తామని ముందుగా పేర్కొన్నారు. దీంతో ఈ నెల 21 నుంచి తుది జాబితా కోసం ఔత్సాహిక అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు నిరీక్షించారు. చివరకు ఎట్టకేలకు శుక్రవారం రాత్రి సీడీఎంఏ వార్డుల పునర్విభజన తుది జాబితాను విడుదల చేశారు. అయితే ఈ జాబితాలో ఒక్కో డివిజన్‌కు సంబంధించిన ఉత్తరం నుంచి హద్దులను ప్రారంభించి దక్షిణం, తూర్పు, పడమ రగా ఇంటి నెంబర్లను పేర్కొంటూ డివిజన్లను ప్రకటించింది. అయితే కాలనీల పేర్లను ప్రకటించక పోవడంతో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నది. ముసాయిదాలోని తప్పొప్పులను, లోపాలను సవరించి తుది జాబితాను తయారు చేశారో, లేదో అన్నది త్వరలో తేలిపోనుంది

Updated Date - Jun 28 , 2025 | 01:08 AM