నిరీక్షణకు తెర
ABN , Publish Date - Jul 23 , 2025 | 01:17 AM
రేషన్‌కార్డుల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు మండలాల వారీగా కార్యక్రమాలను నిర్వహించి కార్డుల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
రేషన్‌కార్డుల పంపిణీకి ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు మండలాల వారీగా కార్యక్రమాలను నిర్వహించి కార్డుల పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఇన్‌చార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ ఈ పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించింది. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో కూడా కొత్త రేషన్ కార్డుల కోసం, పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యుల నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ప్రజలకు సూచించింది. ఈ మేరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించి అర్హులైన వారందరికి రేషన్‌కార్డులను మంజూరు చేశారు. పాత రేషన్ కార్డుల్లో కొత్త సభ్యులను నమోదు చేశారు. ఈ కార్డులను ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ఆన్‌లైన్‌లో ముద్రించిన కార్డులను ప్రస్తుతం అందరికి అందజేసి ఆ తర్వాత డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఫ 47 వేల కార్డుల్లో కొత్త సభ్యుల నమోదు
కొత్తగా జిల్లాలో ఈ నెల 21 వరకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో చేసుకున్న దరఖాస్తుల మేరకు 34 వేల పైచిలుకు మందికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. మరో 47 వేల కార్డుల్లో కొత్త సభ్యుల పేర్లు నమోదు చేసి ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఫ ఏళ్లుగా ఎదురుచూపులు
కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడక ముందే రేషన్ కార్డుల జారీ నిలిచిపోయింది. వేలాదిమంది పలు విడతలుగా తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తులు చేసుకుని ఎదురుచూస్తూ వచ్చారు. ఉద్యమకాలంలో ఉన్న ప్రభుత్వం ఆనాటి రాజకీయ పరిస్థితుల్లో రేషన్ కార్డుల జారీ అంశాన్ని పరిశీలించే అవకాశం లేకుండా పోయింది. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడి బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చింది. బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి పదేళ్లు ప్రభుత్వాన్ని నిర్వహించింది. అయినా ప్రజల కొత్త రేషన్ కార్డుల ఆశలు తీరకుండా పోయాయి. రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగి అధికారంలోకి వచ్చిన ఆ ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని పక్కనపెడుతూ వచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించి కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. రెండు దశలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి దరఖాస్తులను స్వీకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. కానీ రేషన్‌కార్డుల జారీ మాత్రం పెండింగ్‌లోనే ఉంది. ఆ తర్వాత మళ్లీ ఆన్‌లైన్‌లో దరఖాస్తులను చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తులతోపాటు ఆన్‌లైన్ దరఖాస్తులను కూడా పరిగణలోకి తీసుకుని క్షేత్రస్థాయి పరిశీలనచేసి అర్హులైనవారికి రేషన్‌కార్డుల జారీ చేయాలని నిర్ణయించారు.
ఫ మండలాల వారీగా కార్యక్రమాలు
కొత్త రేషన్‌కార్డుల జారీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 14న లాంఛనంగా శ్రీకారం చుట్టారు. ఆ క్రమంలోనే ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు మండలాల వారీగా కార్యక్రమాలు నిర్వహించి అర్హులైన వారందరికి రేషన్‌కార్డుల పంపిణీకి ఆదేశాలు జారీ అయ్యాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు, కలెక్టర్ ఆధ్వర్యంలో రేషన్‌కార్డుల పంపిణీ ప్రక్రియ జరగనున్నది. ఈ సంవత్సరం జనవరి 1 నాటి లెక్కల ప్రకారం జిల్లాలో 2,76,895 రేషన్‌కార్డులు ఉండగా అందులో 8,04,498 మంది సభ్యులుగా నమోదై ఉన్నారు. ప్రజాపాలన, ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ అనంతరం కొత్తగా జారీ చేసిన కార్డులను కలుపుకుని ఈ నెల 21 వరకు జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య 3,11,334కు చేరింది. పాత కార్డుల్లో కొత్త సభ్యులను కూడా చేర్చారు. దీంతో ప్రస్తుతం ఆయా కార్డుల్లో ఉన్నవారి సంఖ్య 9,29,525 మందికి చేరింది. ఇంకా కార్డులు మంజూరు కావాల్సి ఉన్నది. రేషన్‌కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ కాబట్టి కొత్తగా వచ్చినవారు, ఇప్పటికీ దరఖాస్తులు చేసుకోనివారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునేందుకు వీలుందని ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా 34,439 కొత్త కార్డులు పంపిణీ కానున్నాయి. సుమారు 47,120 మంది కొత్తగా రేషన్‌కార్డుల్లో సభ్యులుగా చేరారు. వీరందరికి సెప్టెంబరు నుంచి సరుకులు మంజూరు కానున్నాయి. కొత్త రేషన్‌కార్డుల పొందినవారు తమ సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి రేషన్ పొందవచ్చు.