అయోమయానికి తెర..
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:08 AM
మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఉచిత చేప పిల్లలు(సీడ్) పంపిణీపై నెలకొన్న అయోమయానికి తెరపడింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
మత్స్యకారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ఉచిత చేప పిల్లలు(సీడ్) పంపిణీపై నెలకొన్న అయోమయానికి తెరపడింది. చేప పిల్లల పంపిణీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సోమవారం నుంచి టెండర్ ప్రక్రియ ప్రారంభించే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యకారుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి ఎల్లంపల్లి నీళ్లను ఎత్తిపోతలతో నింపుతున్నారు. ఈ నేపథ్యంలో చేప పిల్లల పంపిణీ ప్రక్రియ సెప్టెంబరు 15లోగా పూర్తిచేసే విధంగా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు జిల్లా మత్స్యశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చేప పిల్లల పంపిణీ దాదాపు 1.42 కోట్ల మేరకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది.
జిల్లాలో మత్స్య సహకార పరిస్థితి ఇది...
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో నిత్యం నీటిపై పోరాటం చేస్తూ ఉపాధిని అందుకుంటున్నారు. జిల్లాలో మత్స్య శాఖ పరిధిలో 401 చెరువులు ఉన్నాయి. 168మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు ఉండగా, 9220 మంది సభ్యులు ఉన్నారు. 48 మహిళ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలు, రెండు ప్రాథమిక సహకార సంఘాలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం వరకు మిడ్ మానేరులో చేపలు పట్టడానికి 741 మంది మత్స్యకారులకు, ఎగువ మానేరు ప్రాజెక్ట్‌లో 251 మంది, అన్నపూర్ణ ప్రాజెక్ట్‌లో 52 మంది మత్స్యకారులకు లైసెన్స్‌లు జారీ చేశారు.
నీటి సామర్థ్యం మేరకు పంపిణీ..
వానాకాలం సీజన్‌లో ఆలస్యంగా వర్షాలు మొదలయ్యాయి. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతోంది. చెరువులు, కుంటల్లో చేపలు పెంచేందుకు ఉన్న నీటి సామర్థ్యం మేరకు చేప పిల్లలను వదిలే విధంగా మత్స్య శాఖ నిర్ణయించింది. జిల్లాలో నీటి లభ్యతపై మత్స్యశాఖ సమగ్ర సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ మేరకు నివేదిక అందించాలని తహసీల్దార్‌లకు జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్‌లో నివేదిక ప్రకారం చెరువుల్లో చేపపిల్లలను వదలనున్నారు.
టెండర్ల ప్రక్రియ వేగవంతం
గత సంవత్సరం చేప పిల్లల పంపిణీకి ఆలస్యంగా టెండర్లు జరగడంతో పాటు సమయం లేకపోవడంతో అంచనా లక్ష్యాన్ని సగానికి తగ్గించి చేపపిల్లలను వదిలారు. 2024-2025 సంవత్సరానికి రూ.1.59 కోట్ల విలువైన 1.41 కోట్ల చేప పిల్లల సరఫరాకు టెండర్లు పిలిచిన చివరకు 46.71 లక్షల చేపలను 324 చెరువులు కుంటల్లో వదిలారు. దీంతో చేపల ఎదుగుదల లేకపోవడంతో మత్స్యకారులకు అనుకున్న మేరకు లబ్ధి చేకూరలేదు. ఈసారి ఆగస్టు 30వ తేదీ వరకే టెండర్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 18న టెండర్లకు ఆహ్వానం పలకనున్నారు. టెండర్లను ఈనెల 30 తేదీన ముగించి అదేరోజు టెండర్లను ప్రకటిస్తారు. టెండర్‌లో పాల్గొనే వారికి బిడ్ ఫీజు రూ.25 వేలు నిర్ణయించారు. టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే సెప్టెంబర్ 15లోగా చేప పిల్లల పంపిణీ కూడా పూర్తిచేస్తారు.
జిల్లాలో ఇప్పటీ వరకు చేపపిల్లలు వదిలిన తీరు
సంవత్సరం చెరువులు /కుంటలు /జలాశయాలు వదిలినవి
2016- 17 92 30.5 లక్షలు
2017- 18 66 20 లక్షలు
2018- 19 95 57.48లక్షలు
2019- 20 313 100.91 లక్షలు
2020- 21 362 115.61 లక్షలు
2021- 22 392 119.25 లక్షలు
2022 -23 392 138.27 లక్షలు
2023 -24 440 141.00 లక్షలు
2024-25 324 46.71 లక్షలు