Share News

మూడో విడతలో హోరాహోరీ

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:16 AM

పంచాయతీ ఎన్నికల్లో మొదటి, రెండు విడతల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించినా మూడో విడతలో బీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కూడా ఇక్కడ పలు పంచాయతీల్లో తమ పట్టును నిరూపించుకున్నది. ఈ విడతలో 111 స్థానాలకు ఎన్నికలు జరుగగా 38 స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 35 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 19 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారు.

మూడో విడతలో హోరాహోరీ

- కాంగ్రెస్‌ 38, బీఆర్‌ఎస్‌కు 35 సర్పంచ పదవులు

- బీజేపీకి 19, స్వతంత్ర సర్పంచలు 19 మంది

- 86.42 శాతం పోలింగ్‌

- ప్రశాంతంగా ముగిసిన ‘పంచాయతీ’ పోరు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

పంచాయతీ ఎన్నికల్లో మొదటి, రెండు విడతల్లో కాంగ్రెస్‌ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించినా మూడో విడతలో బీఆర్‌ఎస్‌ గట్టి పోటీ ఇచ్చింది. బీజేపీ కూడా ఇక్కడ పలు పంచాయతీల్లో తమ పట్టును నిరూపించుకున్నది. ఈ విడతలో 111 స్థానాలకు ఎన్నికలు జరుగగా 38 స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు విజయం సాధించారు. 35 స్థానాల్లో బీఆర్‌ఎస్‌, 19 స్థానాల్లో బీజేపీ మద్దతుదారులు సర్పంచులుగా గెలుపొందారు. 19 పంచాయతీల్లో స్వతంత్రులు గెలిచారు. ఇల్లందకుంట మండలం పాతర్లపల్లిలో బీజేపీ అభ్యర్థి బైరెడ్డి రమణారెడ్డి ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించగా, అదే మండలంలోని శ్రీరాములపల్లి గ్రామంలో కాంగ్రెస్‌కు చెందిన జి.రమ్య రెండు ఓట్లతో, వీణవంక మండలం కిష్టంపేటలో కాంగ్రెస్‌ బలపరిచిన ఎం సంపత మూడు ఓట్లతో, సైదాపూర్‌ మండలం గొల్లెగూడెం పంచాయతీలో కాంగ్రెస్‌కు చెందిన మౌనిక మూడు ఓట్లతో, అదే మండలం నల్లరామయ్యపల్లిలో బీఆర్‌ఎస్‌ బలపరిచిన పి రవీందర్‌రావు నాలుగు ఓట్లతో సర్పంచులుగా గెలుపొందారు. ఇల్లందకుంట మండలం వంతపడుల పంచాయతీలో స్వతంత్ర అభ్యర్థి ఎస్‌ మాధవి తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈనెల 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో జరిగిన 316 గ్రామపంచాయతీల్లో అధికార కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన 125 మంది, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు 98 మంది, బీజేపీ మద్దతుదారులు 42 మంది సర్పంచులుగా గెలుపొందారు. 51 మంది ఇండిపెండెంట్లు విజయం సాధించారు.

ఫ బారులు తీరిన ఓటర్లు

మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఈ విడతలో 111 గ్రామపంచాయతీల్లో 108 సర్పంచు పదవులు, 850 వార్డుసభ్యుల పదవులకు ఎన్నికలు జరిగాయి. భారీ బందోబస్తు మధ్య ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్‌ జరిగింది. ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 1,42,637 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఐదు మండలాల్లో కలిపి 86.42 శాతం పోలింగ్‌ నమోదైంది. సైదాపూర్‌ మండలం ఆరెపల్లి సర్పంచుగా వర్నెలావణ్య, ఇల్లందకుంట బోగంపాడ్‌ సర్పంచుగా నిర్మలా, వీణవంక మండలం మల్లన్నపల్లి సర్పంచుగా కరకొండ సరోజన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఫ ఓటు హక్కును వినియోగించుకున్న 1,42,637 మంది ఓటర్లు

చివరి విడతలో ఇల్లందకుంట, హుజూరాబాద్‌, జమ్మికుంట, వీణవంక, సైదాపూర్‌ మండలాల్లోని 111 గ్రామాల్లోని 108 సర్పంచ, 850 వార్డులకు నిర్వహించిన ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.

- ఇల్లందకుంట మండలంలో 17 సర్పంచ, 132 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు నిర్వహించారు. 22,720 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 11,175 మంది పురుషులు, 11,544 మంది మహిళలు, ఇతరులు ఒకరు ఉన్నారు. 87.05 పోలింగ్‌ శాతం నమోదైంది.

- హుజురాబాద్‌ మండలంలో 20 సర్పంచ, 136 వార్డు సభ్యుల పదవులకు జరిగిన ఎన్నికల్లో 30,891 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14,915 మంది పురుషులు,. 15,976 మంది మహిళలు ఓటు వేశారు. 85.94 శాతం పోలింగ్‌ నమోదైంది.

- జమ్మికుంట మండలంలో 20 సర్పంచ, 155 వార్డు సభ్యుల పదవులకు నిర్వహించిన ఎన్నికల్లో 12,149 మంది పురుషులు, 12,649 మంది మహిళలు, మొత్తం 24,798 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.72 శాతం పోలింగ్‌ నమోదైంది.

- వీణవంక మండలంలో 26 సర్పంచ పదవులు, 221 వార్డులకు పోలింగ్‌ జరిగింది. 18,140 మంది పురుషులు, 18,489 మంది మహిళలు, ఇతరులు ఒకరు, మొత్తం 36,630 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85.87 శాతం పోలింగ్‌ నమోదైంది.

సైదాపూర్‌ మండలంలోని 26 సర్పంచ పదవులు, 176 వార్డు సభ్యులకు జరిగిన ఎన్నికల్లో 13,619 మంది పురుషులు, 13,978 మంది మహిళలు, ఇతరులు ఒకరు మొత్తం 27,598 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మండలంలో అత్యధికంగా 87.85 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఫ బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు

పోలీస్‌ బందోబస్తు మధ్య మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. సర్పంచ, వార్డుసభ్యుల బ్యాలెట్‌లను వేరు చేసి ముందుగా వార్డుసభ్యుల ఓట్లను లెక్కించారు. అనంతరం అన్ని వార్డుల్లోని సర్పంచు బ్యాలెట్‌ పేపర్లన్నింటిని కలిపి 25 ఓట్లకు ఓ కట్ట కట్టి బ్యాలెట్లను లెక్కించారు.

ఫ వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల సరళి పరిశీలన

మూడో విడత జరిగే గ్రామపంచాయతీ ఎన్నికల సరళిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ పమేలాసత్పతి కలెక్టరేట్‌ నుంచి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ముందుగా ఆమె సైదాపూర్‌ మండలంలోని దుద్దెనపల్లి, ఎలబోతారం, హుజురాబాద్‌ మండలంలోని తుమ్మనపల్లి గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. జమ్మికుంట మండలంలోని మాచినపల్లి, జగ్గయ్యపల్లి,వీణవంక మండలం రెడ్డిపల్లి, చల్లూరు, మామిడాలపల్లి గ్రామాల్లో కౌంటింగ్‌ ప్రక్రియను కలెక్టర్‌ పర్యవేక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించామని, పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియ సక్రమంగా పూర్తయిందని అన్నారు.

ఫ ఓటేసేందుకు ఉత్సాహం చూపిన వృద్ధులు

హుజూరాబాద్‌ రూరల్‌: మండలంలో జరిగిన మూడో విడత ఎన్నికల పోలింగ్‌లో ఆయా గ్రామాల్లోని వృద్ధులు ఓటేసేందుకు ఉత్సాహం చూపారు. ఉదయం 7 గంటలకే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు పోలీసులు సహాయం చేశారు.

Updated Date - Dec 18 , 2025 | 02:16 AM