Share News

24/7 డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు

ABN , Publish Date - Aug 19 , 2025 | 12:58 AM

మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కరీంనగర్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.

 24/7 డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు

- ఈ యేడు కేసుల్లో చిక్కిన వారు 1,789 మంది

- రూ. 64.1 లక్షల జరిమానా

- గత ఏడాది 6,005 కేసుల్లో 147 మందికి జైలుశిక్ష

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిపై కరీంనగర్‌ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నగరవ్యాప్తంగా ప్రతి రోజు ట్రాఫిక్‌ పోలీసులు, సివిల్‌ పోలీసులు పగలు, రాత్రి సమయాల్లో బ్రీత్‌ఎనలైజర్‌ పరికరాలతో డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇదివరకు రాత్రి పూట మాత్రమే డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. తాజాగా పగలు, రాత్రి అంటూ తేడా లేకుండా ఆకస్మికంగా రోడ్లపై తనిఖీ నిర్వహిస్తున్నారు. ఒక్కసారి డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీల్లో వాహనదారుడు పోలీసులకు చిక్కితే జైలు శిక్ష లేదా జరిమానా నుంచి తప్పించుకోలేక పోతున్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌ కేసుల్లో న్యాయస్థానాలు ఒక రోజు నుంచి 3 నెలల వరకు జైలుశిక్షలు విధిస్తున్నాయి. దీంతో వాహనదారులు బెంబేలెత్తున్నారు.

ఫ మద్యం మత్తులో ప్రమాదాలు

మద్యం సేవించి వాహనాలు నడుపడంతో ప్రమాదాలు జరిగి వాహనం నడిపివారితో పాటు రోడ్డుపై వెళ్తూ అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రయాణికులను చేరవేసే వాహనాల డ్రైవర్లకు కూడా డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తుండడంతో వివిధ రకాల ఇబ్బందులు తగ్గిపోయాయి. మహిళలు అభద్రతాభావానికి లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ప్రయాణాలను కొనసాగిస్తున్నారు.

ఫ ఈ ఏడాది జనవరి నుంచి జూలై చివరి వరకు కరీంనగర్‌ వ్యాప్తంగా నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌లో 1,789 మంది మందుబాబులు పోలీసులకు చిక్కగా వారికి 64,10172 రూపాయలు జరిమానా కోర్టు విధించింది.

ఫ 2024లో కమిషనరేట్‌ వ్యాప్తంగా 6,005 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదుకాగా 147 మందికి జైలుశిక్ష పడింది. గత ఏడాదిలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 203 మంది మృత్యువాత పడ్డారు. ఇందులో ఎక్కువ వరకు మద్యం మత్తులో డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదాలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

ఫ 2025 జనవరి నుంచి జూలై వరకు డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల వివరాలు

-------------------------------------------------------------------------

2025 డ్రంకెన్‌డ్రైవ్‌ కేసులు జరిమానా రూ.

-------------------------------------------------------------------------

జనవరి 256 9,31,304

ఫిబ్రవరి 135 4,59,400

మార్చి 325 9,21,900

ఏప్రిల్‌ 232 7,99,228

మే 226 10,42,500

జూన్‌ 378 13,63,402

జూలై 237 8,92,438

--------------------------------------------------------------------------

మొత్తం 1,789 64,10,172

--------------------------------------------------------------------------

ఫ ప్రమాదాల నియంత్రణే లక్ష్యం

- కరీముల్లాఖాన్‌, కరీంనగర్‌ ట్రాఫిక్‌ సీఐ

నగరంలో ప్రమాదాల నియంత్రణ కోసమే డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంటి నుంచి వాహనంపై బయటకు బయలుదేరిన వాహనదారుడు(కుటుంబ సభ్యుడు) తిరిగి క్షేమంగా ఇంటికి చేరడం ప్రధాన లక్ష్యంగా ట్రాఫిక్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాం. మద్యం సేవించిన సమయంలో వాహనాలు నడపకుండా ఇంటివద్దనే ఉండాలి. డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి.

4 కెఎన్‌ఆర్‌ 18ఎఫ్‌

-------------------------------------

1921 - బ్రీత్‌ఎనలైజర్‌లో నమోదైన 48 ఎంజీఎం ఆల్కాహాల్‌ శాతం

-------------------------------------

ఒకరికి 3 రోజుల జైలు శిక్ష, 10 వేల జరిమానా

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి డ్రైవింగ్‌ చేస్తూ పోలీసుల తనిఖీలో పట్టుబడిన ఓ వ్యక్తికి 3 రోజుల జైలు శిక్షతోపాటు 10 వేల రూపాయలు జరిమానా విధిస్తూ కరీంనగర్‌ సెకండ్‌ క్లాస్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు సోమవారం తీర్పు వెలువరించారు. కొత్తపల్లి సీఐ బిల్ల కోటేశ్వర్‌ తెలిపిన ప్రకారం... కొత్తపల్లి పోలీసు ఠాణా పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలో కారు నడుపుతున్న ఓ వ్యక్తిని బ్రీత్‌ఎనలైజర్‌తో తనిఖీ చేయగా 100 ఎంఎల్‌ రక్తంలో 48 ఎంజీ ఆల్కాహాల్‌ శాతం నమోదైంది. ఈ మేరకు అతనిపై కేసు నమోదు చేసిన కొత్తపల్లి పోలీసులు సోమవారం కరీంనగర్‌ సెకండ్‌ క్లాస్‌ స్పెషల్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి రవీందర్‌రెడ్డి నిందితుడికి 3 రోజుల సాధారణ జైలు శిక్ష, పదివేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. శిక్ష అమలు నిమిత్తం నిందితుడిని కరీంనగర్‌ జైలుకు తరలించారు. 100 ఎంఎల్‌ రక్తంలో 70 ఎంజీ ఆల్కాహాల్‌ వరకు జైలు శిక్ష ఉండదని, జరిమానా మాత్రమే ఉంటుందని భావిస్తున్న వాహనదారులు ఈ కోర్టు తీర్పుతో ఉలిక్కి పడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు ఉంటాయని కొత్తపల్లి సీఐ హెచ్చరించారు.

Updated Date - Aug 19 , 2025 | 12:58 AM