Share News

24/7 డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:16 AM

మద్యం మత్తులో వాహనాలు నడిపితే ఇక జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే.

24/7 డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు

కరీంనగర్‌ క్రైం, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో వాహనాలు నడిపితే ఇక జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే. ఇప్పటి వరకు రాత్రి సమయాల్లో డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఇక నుంచి 24 గంటలపాటు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టాలని నిర్ణయించారు. సమయం అనేది లేకుండా ఎప్పుడుపడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ పోలీసులు డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు చేపట్టనున్నారు. ఇందుకోసం బ్రీత్‌ఎనలైజర్‌ పరికరాలు మరిన్ని సమకూర్చుకుంటున్నారు. 2024లో ఏడాది కాలంలో మోతాదుకు మించి అధికంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ 6,005 మంది వాహనదారులు పట్టుబడ్డారు. ఇందులో 147 మంది వాహనదారులకు కోర్టు జైలు శిక్ష విధించింది. రాత్రి వేళల్లో జరిగే రోడ్డు ప్రమాదాలలో 90 శాతం వరకు మద్యం సేవించి వాహనాలు నడపడంతోనే జరుగుతున్నాయని గతంలో జరిగిన ప్రమాదాల విశ్లేషణలో వెల్లడైంది. 2024లో 184 మంది రోడ్డు ప్రమాదాల బారినపడి మృతిచెందారు.

కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌

పోలీసులు నిర్వహిస్తున్న డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలలో పట్టుబడిన వాహనదారులను కోర్టుల్లో హాజరుపరచి వారిలో మార్పుతీసుకురావటానికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడిన వహనదారులు జరిమానా చెల్లించటానికి, చివరకు జైలు శిక్షకు కూడా అంగీకరిస్తుండగా కుటుంబ సభ్యుల మధ్య కౌన్సెలింగ్‌ అంటేనే జంకుతున్నారు. మళ్లీ మద్యం సేవించి వాహనం నడపనంటూ కుటుంబ సభ్యుల మద్య ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.

Updated Date - Apr 11 , 2025 | 01:16 AM