151 వాహనాల సీజ్
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:40 AM
శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిరక్షణలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని 20 ప్రధాన కూడళ్ల వద్ద దాదాపు 150 మంది పోలీసులతో నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు.
కరీంనగర్ క్రైం, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతల పర్యవేక్షణ, పరిరక్షణలో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనర్ పరిధిలో శనివారం రాత్రి పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. నగరంలోని 20 ప్రధాన కూడళ్ల వద్ద దాదాపు 150 మంది పోలీసులతో నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో 151 వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రీవెంటివ్ చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిని, నంబర్ ప్లేట్ లేని, టాంపర్ చేసిన వాహనాలను, సరైన ధృవపత్రాలు లేని వాహనాలను గుర్తించి కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్‌లో 53 వాహనాలు, నంబర్ ప్లేట్ సరిగా లేని, టాంపర్ చేసినవి 80, సరైన ధ్రువపత్రాలు లేనివి 11, నంబర్ ప్లేట్ లేనివి ఏడు వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఆకస్మిక తనిఖీలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తెలిపారు. ప్రజలు తమ వాహనాలను సరైన ధృవపత్రాలతో, నిబంధనలకు అనుగుణంగా నడపాలని సూచించారు.