Environmental Committee: రక్షిత అటవీ భూమి అనొచ్చా
ABN , Publish Date - Apr 11 , 2025 | 04:25 AM
కంచగచ్చిబౌలి భూములపై కేంద్ర సాధికార కమిటీ పర్యటించి వివాదాస్పద 400 ఎకరాల భూమి అటవీ భూమిగా గుర్తించదలిచింది. రాష్ట్ర ప్రభుత్వం, రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి అటవీ భూమిగా సంబంధం లేని భూమి అని స్పష్టం చేసింది

కంచగచ్చిబౌలి 400 ఎకరాలకుఆ అర్హత ఉందా?
ఎన్ని చెట్లున్నాయి? ఏయే రకాలున్నాయి?
వాటిని ఏ పద్ధతుల్లో తొలగించారు?
వన్యప్రాణుల పునరావాసానికి ఏం చేస్తున్నారు?
అధికారుల్ని ప్రశ్నించిన కేంద్ర సాధికార కమిటీ
పది అంశాలపై సమాచార సేకరణ
అధికారులు, విద్యార్థులతో విడివిడిగా భేటీ
అటవీ భూమి కాదని స్పష్టం చేసిన ప్రభుత్వం
‘కాంచ అస్తంబల్ పోరంబోకు సర్కారీ’ అని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా ఉందని వెల్లడి
వివరాలతో సాధికార కమిటీకి నివేదిక
3 జింకల చావుకు రేవంతే కారణం సల్మాన్‌లా ఈయననూ శిక్షించాలి: హరీశ్
2185 ఎకరాలు వర్సిటీకి రిజిస్టర్ చేయండి సాధికార కమిటీకి బీజేపీ ఎంపీల విజ్ఞప్తి
హైదరాబాద్, ఏప్రిల్, 10(ఆంధ్రజ్యోతి): కంచగచ్చిబౌలి భూముల వ్యవహారంపై అధ్యయనానికి వచ్చిన పర్యావరణ, అటవీ శాఖల కేంద్ర సాధికార కమిటీ గురువారం ఉదయం వివాదాస్పద 400 ఎకరాలను సందర్శించింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులతో విడివిడిగా సమావేశమైంది. మొదట తాజ్ కృష్ణ హోటల్లో అధికారులతో సుదీర్ఘంగా మూడు గంటలపాటు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, డీజీపీ జితేందర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి, రెవెన్యూ, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం సాధికార కమిటీ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంగణంలో విశ్వవిద్యాలయ ఉద్యోగులు, విద్యార్థులతో భేటీ జరిపింది. విద్యార్థుల నుంచి వ్యక్తమవుతున్న అభ్యంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ భూములకు రక్షిత అటవీ ప్రాంతం అనేందుకు అర్హత ఉందా? అనే అంశంపైనే సాధికార కమిటీ ప్రధానంగా దృష్టి సారించింది. ముందే సిద్ధం చేసుకున్న పది అంశాలపై కమిటీ సమాచారం సేకరించింది. ఉదయాన్నే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా కంచ గచ్చిబౌలి స్థలంలో సిద్ధంగా ఉండగా, సెంట్రల్ ఎంపవర్ కమిటీ ఛైర్మన్ సిద్ధాంత దాస్, మరో ఇద్దరు సభ్యులు అక్కడికి వచ్చారు.
టీజీఐఐసీ, పంచాయతీరాజ్, రెవెన్యూ, అటవీ శాఖ, పోలీ్‌సతోపాటు ఇతర విభాగాల కీలక అధికారులు జిల్లా కలెక్టర్ నుంచి పది అంశాలపై వివరాలు సేకరించింది. రక్షిత అటవీ ప్రాంతం అనేందుకు అర్హత ఉందా? లేదా? ఎన్ని చెట్లు ఉన్నాయి? ఎన్ని రకాలు ఉన్నాయి? ఎక్కువ సంఖ్యలో ఉన్న చెట్లు ఏమిటి? ఇటీవల చెట్ల తొలగింపు చేపట్టినపుడు ఏ పద్ధతిని ఉయోగించారు. వన్యప్రాణుల పరిస్థితి ఏమిటి? పునరావారం కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారు? తదితర వివరాలు సేకరించారు. చెట్ల తొలగింపును అడ్డుకునేందుకు జరిగిన ఆందోళనల్లో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితులు, పోలీ్‌సలు నమోదు చేసిన కేసుల వివరాలు అందజేయాలని సైబరాబాద్ కమిషనర్‌ను అడిగింది. వివాదానికి కారణమైన భూమి అటవీ శాఖకు సంబంధించినది కాదని, రెవెన్యూ అధికారులదేనని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు నివేదిక అందించారు. ఇక్కడ ఎక్కువగా సుబాబుల్ చెట్లు ఉన్నాయని, అతి కొద్ది మొత్తంలోనే వేప, ఇతర చెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. వన్య ప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు కూడా పొందుపరిచారు. రెండు రోజుల పర్యటనకు బుధవారమే హైదరాబాద్ వచ్చిన కమిటీ తొలిరోజు సీఎస్, ఇతర ఉన్నతాధికారులతో సచివాలయంలో సమావేశమైంది. రెండో రోజు గురువారం కంచ గచ్చిబౌలి భూముల్లో పర్యటించి వాస్తవ పరిస్థితుల్ని నేరుగా తెలుసుకుంది. సేకరించిన సమాచారంపై ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఈ నెల 16న సుప్రీంకోర్టుకు నివేదిక అందజేయనుంది.
అటవీ భూమి అనే ఆధారాలు ఎక్కడా లేవు
కంచ గచ్చిబౌలి సర్వే నంబరులో 25లోని 400 ఎకరాలు అటవీ భూమి కాదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం వివరాలను నివేదిక రూపంలో సాధికార కమిటీకి అందజేసింది. రంగారెడ్డి జిల్లా శేర్‌లింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామం సర్వే నంబరు 25లో 2324.05 ఎకరాల భూమి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదేనని పేర్కొంది. ఈ భూమిని ‘కాంచ అస్తంబల్ పోరంబోకు సర్కారీ’ అని రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్నారని తెలిపింది. 1975లో అప్పటి ప్రభుత్వం సర్వే నంబరు 25లోని మొత్తం భూమిని విశ్వవిద్యాలయానికి కేటాయించిందని ప్రస్తావించింది. రెవెన్యూ, అటవీ రికార్డుల్లో ఎక్కడా దీన్ని అటవీ భూమిగా పేర్కొనలేదని తేల్చిచెప్పింది. 9-8-2003న అప్పటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకుందని, అందులో భాగంగా గచ్చిబౌలిలోని 400 ఎకరాలతో పాటు మామిడిపల్లి గ్రామంలోని మరో 450 ఎకరాలను ఆ సంస్థకు ఇవ్వడానికి సిద్ధపడిందని గుర్తు చేసింది. అందుకోసం విశ్వవిద్యాలయం పరిధిలోని 534.28 ఎకరాలు తీసుకుని, అందులో 400 ఎకరాలు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థకు, 134.28 ఎకరాలను ఎన్జీవోలకు అప్పగించిందని చెప్పింది. అప్పటి విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ 3-2-2004 తేదీన శేర్‌లింగంపల్లి రెవెన్యూ అధికారుల సమక్షంలో పంచనామా ద్వారా భూమిని ప్రభుత్వానికి అప్పగించారని తెలిపింది. బదులుగా రాష్ట్ర ప్రభుత్వం సర్వే నంబరు 36లో(గోపనపల్లి గ్రామం) 191.36 ఎకరాలు, సర్వే నంబరు 37లో 205.20 ఎకరాలు కలిపి 397 ఎకరాలను ప్రత్యామ్నాయ భూమిగా విశ్వవిద్యాలయానికి కేటాయించినట్లు వెల్లడించింది. విశ్వవిద్యాలయ రిజిస్టార్ 3-2-2004 తేదీన పంచనామా ద్వారా 397 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారని చెప్పింది.
400 ఎకరాలకు బదులుగా విశ్వవిద్యాలయం 397 ఎకరాలను తీసుకున్నందున 400 ఎకరాలపై హక్కును వదులుకున్నట్లు అయ్యిందని తెలిపింది. రాష్ట్ర విభజన జరిగి, తెలంగాణ ఏర్పడిన తర్వాత 2017లో అప్పటి ప్రభుత్వం టీజీ ఎన్జీవో కాలనీకి అవసరమైన రహదారి కోసం భూమిని సిద్ధం చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశిస్తూ 2-1-2017న మెమో ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం ప్రస్తావించింది. రహదారి పనులపై అభ్యంతరం తెలుపుతూ వర్సిటీ అధికారులు హైకోర్టును ఆశ్రయించగా 400 ఎకరాలపై వర్సిటీకి ఎలాంటి హక్కు లేదని హైకోర్టు కొట్టేసిందని గుర్తు చేసింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్కొన్న కంచా అంటే మేత.. లేదా వ్యర్థభూమి అని అర్థమని, ఏనాడూ అటవీ భూమిగా నోటిఫై చేయలేదని ప్రభుత్వం తెలిపింది. ఈ భూమితో అటవీ శాఖకు సంబంధం లేదని అటవీ శాఖ అధికారులు హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చింది.
పోరాటం కొనసాగిస్తాం
సాధికార కమిటీ ఉదయం 8.30 గంటలకే కంచ గచ్చిబౌలికి వచ్చింది. రెండు గంటల పాటు వివాదాస్పద భూములను పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులంతా పక్కనే ఉన్నారు. శేరిలింగంపల్లి రెవెన్యూ యంత్రాంగం తెల్లవారుజామునే అక్కడికి వచ్చింది. కమిటీ వద్దకు వెళ్లేందుకు హెచ్‌సీయూ విద్యార్థి నేతలు ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. ఫోన్ ద్వారా పలుమార్లు అడగ్గా ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో సమావేశమయ్యేందుకు సీఈసీ అంగీకరించింది. విద్యార్థుల నుంచి ఉమేశ్ అంబేద్కర్, ఆకాశ్ కుమార్, సులేమాన్ సాధికార కమిటీతో భేటీకి హాజరయ్యారు. విద్యార్థుల తరఫున వీరు నివేదిక అందించారు. 400 ఎకరాల్లో జీవ వైవిధ్యాన్ని కాపాడటం కోసం తమ పోరాటం కొనసాగుతుందని, భూమిని వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తామని ప్రకటించారు.